ఇంటర్ పరీక్షలు ప్రారంభం
జగిత్యాల: జిల్లాలో బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. తొలిరోజు జనరల్ కోర్సులకు 7,049 మందికి గాను 6,879 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 1,112 మందికి గాను 1,029 మంది హాజరయ్యారు. 96.80 శాతం మంది పరీక్షలు రాశారు. జగిత్యాలలోని ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాలలో ఓ విద్యార్థిని 15 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఇంటికి పంపించారు. కోరుట్లలో సైతం ఓ విద్యార్థి 10 నిమిషాలు ఆలస్యంగా రాగా.. తిప్పి పంపించేశారు. జిల్లాలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. అదనపు కలెక్టర్ లత కోరుట్లలోని ప్రభుత్వ బాలుర, బాలికల కళాశాలను పరిశీలించారు. మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ పరీక్షల కన్వీనర్ నారాయణ తెలిపారు.
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు
ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్ బాలుర జూనియర్ కళాశాలలో తనిఖీ చేశారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పరీక్షలు పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. డీఐవో నారాయణ, తహసీల్దార్ రాంమోహన్ ఉన్నారు.


