యాదాద్రి భువనగిరి జిల్లా: భూ తగాదాలో వదినపై మరిది హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. పాలడుగు గ్రామానికి చెందిన బొంత నర్సింహ, అతడి తమ్ముడు అశోక్‌కు కొంతకాలంగా భూ తగాదాలు నడుస్తున్నాయి. 6 నెలల క్రితం నర్సింహ అనారోగ్యంతో మృతిచెందాడు. నర్సింహ పేరిట ఉన్న భూమిలో తనకు వాటా వస్తుందని అతడి భార్య లక్ష్మి అలియాస్ వెంకటమ్మతో అశోక్ తరచూ గొడవకు దిగేవాడు.
ఈ క్రమంలో లక్ష్మి ఇంటిపై మరిది అశోక్ దాడి చేసి ఇంట్లోని సామగ్రి అంతా ధ్వంసం చేశాడు. దీంతో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కాగా మంగళవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన లక్ష్మి ఇంటికి తిరిగి వస్తుండగా.. అశోక్ తన దగ్గరి బంధువులైన ముగ్గురు వ్యక్తుల సహాయంతో కొబ్బరి బోండాల కత్తితో వదిన లక్ష్మిపై దాడి చేసి గొంతు కోసి పారిపోయారు. అతి కష్టం మీద లక్ష్మి మెడకు టవల్ చుట్టుకొని ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది.
ఆమెను 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి గ్రామస్తులను, బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి అక్క చంద్రమ్మ ఫిర్యాదు మేరకు అశోక్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.


