హడలెత్తిస్తున్న పెద్ద పులి
● భయాందోళనలో ప్రజలు
కొడిమ్యాల: దమ్మయపేట గ్రామంలో పెద్ద పులి ప్రత్యక్షమవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు గమనించడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ సమాచారమందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పాద ముద్రలను పరిశీలించారు. అవి పెద్ద పులివే అని స్పష్టం చేశారు. పులి కనిపించిన వార్తతో గ్రామంలో కలకలం రేగింది. పశువులను బయట వదిలేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రాత్రి ఎవరూ బయటకెళ్లొద్దని, పులి కనిపించిన ప్రాంతాలకు పోవద్దన్నారు. పులి ఎక్కడికి వెళ్లిందో తెలుసుకునేందుకు ఎఫ్‌ఆర్‌వో గులం మొయినుద్దీన్, డిప్యూటీ రేంజర్ ముసిరుద్దీన్, అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.


