కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ | BJP and Congress state office areas have become battlegrounds | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ

Jul 23 2026 3:49 AM | Updated on Jul 23 2026 3:49 AM

BJP and Congress state office areas have become battlegrounds

హస్తం, కమలం శ్రేణుల పోటాపోటీ నిరసనలు 

రాళ్లు, కర్రలతో కొట్టుకున్న ఇరు వర్గాలు 

రణరంగంగా మారిన బీజేపీ, కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యాలయ ప్రాంతాలు 

గన్‌ ఫౌండ్రి: దేశ రాజధానిలో రాహుల్‌ గాందీ, ప్రియాంకా గాంధీ తదితర నేతలను అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వగా, దేశ ప్రధాని నివాసం ఎదుట కాంగ్రెస్‌ వ్యవహరించన తీరును నిరసిస్తూ బీజేపీ గాం«దీభవన్‌ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో బుధవారం గాంధీభవన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయ పరిసర ప్రాంతాలు రణరంగంగా మారాయి. 

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్న బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో పరిస్థితి విషమించింది. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడంతోపాటు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక టీవీ జర్నలిస్టు, మహిళా కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. 

బీజేపీ ఆధ్వర్యంలో... 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు గాం«దీభవన్‌ ముట్టడికి ప్రయత్నించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్‌ విచి్ఛన్నకర రాజకీయాలు, రాహుల్‌గాంధీ దేశ వ్యతిరేక వైఖరిపై బీజేపీ పోరుబాట చేస్తుందని చెప్పారు. నీట్‌ పరీక్ష పత్రం లీకేజిపై పార్లమెంటులో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, రాహుల్‌ ప్రధాని నివాసం ముట్టడికి దిగడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని మండిపడ్డారు. 

ఢిల్లీలో జరిగిన ఆందోళనలో అసలు విద్యార్థులే లేరని, కేవలం సామాజిక విద్రోహ, ఆ్రల్టాలెఫ్ట్‌ మూకలను జమచేసి ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. అనంతరం గాం«దీభవన్‌ ముట్టడికి వెళ్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుని గోషామహాల్, అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఎన్‌.రామచందర్‌రావు, ఇతర బీజేపీ నేతల అరెస్ట్‌పై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఎం.రఘునందన్‌రావు, బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, ఖండించారు. 

నీట్‌ ప్రశ్నపత్రం అంశంపై లోక్‌ సభలో చర్చకు సిద్ధమని కేంద్ర్రం ముందుకు వచ్చినా కూడా చర్చకు రాకుండా కాంగ్రెస్‌ రాజకీయం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజిపై విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్‌ బల్మూరు వెంకట్‌ డిమాండ్‌ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. 

కరీంనగర్‌లో ఉద్రిక్తత 
కరీంనగర్‌ కార్పొరేషన్‌: కాంగ్రెస్‌ నిరసన కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని కార్ఖానగడ్డ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టి, కోర్టుసర్కిల్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి ఊహించని విధంగా సమీపంలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కార్యాలయం వైపు ర్యాలీ మళ్లింది. అప్రమత్తమైన పోలీసులు మేడిపల్లి సత్యంను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. 

పీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌ తదితరులు కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. కార్యాలయంలో ఉన్న బీజేపీ కార్పొరేటర్‌ బోయినిపల్లి ప్రవీణ్‌రావు తదితరులు కర్రలతో కాంగ్రెస్‌ నాయకులపై దాడి చేశారు. కార్యాలయం గేట్‌ వేసి పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ, ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. చెప్పులు, కుర్చీలు విసురుకున్నాయి. పోలీసులు లాఠీచార్జ్‌ చేసి కాంగ్రెస్‌ శ్రేణులను చెదరగొట్టారు. ప్రతిగా కాంగ్రెస్‌ కార్యాలయంపై దాడికి బీజేపీ నేతలు సిద్ధమవగా డీసీసీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement