సాక్షి, హైదరాబాద్: బహుళ ప్రజా సేవలకు ఒకే వేదికగా డిజిటల్ టికెటింగ్ అందిస్తున్న మీ టికెట్ యాప్ విజయవంతంగా తొలి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ కాలంలో యాప్‌ను సుమారు 2 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకోగా, రూ.2.5 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయి. 3.5 లక్షలకుపైగా టికెట్లు జారీ అయినట్లు అధికారులు తెలిపారు.
సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ప్రారంభమైన ఈ యాప్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 221 ప్రజా ప్రదేశాల్లో అందుబాటులో ఉంది. హైదరాబాద్ మెట్రో, పార్కులు, దేవాలయాలు, మ్యూజియంలు, కోటలు, బోటింగ్ కేంద్రాలు, నేచర్ క్యాంపులు, కమ్యూనిటీ సౌకర్యాలకు డిజిటల్ టికెటింగ్‌ను ఒకే యాప్‌లో అందిస్తోంది.
త్వరలో మీటికెట్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్‌టీసీ) సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. నగర, ఉపనగర ప్రయాణికుల కోసం క్యూ ఆర్ ఆధారిత డిజిటల్ బస్ పాస్‌లు, అంతర్‌నగర బస్ టికెట్ల బుకింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రారంభ దశలో సాధారణ పాస్, మెట్రో డీలక్స్ పాస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్, గ్రీన్ మెట్రో లగ్జరీ (ఏసీ) పాస్, పుష్పక్ ఏసీ పాస్‌లను యాప్‌లో పొందుపరచనున్నారు.
జనవరి 2026 నాటికి మీ టికెట్ పరిధిలో సుమారు 123 పార్కులు, 50 బోటింగ్ కేంద్రాలు, 16 దేవాలయాలు, 6 మ్యూజియంలు, 4 కోటలు/స్మారకాలు, 4 జలపాతాలు, 11 జీహెచ్ఎంసీ పార్కులు, 5 నేచర్ క్యాంపులు, ఒక హైదరాబాద్ మెట్రో ఇంటిగ్రేషన్, ఒక ఫంక్షన్ హాల్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పట్టణ, పర్యావరణ, సాంస్కృతిక, ధార్మిక ప్రాంతాలకు ఒకే యాప్ ద్వారా చేరువ చేసే ‘సూపర్ యాప్’గా మీటికెట్ నిలుస్తోందని వారు పేర్కొన్నారు.


