4 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు ట్రిప్పుల రద్దు లెక్క ఇదీ..
కండక్టర్ల కొరతతో డిపోల్లోనే మూలుగుతున్న కొన్ని బస్సులు
300 రూట్లలో రెగ్యులర్ సర్వీసులకు తీవ్ర ఆటంకం
కొత్తగా పోస్టులు భర్తీ చేయని వైనం.. 13 ఏళ్ల నాటి నియామకాలే ఆఖరు
రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మంది కండక్టర్ల కొరత
ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తున్నా చాలని తీరు
650 గ్రామాలు, అనుబంధ పల్లెలపై ప్రభావం
ముఖ్యంగా గిరిజన, మారుమూల ప్రాంతాలకు సర్వీసుల కోత
నిజామాబాద్–ఆర్మూర్–కరీంనగర్ లాంటి కీలక రూట్లపైనా ఎఫెక్ట్
ఆటోలు, జీపులను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు
జీతాల భారంతో నియామకాల ఊసెత్తని సంస్థ
గత నాలుగు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా కోటి కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్సు ట్రిప్పులు రద్దయ్యాయి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు సరిగా లేకపోతే, ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లు దెబ్బతినడంతో బస్సు సర్వీసులు నిలిచిపోతుంటాయి. ఎక్కడైనా పక్కా రోడ్లు లేకపోతే బస్సులు దెబ్బతింటాయనే ఉద్దేశంతో కూడా సర్వీసులు నిలిపేస్తారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. బస్సులున్నా, రోడ్లు బాగున్నా కొన్ని ప్రాంతాలకు సర్వీసులను నడపలేని దుస్థితి ఇది. సరిపడా సంఖ్యలో కండక్టర్లు లేకపోవడంతో కొన్ని ప్రాంతాలకు బస్సులు రద్దు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 300 రూట్లలో సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా రైట్..రైట్..అన్న కేక విన్పిస్తేనే తప్ప ఆర్టీసీ డ్రైవర్ బస్సును ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడా పరిస్థితి చాలావరకు లేదు. డ్రైవర్ ఉన్నా కండక్టర్ లేకపోవటంతో బస్సులు డిపోలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రీజియన్లలో నిత్యం కొన్ని సర్వీసులు ఉన్నట్టుండి రద్దవుతున్నాయి. ఉన్న కండక్టర్లకు డబుల్ డ్యూటీలు వేస్తూ, వీక్లీ ఆఫ్‌లు రద్దు చేస్తూ, ఏదో రకంగా సర్దుబాటు చేస్తూ వీలైనన్ని ఎక్కువ సర్వీసులు తిరిగేలా డిపో మేనేజర్లు చూస్తున్నారు. అయినప్పటికీఅన్ని రూట్లకూ అవసరమైన సంఖ్యలో కండక్టర్లు అందుబాటులో లేక కొన్ని బస్సులు డిపోల నుంచి కదలడం లేదు. కావాల్సిన సంఖ్య కంటే ప్రస్తుతం దాదాపు 2 వేల మంది కండక్టర్లు తక్కువగా ఉండటంతో, దీని ప్రభావం బస్సు ట్రిప్పులపై పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 650 గ్రామాలు, అనుబంధ పల్లెలకు బస్సు సౌకర్యంలో అంతరాయం కలుగుతోంది. ఆటో రిక్షాలు, ప్రైవేటు జీపులు లాంటి వాటిల్లో ప్రయాణం ప్రమాదకరమని ప్రచారం చేస్తున్న ఆర్టీసీనే, సర్వీసులను కుదించడం ద్వారా పరోక్షంగా ఆయా గ్రామాల ప్రజలు వాటిల్లోనే ప్రయాణించక తప్పని పరిస్థితి కల్పిస్తోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, కండక్టర్ల కొరతతో బస్సులు నిలిచిపోతున్న విషయం తెలిసి కూడా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.
చివరిసారి 2013లో భర్తీ
ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారి 2013లో ఏపీఎస్‌ఆర్టీసీలో కండక్టర్ పోస్టులు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఆర్టీసీ సొంతంగా సిబ్బందిని రిక్రూట్ చేసుకోలేదు. కేవలం కారుణ్య నియామకాలు, అడపాదడపా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని తీసుకోవటం తప్ప, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సంస్థలో పూర్తిస్థాయి నియామకాలు జరగలేదు. అయితే 2019లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు ఆర్టీసీ ఉన్నట్టుండి 2 వేల బస్సులను తగ్గించింది. దీంతో భారీగా డ్రైవర్లు, కండక్టర్లు మిగిలిపోయారు. ఇంతకాలం వారి సర్దుబాటుతో ఇబ్బంది రాలేదు. కానీ ఎప్పటికప్పుడు ఉద్యోగుల పదవీ విరమణలతో కొరత మొదలైంది. ప్రస్తుతం ప్రతినెలా సగటున ఆర్టీసీలో అన్ని విభాగాలు కలిపి 150 నుంచి 200 మంది ఉద్యోగ విరమణ పొందుతున్నారు. ఇలా రిటైర్మెంట్ల సంఖ్య క్రమంగా పెరిగి, కండక్టర్ల కొరత తీవ్రమైంది. కొన్ని నెలలుగా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కొంతమందిని నియమిస్తున్నా, తీవ్రమైన కొరత పరిష్కారమయ్యేలా ఆ సంఖ్య లేదు.
తాత్కాలికంగా కొందరితో సరి..
రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే నాటి ప్రభుత్వం 2013 నాటి వేతన సవరణ ప్రక్రియ చేపట్టింది. కార్మికులు డిమాండ్ చేసిన దాని కంటే చాలా ఎక్కువగా ఏకంగా 44 శాతం ఫిట్మెంట్‌ను ప్రకటించింది. ఆ తర్వాత 2017 వేతన సవరణకు సంబంధించి 21 శాతం ఫిట్మెంట్ అమలులోకి వచ్చింది. ఫలితంగా సిబ్బంది జీతభత్యాలు భారీగా పెరిగాయి. ఆర్టీసీ మొత్తం ఖర్చులో వేతన పద్దు 51 శాతం మించిపోయింది. క్రమేణా నష్టాలు, అప్పులతో సంస్థ కుదేలైంది. ఈ పరిస్థితుల్లో కొత్త నియామకాలు చేపడితే జీతాల భారాన్ని మోయలేమని తేల్చుకున్న ఆర్టీసీ వాటికి జోలికి వెళ్లటం లేదు. అద్దె బస్సుల సంఖ్య వీలైనంత పెంచుకుని డ్రైవర్ల భారాన్ని తగ్గించుకుంటూ (అద్దె బస్సుల్లో వాటి యజమానులే డ్రైవర్లను నియమిస్తారు) వస్తోంది. మరోవైపు తాత్కాలికంగా కొందరు కండక్టర్ల నియామకంతో తక్కువ జీతాల భారం ఉండేలా చూస్తోంది.
మూడేళ్లుగా కాలయాపన..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్టీసీలో పూర్తిస్థాయి రిక్రూట్‌మెంట్‌కు అనుమతించింది. టీఎస్‌పీఎస్‌సీకి ఆ బాధ్యత అప్పగించింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీతోపాటు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డులను కూడా చేర్చింది. ఇటీవల 1,500 పోస్టులను సొంతంగా భర్తీ చేసుకునేలా ఆర్టీసీకి అనుమతించింది. అయితే మొత్తం మీద మూడేళ్ల నుంచి అదిగోఇదిగో అంటూ కాలయాపనే తప్ప పూర్తిస్థాయి నియామకాలు చోటు చేసుకోలేదు.
ఈ మార్గాల్లో ఎక్కువగా రద్దు
కండక్టర్ల కొరతతో మహబూబ్‌నగర్ – దేవరకద్ర – నారాయణపేట (ఇంటీరియర్ గ్రామీణ రూట్లు), నల్లగొండ – దేవరకొండ – చందంపేట (దిండి రూట్: ఏజెన్సీ, గిరిజన తండాలకు వెళ్లే రూట్లు) సర్వీసుల్లో ట్రిప్పుల సంఖ్య తగ్గింది. ఆదిలాబాద్ – ఉట్నూర్ – ఆసిఫాబాద్ (జైనథ్ రూట్: ఏజెన్సీ మార్గాల్లో సాయంత్రం వేళల్లో నడిచే చివరి బస్సు సర్వీసులు) రూట్లో ఎక్కువగా బస్సులు రద్దవుతున్నాయి. అలాగే వరంగల్ – నర్సంపేట – కొత్తగూడ (గూడూరు మార్గాలు: ఏజెన్సీకి అనుసంధానంగా ఉండే ఇంటీరియర్ రూట్లలో ట్రిప్పుడు తగ్గుతున్నాయి) ఖమ్మం – వైరా – సత్తుపల్లి (అంతర్గత గ్రామీణ లింక్ రోడ్లు) రూట్లలో మెయిన్ రోడ్డు దాటి వెళ్లే మినీ పల్లె వెలుగు సర్వీసులు రద్దు కావడం సాధారణంగా మారింది. ఆదిలాబాద్ / కుమ్రం భీమ్: గూడెం, పిప్రి, నార్నూర్ లోపలి తండాలు, సిర్పూర్ పరిధిలోని కొండప్రాంత గూడేలు, భద్రాద్రి కొత్తగూడెం: ఆళ్లపల్లి, గుండాల, దుమ్ముగూడెం మండలాల అంతర్గత గిరిజన ఆవాసాలకు బస్సులు తగ్గాయి. చివరకు నిజామాబాద్–ఆర్మూర్–కరీంనగర్ లాంటి కీలక రూట్లలో కూడా సర్వీసుల సంఖ్య తగ్గింది.
మంత్రి నిర్వాకంతో మెదక్‌లో మరీ..
మెదక్ రీజియన్‌లో సమస్య ఎక్కువగా ఉంది. ఓ మంత్రి వ్యవహారం దీనికి కారణం కావటం విడ్డూరం. తాత్కాలిక పద్ధతిలో కండక్టర్లను నియమించుకునేందుకు నాలుగు నెలల క్రితం అనుమతించి, కాంట్రాక్టర్లు సిబ్బందిని గుర్తించి ఇక నియామక ప్రక్రియ చేపట్టే వేళ మంత్రి కార్యాలయం ఓ జాబితా పంపి వారినే ఎంకిక చేయాలని ఆదేశించింది. దీనికి కాంట్రాక్టర్లు ఒప్పుకోలేదు. ఇటు మంత్రి కార్యాలయం, అటు కాంట్రాక్టర్లు పట్టు వీడక పోవటంతో చేసేది లేక అధికారులు మెదక్ జిల్లా వ్యాప్తంగా నియామక ప్రక్రియను నిలిపేశారు. ఫలితంగా గత నాలుగు నెలల్లో ఒక్క ఆ జిల్లాలోనే ఏకంగా 20 లక్షల కి.మీ. మేర బస్సు ట్రిప్పులు ఆగిపోయాయి.


