పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇరాన్ మౌలిక వసతులపై అమెరికా బలగాలు దాడులు కొనసాగిస్తుండగా.. ప్రతిగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ కౌంటర్ అటాక్‌లు జరుపుతోంది. మరోవైపు ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు కూడా రంగంలోకి దిగడంతో ఈ ఘర్షణ మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై మరింత కఠిన చర్యలకు దిగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్‌పై భారీ స్థాయి సైనిక చర్యను పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే జరుగుతున్న దాడులు సరిపోలేదని భావిస్తున్న ఆయన.. “ఇరాన్‌కు ఇంకా తగినంత నొప్పి తెలియలేదు” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ..
ఇరాన్‌పై గతంలో కంటే పెద్ద స్థాయిలో దాడి చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. “నేను భారీ దాడి గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పటివరకు జరిగిన వాటికంటే పెద్దదిగా ఉంటుంది. నిర్ణయం తీసుకునే దశకు చేరుకున్నాను” అని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. అయితే కొత్త దాడికి సంబంధించి అధ్యక్షుడు తుది నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధికారులు వెల్లడించారు. ఎలాంటి కొత్త సైనిక ఆదేశాలు కూడా జారీ కాలేదని తెలిపారు.
చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదు: ట్రంప్
ఇరాన్ చర్చలకు ఆసక్తి చూపుతున్నప్పటికీ.. ఒప్పందానికి రావడానికి సిద్ధంగా లేదని ట్రంప్ ఆరోపించారు. “వారికి ఇంకా తగినంత నొప్పి తెలియలేదు” అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై ఒత్తిడి కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు.
13వ రోజూ అమెరికా దాడులు
మరోవైపు ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం.. వరుసగా 13వ రాత్రి కూడా ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడులు జరిగాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సామర్థ్యాన్ని తగ్గించడం, వాణిజ్య నౌకలపై ముప్పును అడ్డుకోవడమే తమ లక్ష్యమని అమెరికా చెబుతోంది.
ఇజ్రాయెల్ మద్దతుపై ట్రంప్ వ్యాఖ్యలు
ఇటు.. ఇరాన్‌పై కొత్త ఆపరేషన్ జరిగితే ఇజ్రాయెల్ వెంటనే అమెరికాతో కలిసి వస్తుందని ట్రంప్ అన్నారు. “నేను అడిగితే ఇజ్రాయెల్ రెండు నిమిషాల్లో చేరుతుంది” అని వ్యాఖ్యానించారు. అయితే అమెరికా చర్యలకు ఇజ్రాయెల్ సహకారం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు.
హర్ముజ్ జలసంధిపై ఉత్కంఠ
అమెరికా–ఇరాన్ ఘర్షణ ప్రభావం ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై పడుతోంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళనలు నెలకొన్నాయి. ఇరాన్ కూడా తనపై దాడులు కొనసాగితే ప్రాంతీయ చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై ప్రతీకారం ఉంటుందని హెచ్చరించింది.
యుద్ధం విస్తరిస్తుందా?
ఇరాన్‌కు మద్దతుగా ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో సౌదీ నౌకలపై దాడులు చేసినట్లు ప్రకటించారు. దీంతో మధ్యప్రాచ్య సంక్షోభం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


