రెచ్చిపోయిన హౌతీ రెబెల్స్‌  | Yemen Houthis claim attack on two Saudi oil tankers | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన హౌతీ రెబెల్స్‌ 

Jul 24 2026 5:28 AM | Updated on Jul 24 2026 6:34 AM

Yemen Houthis claim attack on two Saudi oil tankers

ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియా చమురు ట్యాంకర్లపై దాడి  

బాబ్‌ ఎల్‌–మండెబ్‌ జలసంధిలో రవాణాను అడ్డుకుంటామని వెల్లడి  

తీవ్రంగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  

మరోసారి దాడికి దిగితే భారీ సైనిక శిక్ష విధిస్తామని హెచ్చరిక  

దుబాయ్‌/కైరో:  పశ్చిమాసియా నిప్పుల కొలిమిలా మారిపోయింది. దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లుతోంది. అమెరికా సైన్యం వరుసగా 12వ రోజు సైతం ఇరాన్‌పై వైమానిక దాడులకు పాల్పడింది. మరోవైపు ఇరాన్‌ అండదండలున్న యెమెన్‌ హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. ఎర్ర సముద్రంలో గురువారం సౌదీ అరేబియాకు చెందిన రెండు చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్లు ప్రకటించారు. కీలకమైన బాబ్‌ ఎల్‌–మండెబ్‌ జలసంధి గుండా వాణిజ్య రవాణాను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. ఎర్ర సముద్రంలో ఎన్సెలియా, లాయ్‌లా అనే రెండు ట్యాంకర్లపై హౌతీలు దాడి చేసినట్లు సబా వార్తా సంస్థ పేర్కొంది. 

సౌదీ అరేబియాలోని అల్‌ షుకైఖ్‌కు నైరుతి దిశలో 130 కిలోమీటర్ల దూరంలో ఎర్ర సముద్రంలో ఒక ట్యాంకర్‌ను గుర్తుతెలియని క్షిపణి ఢీకొన్నట్లు తమకు నివేదిక అందిందని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ తెలిపింది. హౌతీల దాడుల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. నౌకలపై మళ్లీ దాడులకు పాల్పడితే భారీ సైనిక శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు.

 ‘‘‘హౌతీలు ఇరాన్‌ తరపున వ్యవహరించే శక్తులు కాబట్టి వారు మళ్లీ ఇలాంటి చర్యకు పాల్పడితే దానికి ఇరాన్‌నే బాధ్యులను చేస్తాం. ఇరాన్‌తో పాటు హౌతీలపైనా తీవ్రమైన సైనిక చర్య తీసుకుంటాం’’అని తేల్చిచెప్పారు. తాజా పరిణామాల వల్ల బ్రెంట్‌ ముడి చమురు బ్యారెల్‌ ధర గురువారం 4.3 శాతం పెరిగి 98.16 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది జూన్‌ తర్వాత ఇదే అత్యధిక స్థాయి కావడం గమనార్హం. ఇరాక్‌ ప్రధానమంత్రి అలీ అల్‌–జైదీ ప్రస్తుతం ఇరాన్‌లో పర్యటిస్తున్నారు. అమెరికా, ఇరాన్‌ మధ్య శాంతి చర్చల పునరుద్ధరణ కోసం ఆయన తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు.  

అమెరికా క్షిపణి దాడిలో ఇద్దరి మృతి  
ఇరాన్‌లో బుధవారం అర్ధరాత్రి తర్వాత అహ్వాజ్, రామ్‌షిర్, అండిమెష్క్  తదితర ప్రాంతాలపై క్షిపణి దాడులు జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అలాగే ఇరాక్‌ సరిహద్దులోని షాలమ్‌చెహ్‌ పట్టణంలో జరిగిన అమెరికా క్షిపణి దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఇరాన్‌ సామర్థ్యాన్ని మరింతగా దెబ్బతీయడానికే 
దాడులు చేస్తున్నట్లు యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది. అమెరికా దాడులపై ఇరాన్‌ సైతం ప్రతీకార చర్యలకు దిగింది. గల్ఫ్‌లో అమెరికా మిత్రదేశాలపై క్షిపణులు, డ్రోన్ల ప్రయోగించింది. ఇంధన మౌలిక సదుపాయాలు, నీటి శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులను మధ్యలోనే కూల్చివేశామని జోర్డాన్, కువైట్‌ ప్రకటించాయి.  

మా విధానం ‘కంటికి కన్ను’ 
ఇరాన్‌పై అమెరికా దాడుల పరంపర కొనసాగుతూనే ఉండడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తమ మౌలిక సదుపాయాలపై అమెరికా జరిపే దాడులకు సంబంధించి ‘కంటికి కన్ను’విధానాన్ని అనుసరిస్తామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చి పేర్కొన్నారు. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఘాటుగా బదులిచ్చారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానం కూడా ‘కంటికి కన్ను’అని తేలిచెప్పారు. వారికి(ఇరాన్‌) బుద్ధి వచ్చేంత వరకు ప్రతి రాత్రీ దాడుల తీవ్రత పెరుగుతూనే ఉంటుందని స్పష్టంచేశారు.  

ఇరాన్‌లో సైనిక చర్యను నిలిపివేసే తీర్మాన ఆమోదం 
వాషింగ్టన్‌:  ఇరాన్‌లో సైనిక చర్యను నిలిపివేసే తీర్మానాన్ని అమెరికా అప్రతినిధుల సభ గురువారం స్వల్ప మెజారిటీతో ఆమోదించింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పరోక్షంగా హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్‌పై యుద్ధం నిలిపివేయాలని సూచించింది. యుద్ధానికి కాంగ్రెస్‌ ఆమోదం అవసరమని తెలియజేసింది. 214–208 ఓట్లతో తీర్మానం ఆమోదం పొందింది. ఇరాన్‌ యుద్ధానికి స్పష్టమైన లక్ష్యం, వ్యూహం లేదా అంతిమ గమ్యం ఏమీ లేవు అని వాషింగ్టన్‌ ప్రతినిధి, హౌస్‌ వేదికగా ఈ తీర్మానానికి నాయకత్వం వహించిన డెమోక్రాట్‌ ప్రమీలా జయపాల్‌ అన్నారు. యుద్ధాన్ని ముగించడానికి కొద్దిమంది రిపబ్లికన్లు డెమోక్రాట్లతో కలిసి ఓటు వేయడంతో ఈ తీర్మానం స్వల్ప మెజారిటీతో ఆమోదం పొందింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement