TGSRTC
-
ఆర్టీసీలో 3,038 ఖాళీల భర్తీకి ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో తొలి నియామక ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో చివరిసారి వివిధ కేటగిరీల్లో నియమకాలు జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు పోస్టుల భర్తీ జరగలేదు. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ఏకంగా 3,038 పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. ఇప్పటివరకు ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీని సంస్థే చేపట్టే విధానం ఉండేది. తొలిసారి నియామక సంస్థలకు ప్రభుత్వం ఈ బాధ్యత అప్పగించింది. టీజీపీఎస్సీ, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డులు కేటగిరీల ప్రకారం నియామక ప్రక్రియలను చేపట్టనున్నాయి. ఏడెనిమిది నెలల క్రితమే కసరత్తు తెలంగాణ ఆర్టీసీలో ప్రసుతం చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతినెలా సగటున 200 మంది రిటైర్ అవుతుండటంతో ఖాళీల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీ చేపట్టాలని ఏడెనిమిది నెలల క్రితమే ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. దాదాపు ఐదు వేల ఖాళీల భర్తీకి ప్రతిపాదించింది. కానీ ప్రభుత్వం 3,038 పోస్టులకే అనుమతి ఇచ్చింది. అయితే తాము నియామక పరీక్షలకు రూపొందించుకున్న కేలండర్ ఆధారంగానే ఆర్టీసీలో పోస్టుల భర్తీ కూడా ఉంటుందని ఆయా సంస్థలు ప్రకటించాయి.దీంతో వెంటనే నియామకాలు చేపట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇంతలో ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి రావటంతో, అది తేలిన తర్వాతే నియామకాలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల ఎస్సీ వర్గీకరణ జరిగి, రోస్టర్ పాయింట్లపై స్పష్టత రావడంతో ఖాళీల భర్తీకి రంగం సిద్ధమైంది.కీలకమైన డ్రైవర్ల ఎంపిక ప్రక్రియ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చూడనుంది. మరో రెండు నెలల్లో ప్రక్రియ మొదలవుతుందని, నాలుగు నెలల్లో కొత్త డ్రైవర్లు అందుబాటులోకి వస్తారని సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. జోనల్ పోస్టులు, రీజియన్ పోస్టుల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లను సూచిస్తూ ఆర్టీసీ సంబంధిత బోర్డులకు వివరాలు అందజేయాల్సి ఉంది. బోర్డులు అడగ్గానే వాటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అప్పటి వరకు ఔట్సోర్సింగ్ డ్రైవర్లతో.. ప్రస్తుతం ఆర్టీసీలో 1,600 డ్రైవర్పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్న డ్రైవర్లపై తీవ్ర పనిభారం పెరిగింది. డబుల్ డ్యూటీలు చేయాల్సి వస్తోంది. దీంతో 1,500 మంది ఔట్సోర్సింగ్ డ్రైవర్లను విధుల్లోకి తీసుకునేందుకు సంస్థ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. మ్యాన్‌పవర్ సప్లయిర్స్ సంస్థల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఎంపిక చేసిన డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నారు. వీరిని మూడు నెలల పాటు కొనసాగిస్తామని ఒప్పందంలో సంస్థ పేర్కొంది.తాజాగా రెగ్యులర్ డ్రైవర్ల నియామకం వరకు వీరిని కొనసాగించాలని నిర్ణయించింది. ఇలా తాత్కాలిక పద్ధతిలో ఎంపికైన వారు, రెగ్యులర్ నియామకాల కోసం కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. వీరు శిక్షణ పొంది ఉన్నందున, రెగ్యులర్ నియామకాల్లో వీరికి ఆయా బోర్డులు ప్రాధాన్యం ఇచ్చే వీలుందని అధికారులు చెబుతున్నారు.త్వరలో భర్తీ ప్రక్రియ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వం వచ్చిన తర్వాత యువత ఉపాధికి పెద్దపీట వేస్తూ 60 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీలో తొలి సారి భర్తీ ప్రక్రియ చేపడుతున్నాం. 3,038 ఖాళీలను నియామక బోర్డుల ద్వారా భర్తీ చేయనున్నాం. ఇందుకోసం ఆయా బోర్డులు నియామక క్యాలెండర్‌ను సిద్ధం చేసుకున్నాయి. వాటి ప్రకారం వీలైనంత త్వరలో భర్తీ ప్రక్రియ జరుగుతుంది. – రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే పార్టీ రజతోత్సవ సభ కోసం బీఆర్ఎస్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలవారీగా పార్టీ కీలక నేతలతో వరుస భేటీలు నిర్వహించి అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా జన సమీకరణపై పార్టీ అధినేత కే.చంద్రశేఖర్‌రావు దిశా నిర్దేశం చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని జన సమీకరణ ప్రయత్నాలు వేగవంతం చేశారు. గ్రామాలవారీగా లెక్కలు వేసుకుంటూ వాహనాలు సమకూర్చుకుంటున్నారు. సభకు తరలివచ్చే ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తల కోసం 3 వేల బస్సులు సమకూర్చాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీకి దరఖాస్తు చేసింది. మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు సోమవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కలిశారు. బస్సులకు అద్దె కోసం రూ.8 కోట్ల చెక్కును సజ్జనార్‌కు అందజేశారు. ఉమ్మడి వరంగల్ నేతలతో కేటీఆర్ భేటీ ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సోమవారం నందినగర్ నివాసంలో భేటీ అయ్యారు. జన సమీకరణపై చర్చించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కనీసం రెండున్నర లక్షల మందిని సభకు తరలించాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ముఖ్య నాయకులు, క్రియాశీల కార్యకర్తలతో సమావేశాలను ఈ నెల 12వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.పార్టీ ఇచ్చే ప్రచార సామగ్రిని క్షేత్ర స్థాయికి చేరవేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు. పార్టీ కండువాలు, జెండాలు, వాల్ పోస్టర్లు తదితర ప్రచార సామగ్రి పంపిణీ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. ‘స్వరాష్ట్రాన్ని సాధించాం.. సగర్వంగా నిలబెట్టాం’నినాదంతో ‘ఛలో వరంగల్’పేరిట రూపొందించిన రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్‌ను ఒకటిరెండు రోజుల్లో కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. నేడు ‘గ్రేటర్’నేతలతో సమావేశం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం ఉదయం 10.30కు తెలంగాణ భవన్లో జరగనుంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ భేటీని సమన్వయం చేస్తారు. సభకు గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి జన సమీకరణపై ఈ సమావేశంలో చర్చిస్తారు. గ్రేటర్ పరిధిలోనే బీఆర్ఎస్కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటంతో జన సమీకరణను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. -
పుష్పక్ బస్సుల్లో రూట్ పాస్‌లు
తెలంగాణ ఆర్టీసీ పుష్పక్ బస్సుల్లో రూట్‌పాస్‌లను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఎక్కడి నుంచైనా ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించేందుకు నెలవారీ పాస్‌లు ఉన్నాయి. అలాగే కొన్ని నిర్దిష్టమైన మార్గాల్లో మాత్రమే ప్రయాణం చేసేందుకు అనుగుణంగా రూట్‌పాస్‌లు దోహదం చేస్తాయి. ఎయిర్‌పోర్ట్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. 53 పుష్పక్ సర్వీసులు.. ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ 53 పుష్పక్ ఏసీ బస్సులు (AC Buses) ఎయిర్‌పోర్టుకు నడుస్తున్నాయి. 24 గంటల పాటు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఎయిర్‌పోర్టు ప్రయాణికుల కోసం వీటిని నడుపుతున్న సంగతి తెలిసిందే. కానీ ఎయిర్‌పోర్టు (Airport) నుంచి నగరంలోకి వచ్చే బస్సులకు లభించినట్లు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే సర్వీసులను ప్రయాణికులు ఆదరించడం లేదు. దీంతో పుష్పక్ ఆక్యుపెన్సీ 60 శాతానికే పరిమితమవుతోంది. ప్రతిరోజూ సుమారు 55 వేల మంది డొమెస్టిక్ ప్రయాణికులు, మరో 15 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా పుష్పక్‌లను నడుపుతున్నప్పటికీ ఆదరణ తక్కువగానే ఉంది. దీంతో వివిధ మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఆర్టీసీ (RTC) ప్రణాళికలు రూపొందిస్తోంది.నాలుగు రూట్లలో.. సుమారు 12 వేల మందికి పైగా ఉద్యోగులు ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్నట్లు అంచనా. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న ఈ ఉద్యోగులంతా వివిధ మార్గాల్లో ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగిస్తున్నారు. వీరిని ఆకట్టుకొనేందుకు ఆర్టీసీ రూట్ పాస్‌లను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు నెలవారీ పాస్‌లతో పాటు తమ అవసరాలకు అనుగుణంగా ఈ నాలుగు మార్గాల్లో రూట్‌పాస్‌లను తీసుకోవచ్చు. చదవండి: హైదరాబాద్ పరిధిలో పాతాళానికి భూగర్భ జలాలురూట్పాస్లు ఇలా.. నగరంలో ఎక్కడి నుంచైనా ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించేందుకు నెలవారీ పాస్ రూ.5,260 శంషాబాద్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు రూ.2,110 ఆరాంఘర్, బాలాపూర్ నుంచి ఎయిర్‌పోర్టుకు రూ.3,160 ఎల్బీనగర్, గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్టుకు రూ.4,210 -
సమ్మె బాటలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. మే 7వ తేదీ నుంచి సమరభేరికి పిలుపు ఇచ్చారు. ఈ మేరకు జేఏసీ నేతలు ఇటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు, అటు లేబర్ కమిషనర్‌కు సమ్మె నోటీస్ అందజేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు.మే 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెలోకి దిగుతాం. మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి సమ్మెకు వెళతాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు. అలాగే.. ఈరోజు వరకు ఉద్యోగులకు జీతాలు పడలేదని ఆర్టీసి జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.ఆర్టీసీ జేఏసీ సమర్పించిన నోటీసుల్లో 21 అంశాలు ఉన్నాయి. 2017లో వేతన సవరణ జరిగినప్పటికీ నేటికీ ఎరియర్స్ రాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని నోటీసుల్లో జేఏసీ డిమాండ్ చేసింది.