టోక్యో: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంపం కారణంగా 1 మీటర్ల (3.28 అడుగులు) ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ (JMA) తెలిపింది. నాగసాకికి 80 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. జపాన్‌లోని దక్షిణ క్యుషు (Kyushu) ద్వీపంలో ఉన్న కుమమోటో, నగాసాకి, కగోషిమా, ఫుకుయోకా, సాగా, ఒయిటా, మియజాకి ప్రిఫెక్చర్‌లకు హెచ్చరికలను జారీ చేసింది.
గత నెల(జూన్)లో కూడా జపాన్‌లో భూ ప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.1గా నమోదైంది. ఈశాన్య జపాన్‌లోని ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో ఆదివారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ (JMA) తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ప్రమాదం ఏమీ లేదని స్పష్టం చేసింది.


