బాధిత కుటుంబంతో కలిసి మాట్లాడుతున్న కేటీఆర్
కుమ్మెర ఘటన మాటలకందని విషాదం
ఈ కేసులో హంతకులను కాపాడటం సిగ్గుచేటు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
బాధిత కుటుంబానికి పరామర్శ
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దాడి ఘటనలో హంతకులను కాపాడే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కుమ్మెర జాతరలో జరిగిన ఘటన మాటలకు అందని విషాదం అని చెప్పారు. రెండు నెలల పసిగుడ్డు ఏం పాపం చేసిందని దుర్మార్గంగా ప్రవర్తించారని మండిపడ్డారు. శిశువు మరణిస్తే కూడా హత్యకేసు పెట్టకపోవడమేంటని ప్రశ్నించారు. హంతకులను కాపాడాలనుకునే ప్రతిఒక్కరూ దోషులేనని, ఇందులో సీఎం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఎవరున్నా దోషులేనని అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు.
మానవత్వానికే మచ్చ..
కుమ్మెరలో నిరుపేద కుటుంబంపై దాడి ఘటన మానవత్వానికే మచ్చగా కేటీఆర్ అభివర్ణించారు. ఈ ఘటనను రాజకీయం చేసేందుకు తాము రాలేదని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అడిగే బాధ్యత ప్రజలందరిపై ఉందని స్పష్టం చేశారు. మల్లన్న దర్శనం కావాలని అడిగినందుకు ఒక వ్యక్తిపై 20 మంది దాడిచేయడం అధికార అహంకారమేనని చెప్పారు. విచక్షణ లేకుండా ఒకడు కాలితో తన్నితే రెండు నెలల పాప చనిపోయిందని తెలిపారు. ఈ కేసును పోలీసులు సుమోటోగా తీసుకోవాల్సింది పోయి.. ఫిర్యాదు ఇస్తే సరిగా రాసివ్వలేదని ఇబ్బంది పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాప తల్లి న్యాయం కోసం రోడ్డెక్కే పరిస్థితి రావడం దారుణమైన విషయం అన్నారు.
8 మందిపై హత్య కేసు నమోదు చేయాలి
పసిపాపకు కులం, మతం, అధికారం గురించి ఏం తెలుసని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ఘటన గురించి తెలిశాక ఒక తండ్రిగా తల్లడిల్లిపోయానని ఆవేదన చెందారు. 8 మందిపై హత్యకేసు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే శిక్షపడే దాకా ఉద్యమం ఆపబోమని, అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. బాధిత కుటుంబానికి రూ.కోటి పరి హారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ తరపున రూ.లక్ష చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఇంటి నిర్మాణం కోసం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్టు తెలిపారు. కేటీఆర్ వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడి ఉన్నారు.


