బహ్రెయిన్, కువైట్‌పై ఇరాన్ ప్రతిదాడులు
దుబాయి: అమెరికా – ఇరాన్‌ల యుద్ధం మరింత వేడెక్కింది. సోమవారం ఉదయం ఇరాన్ లక్ష్యంగా అమెరికా మరోసారి దాడులకు తెగబడగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్‌లపై ప్రతిదాడులకు దిగింది. ఇరాన్ వాయువ్య ప్రాంతంలో భూగర్భ క్షిపణి కేంద్రంగా భావిస్తున్న తబ్రిజ్ నగరం లక్ష్యంగా అమెరికా దాడులకు దిగగా ఒకరు మరణించినట్లు ఇరాన్ ప్రకటించింది.
ప్రతీకారంగా ఇరాన్ బహ్రెయిన్‌తోపాటు అమెరికా నావికాదళపు ఫిఫ్త్ ఫ్లీట్ ఉన్న కువైట్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరు దేశాల్లో సోమవారం ఉదయమే క్షిపణి దాడులకు సంబంధించిన హెచ్చరికలు జారీ అయ్యాయి. దూసుకొస్తున్న క్షిపణులను అడ్డుకున్నట్లు కువైట్ ప్రకటించింది.
ఇరుదేశాల మధ్య యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తూ గత నెలలో ఒక ఒప్పందం కుదిరినా ఆ తరువాత దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూండటంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో కార్యకలాపాలు మళ్లీ స్తంభించిపోయాయి. ఇరుపక్షాలూ మౌలిక సదుపాయాలు లక్ష్యంగా దాడులు చేసుకుంటూండంతో చమురు ధరలు మళ్లీ పైకి ఎగబాకాయి. సోమవారం బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్ ధర 90 డాలర్ల కంటే ఎక్కువ పలికి ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది.
బాగా దెబ్బకొట్టాం: ట్రంప్
ఇరాన్‌పై సోమవారం జరిగిన దాడులు బాగా జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒరాన్ డ్రోన్ దాడిలో శనివారం వీరసైనికుడి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నామని ఆయన ప్రకటించారు.


