ఇంట్లో తల్లి మృతదేహం.. ఇంటర్‌ పరీక్షకు.. | Inter Student Attend Exam Just Hours After Her Mother's Tragic Death, More Details Inside | Sakshi
Sakshi News home page

ఇంట్లో తల్లి మృతదేహం.. ఇంటర్‌ పరీక్షకు..

Feb 26 2026 8:28 AM | Updated on Feb 26 2026 12:20 PM

Inter Student Attend Exam Over Mother Ends Life

జగిత్యాల జిల్లా: ఇంట్లో తల్లి మృతదేహం.. ఆపుకోలేని దుఃఖం.. ఇంతలోనే ఇంటర్‌ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు రాయాల్సి రావడం.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.. అయినా, ధైర్యం తెచ్చుకున్న ఆ విద్యార్థిని.. పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు హాజరైంది. ఏపీలోని విజయవాడకు చెందిన అనూష–లక్ష్మణ్‌ దంపతులు ఉపాధి కోసం జగిత్యాల శివారులోని నూకపెల్లి అర్బన్‌ కాలనీకి వచ్చి నివాసం ఉంటున్నారు. అనూష టైలరింగ్‌ చేస్తూ కుటుంబాన్ని సాకుతోంది. 

వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో తెలిసినవారి వద్ద కొంత అప్పు చేసింది. అప్పులు ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో మనోవేదనకు గురైన అనూష ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె పెద్దకూతురు రమ్యశ్రీ బుధవారం ఇంటర్‌ తెలుగు పరీక్ష రాయాల్సి వచ్చింది. పరీక్ష పూర్తయ్యాక తల్లి అంత్యక్రియలకు హాజరైంది. ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది.

హాల్‌కు వెళ్లడమే పెద్ద పరీక్ష
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన దివ్యాంగ విద్యార్థి ఆశాజ్యోతి టేకులపల్లి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం హెచ్‌ఈసీ చదువుతోంది. ఆమె నడిచే పరిస్థితి లేక ఎక్కడికైనా వీల్‌చైర్‌పైనే వెళ్లి వస్తుంది. బుధవారం ఇంటర్‌ పరీక్ష రాసేందుకు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ కేంద్రానికి వీల్‌చైర్‌లో వచ్చింది. అయితే ఆమె పరీక్ష రాయాల్సిన రూమ్‌ మొదటి అంతస్తులో ఉంది. దీంతో మెట్లు ఎక్కలేకపోవడంతో కాలేజీ సిబ్బంది, ఆశా వర్కర్‌ కలిసి మొదటి అంతస్తులోని హాల్‌ వరకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఈ విషయమై సెంటర్‌ చీఫ్‌ సూపరింటెండెంట్‌ బసవమ్మ, డిపార్ట్‌మెంటల్‌ అధికారి ఖాసీంను వివరణ కోరగా.. ఆశాజ్యోతికి తర్వాతి పరీక్షలకు కిందనే ఏర్పాటు చేస్తామని చెప్పారు.   

 

Advertisement
 
Advertisement
Advertisement