భద్రాద్రి జిల్లా రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తె మృతి.. విరిగిన తండ్రీతనయుల కాళ్లు
తల్లి, అక్క మృతదేహాల వద్దకు పాకుతూ వెళ్లేందుకు బాలుడి యత్నం
కంటతడి పెట్టించిన బాలుడి ఆర్తనాదాలు..
ఇల్లెందురూరల్: బంధువుల ఇంట్లో వివాహానికి బయలుదేరిన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృత్యువాత పడగా, తండ్రి, కుమారుడికి కాళ్లు విరిగి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సుదిమళ్ల వద్ద బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని బొజ్జాయిగూడెం శివారు కొల్లాపురం గ్రామానికి చెందిన పాయం సురేశ్, ధనమ్మ(30) దంపతులు.. కుమార్తె జయశ్రీ(11), కుమారుడు సాత్విక్‌తో కలిసి గుండాల మండలం మర్కోడులో ధనమ్మ సోదరి ఇంట్లో వివాహానికి బైక్‌పై బయలుదేరారు.
సురేశ్ బైక్ నడుపుతుండగా వెనుక సాత్విక్, చివరన ధనమ్మ, పెట్రోల్ ట్యాంక్‌పై జయశ్రీ కూర్చున్నారు. సుదిమళ్ల స్టేజీ వద్ద పెట్రోల్ పోయించుకునేందుకు బంక్‌లోకి వెళుతుండగా ఇల్లెందు నుంచి కొత్తగూడెం వైపు ద్విచక్రవాహనంపై వెళుతున్న గుగులోత్ శ్రీనివాస్ వీరి బైక్‌ను ఢీ కొట్టాడు. దీంతో బైక్ రోడ్డుపై పడగా.. అదే సమయాన ఇల్లెందు నుంచి కొత్తగూడెం వైపు వేగంగా వెళుతున్న లారీ సురేశ్ కుటుంబసభ్యుల పైనుంచి దూసుకెళ్లింది. ధనమ్మ తల, జయశ్రీ నడుము భాగం మీదుగా లారీ వెళ్లగా ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. సురేశ్ ఒక కాలు, సాత్విక్ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి.
పాకుతూ వెళ్లేందుకు..: రెండు కాళ్లూ విరిగి తల్లి పక్కనే పడిపోయిన సాత్విక్ తన కాళ్లను చూసుకుంటూనే ధనమ్మ వైపు తిరిగి ‘అమ్మా.. లే అమ్మా’అంటూ చేసిన ఆర్తనాదాలు అందరినీ కంటతడి పెట్టించాయి. రోడ్డుపై పాకుతూ తల్లి, అక్క మృతదేహాల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న బాలుడిని చూసి అంతా చలించిపోయారు. సమాచారం అందుకున్న ఇల్లెందు సీఐ తాటిపాముల సురేశ్ సిబ్బందితో వచ్చి సురేశ్ సాత్విక్‌ను 108లో ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఖమ్మం రిఫర్ చేయగా.. ఖమ్మంలో పరీక్షించిన వైద్యులు సాత్విక్‌ను హైదరాబాద్ నిమ్స్‌కు, సురేశ్‌ను వరంగల్ ఎంజీఎంకు సిఫారసు చేశారు.


