అమరావతి అభివృద్ధికి వందేళ్లు! | Andhra Pradesh capital region may take a hundred years to develop | Sakshi
Sakshi News home page

అమరావతి అభివృద్ధికి వందేళ్లు!

Feb 25 2026 3:25 AM | Updated on Feb 25 2026 3:25 AM

Andhra Pradesh capital region may take a hundred years to develop

బ్రిజేష్ కుమార్‌ ట్రిబ్యునల్‌కు నివేదించిన ఏపీ ప్రభుత్వం  

ఏపీ రాజధాని నిర్మాణంతో సాగు తగ్గి 15.78 టీఎంసీలు ఆదా అవుతాయని గతంలో తెలంగాణ వాదన 

తెలంగాణ లెక్కలు తప్పంటూ ఏపీ ప్రతి వాదన

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతం (అమరావతి) అభివృద్ధికి వందేళ్లు పట్టవచ్చు నని జస్టిస్‌ బ్రిజేష్ కుమార్‌ ట్రిబ్యునల్‌కు ఏపీ ప్రభు త్వం నివేదించింది. ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) చట్టం–2014 ప్రకారం.. సీఆర్‌డీఏ అనేది ఒక ముసాయిదా ప్రణాళిక మాత్రమేనని.. దానిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయకపోవడం వల్ల దానికి చట్టబద్ధత లేదని వివరించింది. రాజధాని నగరం, రాజధాని ప్రాంతం మధ్య వ్యత్యాసం ఉందని పేర్కొంది. 

రాజధాని ప్రాంతం అభివృద్ధి వల్ల పట్టణీకరణ కారణంగా పంటల సాగు నిలిచిపోతుందని.. దీని వల్ల 15.78 టీఎంసీలు ఆదా అవుతాయని తెలంగాణ చేసిన వాదనలో పసలేదని తోసిపుచి్చంది. జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్‌–2 ఎదుట ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్తా మంగళవారం రెండో రోజు వాదనలు కొనసాగించారు. రాజధాని ప్రాంతంలోని 53,600 ఎకరాల్లో ఒక్క ఎకరా కూడా కృష్ణా డెల్టా ఆయకట్టు భూమి లేదన్నారు. 

వైకుంఠపురం ఎత్తిపోతల కింద 891 ఎకరాల ఆయకట్టు మాత్రమే రాజధాని ప్రాంతంలో ఉందని.. ఆ ఎత్తిపోతల ఇప్పుడు పనిచేయడం లేదని వివరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించేందుకే పట్టిసీమ ఒక తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక పట్టిసీమ ఎత్తిపోతల అవసరం ఉండదని స్పష్టం చేశారు. గోదావరి ట్రిబ్యునల్‌ అనుమతించిన 80 టీఎంసీల కంటే కృష్ణా డెల్టాకు ఎక్కువగా గోదావరి నీళ్లను మళ్లిస్తున్నారంటూ తెలంగాణ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. 

కృష్ణా జలాల పంపిణీకి 2023, అక్టోబర్‌ 6న కేంద్రం అదనంగా నిర్దేశించిన మార్గదర్శకాలను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో ట్రిబ్యునల్‌ విచారణను మంగళవారం ముగించింది. తదుపరి విచారణను మార్చి 23–25కు వాయిదా వేసింది. తదుపరి విచారణలో కూడా ఏపీ ప్రభుత్వం తుది వాదనలను కొనసాగించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement