చివర్లోనూ చిక్కులు! | Palamuru-Ranga Reddy project delays: Telangana | Sakshi
Sakshi News home page

చివర్లోనూ చిక్కులు!

Feb 26 2026 1:20 AM | Updated on Feb 26 2026 1:20 AM

Palamuru-Ranga Reddy project delays: Telangana

‘పాలమూరు– రంగారెడ్డి’ నిర్మాణంలో జాప్యం

నిధుల సమస్యతో పలుచోట్ల నిలిచిన పనులు

నార్లాపూర్, ఏదులలో పరిహారం కోసం నిర్వాసితుల పట్టుమోటార్లు డ్రైరన్‌కు సిద్ధంగా ఉన్నా ఏమీ చేయలేని దుస్థితి

మరోవైపు కుడికుళ్ల, తిర్నంపల్లి మధ్య సాగుతున్న కెనాల్‌ పనులు

ఇది పూర్తయితే అందుబాటులోకి రానున్న 4 రిజర్వాయర్లు

ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో చేపట్టిన పాల­మూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు పథ­కానికి గ్రహణం వీడడం లేదు. కర్వె­న మినహా చివరి దశలో ఉన్న నాలు­గు రిజర్వా­యర్లు, పంప్‌హౌస్‌ల పనులు కొన్నిచోట్ల నత్తనడకన సాగుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా అటకెక్కాయి. నిధులు, పరిహారం చెల్లింపు సమస్యలే ఇందుకు ప్రధాన కారణం కాగా.. పనుల పూర్తికి సర్కారు మరోసారి డెడ్‌లైన్‌ (వచ్చే మార్చి) పొడిగించక తప్పని పరిస్థితి నెలకొంది.

చివరి దశలో 4 రిజర్వాయర్ల పనులు
మొదటి దశలో ఐదు రిజర్వాయర్లు.. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని నార్లాపూర్‌లో అంజనగిరి (6.80 టీఎంసీలు), వనపర్తి జిల్లా ఏదులలో వీరాంజనేయ (6.55 టీఎంసీలు), నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెంలో వెంకటాద్రి (16.58 టీఎంసీలు), మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలంలోని కర్వెనలో కురుమూర్తిరాయ (19.15 టీఎంసీలు), జడ్చర్ల మండలంలోని ఉద్ధండాపూర్‌ (15.91 టీఎంసీలు) నిర్మాణం చేపట్టారు.

కర్వెన మినహా (ఇక్కడ నీళ్లు ఎత్తిపోయాల్సిన అవసరం లేదు) నాలుగు చోట్ల పంప్‌హౌస్‌లు నిర్మించారు. మొత్తంగా సుమారు ఏడాదిన్నర క్రితమే అంజనగిరి 100 శాతం, వీరాంజనేయ 95, వెంకటాద్రి 90, కర్వెన 80 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ఏదులలో రిజర్వాయర్‌ కట్టకు రివిట్‌మెంట్, ఉద్ధండాపూర్‌లో పంప్‌హౌస్‌ తవ్వకం, హెడ్‌ రెగ్యులేటరీ పనులు పూర్తి కాగా.. సర్జ్‌పూల్, పంప్‌హౌస్‌ కాంక్రీట్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది.

ఆ 2.5 కి.మీ. పనులు పూర్తయితే జలకళ
నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి ఏదుల రిజర్వాయర్‌ వరకు 16 కి.మీ.,ల సొరంగం పూర్తయింది. 8.3 కి.మీ.ల ఓపెన్‌ కెనాల్‌ నుంచి నీటిని తరలించాలి. ఇందులో కుడికుళ్ల, తిర్నాంపల్లి మధ్య 2.5 కి.మీ.,ల మేర మాత్రమే పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక్కడ సుమారు 15 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తొలగించాల్సి ఉండగా పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇది పూర్తయితే నార్లాపూర్‌ నుంచి కర్వెన వరకు అంటే నాలుగు రిజర్వాయర్లను నీటితో నింపే అవకాశం ఉంది.

ఇంకా అసంపూర్తిగా ఉన్నవి..
మొత్తం 18 ప్యాకేజీలకు గాను ప్యాకేజీ–12లో వట్టెం నుంచి కర్వెన వరకు ఓపెన్‌ కెనాల్‌ పనులు ఒక శాత­మే మిగిలాయి. ప్యాకేజీ–4లో నార్లాపూర్‌ నుంచి ఏదు­ల వరకు టన్నెల్‌ నిర్మాణం పూర్తి కాగా.. 2.74 కి.మీ. మేర గ్యాంట్రీ లైనింగ్‌ పూర్తి కావాలి. ప్యాకేజీ–7లో ఏదుల నుంచి వట్టెం వరకు 14.853 కి.మీ మేర (ఎడమ), 5.287 కి.మీ.,ల మేర (కుడి) సొరంగాల గ్యాంట్రీ లైనింగ్‌.. 2.94 కి.మీ.,ల మేర ఎడమ.. 0.339 కి.మీ.,ల మేర కుడి సొరంగం బెడ్‌ లైనింగ్‌ పనులు పూర్తికావాల్సి ఉంది.

తాగునీటి పనులు మాత్రమే..?
నార్లాపూర్‌ పంప్‌హౌస్‌లో ప్రత్యామ్నాయంతో కలుపుకొని మొత్తం 8 మోటార్లు కాగా ఇప్పటివరకు 4 అమర్చారు. నెలరోజుల్లో 2, 3, 4 పంప్‌ల డ్రైరన్‌ చేపట్టనున్నారు. ఏదులలో 10 మోటార్లకు గాను ఐదింటిని డ్రైరన్‌కు సిద్ధం చేశారు. వట్టెంలో 10 మోటార్లకుగాను నాలు­గింటి డ్రైరన్‌ పూర్తవగా.. ఐదోది డ్రైరన్‌కు సిద్ధంగా ఉంది. ఉద్ధండాపూర్‌లో ఆరింటికి మూడింటి పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ పనులను తాగునీటి అవసరాలకు ఉపయోగపడేవేనని స్పష్టమవుతోంది.

నిధులు, పరిహార సమస్యలు..
నార్లాపూర్, ఏదులలో రిజర్వాయర్ల పరిధిలో ఇళ్లు, భూములు కోల్పోయిన ముంపు ప్రాంతాల నిర్వా­సితులకు సంబంధించి పరిహార సమస్యలు ఉన్నాయి. బండరావిపాకులలో 18 ఏళ్లు నిండిన వారికి 300 ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతోపాటు పరిహారం పక్కదారి పట్టిందంటూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అలాగే కొల్లాపూర్‌ మండలంలోని ముంపు ప్రాంతాలైన సున్నపుతండా, ఒడ్డె గుడిసెల్లో నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదు. ఫలితంగా ఆయా ముంపు ప్రాంతాల వారు ఖాళీ చేయకుండా అక్కడే నివసిస్తున్నారు. దీంతో ఆయా రిజర్వాయర్ల పరిధిలో మోటార్లు డ్రైరన్‌కు సిద్ధంగా ఉన్న ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది. వట్టెంలో సుమారు రూ.200 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉండడంతో పనులు ముందుకు కదలడం లేదని తెలుస్తోంది.

ప్రాజెక్టు వివరాలు
పరిపాలన అనుమతులు: 10.06.2015
లబ్ధి పొందే జిల్లాలు: 6 (నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ)
పనుల ప్రారంభం: 2015 జూన్‌ 11(భూత్పూర్‌ మండలం కర్వెనలో ప్రాజెక్టు పైలాన్‌ను అప్పటి సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు)

సాగు నీరందించే లక్ష్యం    : 12.30 లక్షల ఎకరాలు
తాగునీరు అందే ప్రాంతాలు: 70 మండలాలు, 1,226 గ్రామాలు

వ్యయ వివరాలు ఇలా.. 
అంచనా వ్యయం: రూ.35,200 కోట్లు
సవరించిన వ్యయం: రూ.55,086 కోట్లు
సర్కారు తాజా అంచనా: రూ.80,000 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement