దెయ్యాలతో ‘ఒక్క రాత్రి’ గడిపితే చాలూ! | Spend One Night in Haunted House Earn! Inside Japans Strangest Job | Sakshi
Sakshi News home page

దెయ్యాలతో ‘ఒక్క రాత్రి’ గడిపితే చాలూ!

Jul 18 2026 1:48 PM | Updated on Jul 18 2026 1:52 PM

Spend One Night in Haunted House Earn! Inside Japans Strangest Job

ఒక ఇల్లు... బయటికి చూస్తే మామూలుగానే కనిపిస్తుంది. కానీ ఆ గడప దాటిన క్షణం నుంచి కథ మారిపోతుంది. ఆ ఇంటి గురించి ఊరంతా ఒకటే మాట. "అక్కడ ఏదో ఉంది... రాత్రిళ్లు వింత శబ్దాలు వినిపిస్తాయి... ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది..." ఇలాంటి మాటలు వింటే చాలామంది ఆ ఇంటి దగ్గరికి కూడా వెళ్లడానికి భయపడతారు. కానీ కొందరు మాత్రం అదే ఇంట్లో ఒంటరిగా రాత్రంతా గడపడానికి సిద్ధమవుతున్నారు. అదీ సరదా కోసం కాదు... ఉద్యోగం కోసం!

ఈ పని చేయాలంటే ముందు ఆ ఇంట్లోకి అడుగుపెట్టాలి. సాయంత్రం నుంచి తెల్లవారే వరకు అక్కడే ఉండాలి. మధ్యలో బయటకు రావడం ఉండదు. ప్రతి గదిలో తిరగాలి. ప్రతి మూలను గమనించాలి. రాత్రి వేళ వినిపించే శబ్దాలు, తలుపులు కదిలాయా? వస్తువులు స్థానాలు మారాయా? అనుమానాస్పద ఘటనలేమైనా జరిగాయా? అనే ప్రతిదాన్ని నమోదు చేయాలి. ఇందుకోసం ప్రత్యేక కెమెరాలు, ఆడియో రికార్డర్లు, ఇతర పర్యవేక్షణ పరికరాలను కూడా అమర్చుతారు. తెల్లవారేసరికి జరిగిన ప్రతిదానిపై పూర్తి నివేదిక సిద్ధం చేస్తారు.

రాత్రంతా ఎలాంటి అసాధారణ ఘటనలు నమోదు కాకపోతే... ఆ ఇంట్లో అతీంద్రియ కార్యకలాపాలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. ఆ సర్టిఫికెట్‌ తర్వాతే ఆ ఇంటిని కొనాలనుకునేవారు, అద్దెకు తీసుకోవాలనుకునేవారిలో ఉన్న మానసిక భయం కొంతవరకు తగ్గుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. అంటే ఈ ఉద్యోగం కేవలం భూతాల కోసం కాదు... భయాన్ని తొలగించేందుకు చేసే పరీక్ష అన్నమాట!.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... కొన్ని సంస్థలు తమ ధ్రువీకరణపై అంత నమ్మకంతో ఉంటున్నాయి. ఒకసారి తాము "సురక్షితం" అని ప్రకటించిన ఇంట్లో తర్వాత నిజంగానే ఏదైనా అతీంద్రియ ఘటన జరిగినట్లు నిరూపితమైతే పరిహారం కూడా చెల్లిస్తామని హామీ ఇస్తున్నాయి. అందుకే ఈ ఉద్యోగంలో ధైర్యంతో పాటు ఓపిక, పరిశీలనా నైపుణ్యం కూడా అవసరమని చెబుతున్నారు.

ఇంత సస్పెన్స్‌ ఉన్న ఈ ఉద్యోగం ఎక్కడ ఉందో తెలుసా? జపాన్‌లో. అక్కడ ఒక రాత్రి ఇలాంటి ఇంట్లో గడిపినందుకు 88 వేల యెన్‌లు (భారత కరెన్సీలో సుమారు రూ.52 వేల) వరకు పారితోషికం చెల్లిస్తున్నారు. ఈ వినూత్న ఉద్యోగాన్ని చాలామంది ఇప్పుడు 'ఘోస్ట్‌ ఇన్వెస్టిగేటర్‌', 'హాంటెడ్‌ హౌస్‌ సిట్టర్‌' పేర్లతో పిలుస్తున్నారు.

వామ్మో జికో బుక్కెన్‌!
జపాన్‌లో ఇలాంటి ఇళ్లను 'జికో బుక్కెన్‌' (Jiko Bukken) అని పిలుస్తారు. అంటే గతంలో హత్య, ఆత్మహత్య, అగ్నిప్రమాదం లేదా వృద్ధులు ఒంటరిగా మరణించి చాలా రోజుల తర్వాత గుర్తించిన ఘటనలు జరిగిన ఇళ్లు. అక్కడి చట్టాల ప్రకారం అలాంటి చరిత్రను కొనుగోలుదారులు, అద్దెదారులకు ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. దీంతో తక్కువ ధరకు దొరికినా చాలామంది ఇలాంటి ఇళ్లకు దూరంగా ఉంటారు. ఫలితంగా వేలాది ఇళ్లు సంవత్సరాల తరబడి ఖాళీగా మిగిలిపోతున్నాయి.

భయాన్ని వ్యాపారంగా మార్చి..
ఈ సమస్యకు పరిష్కారంగా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఈ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాయి. ముందుగా ధైర్యవంతులైన వ్యక్తులను పంపించి ఇంట్లో రాత్రంతా ఉండేలా చేస్తారు. ఎలాంటి అసాధారణ ఘటనలు లేవని ధ్రువీకరణ లభించిన తర్వాత ఆ ఇంటిపై కొనుగోలుదారుల్లో విశ్వాసం పెంచే ప్రయత్నం చేస్తారు. దీంతో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఇళ్లకు మళ్లీ డిమాండ్‌ వస్తుందని యజమానులు ఆశిస్తున్నారు.

మారుతున్న యువత ఆలోచన
ఒకప్పుడు ఇలాంటి ఇళ్లు అంటే పూర్తిగా దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇళ్ల ధరలు భారీగా పెరగడంతో "తక్కువ ధరకు మంచి ఇల్లు దొరికితే గతం గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు" అనే భావన యువతలో పెరుగుతోంది. అందుకే గతంలో అపశకునంగా భావించిన ఇళ్లు ఇప్పుడు చౌకైన గృహాలుగా కొత్త కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.

మొత్తానికి... ఇది దెయ్యాల కథ కాదు... భయాన్ని అవకాశంగా మార్చుకున్న ఓ వినూత్న వ్యాపార ఆలోచన. ఒక రాత్రి ధైర్యంగా గడిపితే రూ.52 వేల సంపాదన... అదే సమయంలో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఓ ఇంటికి కొత్త జీవితం. అందుకే ఈ వింత ఉద్యోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement