మహాపచారం మీదే చంద్రబాబూ..! | Chandrababu TDP gang is mastermind behind TTD Laddu adulterated ghee | Sakshi
Sakshi News home page

మహాపచారం మీదే చంద్రబాబూ..!

Feb 25 2026 3:20 AM | Updated on Feb 25 2026 5:01 AM

Chandrababu TDP gang is mastermind behind TTD Laddu adulterated ghee

తిరుమల ఏడు కొండలూ టీటీడీవేనని జీవో ఇచ్చింది వైఎస్సార్‌

హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధించిందీ వైఎస్సారే 

తాను అధికారంలోకి వస్తే ఆ జీవోలను రద్దు చేస్తానన్నదీ చంద్రబాబే

ఇప్పుడు ఆ జీవోలపై అసెంబ్లీలో నిస్సిగ్గుగా బాబు బుకాయింపు.. 

వీడియో సాక్ష్యాధారాలతో చంద్రబాబు వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌  

నెయ్యి ట్యాంకర్లు రిజెక్టు కావడం.. వాటినే తిరిగి వినియోగించింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే  

2014–19 మధ్య టీటీడీకి కిలో రూ.278కే ఇందాపూర్‌ డెయిరీ నెయ్యి సరఫరా.. ఇప్పుడు ఏకంగా కిలో నెయ్యి రూ.658 చొప్పున సరఫరా  

కల్తీ నెయ్యి పాపం టీడీపీ ముఠా నిర్వాకమే.. 

ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన చంద్రబాబు బృందం.. బెడిసికొట్టిన చంద్రబాబు కపటనాటకం  

సాక్షి, అమరావతి: ‘‘మోసానికి ఫ్యాంటూ చొక్కా వేస్తే అది చంద్రబాబు...!’’ అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పిన మాటలు నిజమేనని శాసనసభ వేదికగా మరోసారి రుజువైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని సీబీఐ తన చార్జిషీట్‌లో తేల్చేసినా ఆయన ఏమాత్రం పశ్చా­త్తా­పం చెందలేదు! దారుణమైన అబద్ధాలు మాట్లాడి వెంకన్న భక్తులను క్షోభకు గురిచేసి మోసగించాననే బాధ ఆయన మొహంలో ఏ కోశానా కానరాలేదు. 2014–19 మధ్య టీటీడీకి కిలో రూ.278కే ఇందా­పూర్‌ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. 

ఇప్పుడు ఏకంగా కిలో నెయ్యి రూ.658 చొప్పున సరఫరా కాంట్రాక్టు అప్పగించడంపైనా సమాధానం లేదు! ఇందాపూర్‌ డెయిరీని హెరిటేజ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌గా కొద్ది రోజుల క్రితం వరకు హెరిటేజ్‌ వెబ్‌సైట్‌లోనే చూపించారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా కో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌గా మార్చేయడంపైనా సమాధానం లేదు! టీటీడీకి పంపిన నెయ్యి ట్యాంకర్లు రిజెక్టు కావడం.. వాటినే తిరిగి వినియోగించడం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే జరిగాయని సీబీఐ దర్యాప్తులో తేల్చేసినా దానికీ సమాధానం లేదు. చంద్రబాబు వీటిలో ఏ ఒక్కదానికీ జవాబు చెప్పకుండా తిరుమల క్షేత్రం, ఏడుకొండల గురించి గతంలో తాను చేసిన వ్యాఖ్యలను కప్పిపుచ్చుకుంటూ చట్ట సభ సాక్షిగా నిస్సిగ్గుగా బుకాయించారు. 

‘‘టీడీపీ అధికారంలోకి వస్తే ఆ రెండు జీవోలు 746, 747లను రద్దు చేస్తాం..’’ అని స్వయంగా మీరే 2009లో గుంటూరులో టీడీపీ ఎన్నికల ప్రచార సభలో చెప్పారు చంద్రబాబూ..! ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ అవుతున్నాయి. తిరుమల ఏడుకొండలూ టీటీడీవేనని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన 746, 747 జీవోలను మీరు రద్దు చేస్తామన్నారు.. హిందూ దేవాలయాల్లో అన్య­మత ప్రచారాన్ని నిషేధిస్తూ మహానేత వైఎస్సార్‌ ఇచ్చిన జీవోను కూడా రద్దు చేస్తామని కూడా మీరే ప్రకటించారు చంద్రబాబూ..! అంటే.. తిరుమల శ్రీవారి పట్ల, హిందూమతం పట్ల అపచారానికి ఒడిగట్టింది మీరే.. అటువంటి మీరు ఇప్పుడు పరమ భక్తుడి మాదిరిగా కొంగ జపం చేస్తుంటే ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరన్నది గుర్తుంచుకోండి చంద్రబాబూ..! ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అటు కలియుగ దైవం తిరుమల శ్రీవారు అంటే ఏమాత్రం భక్తీ లేదు..! ఇటు ప్రజాస్వామ్య దేవాలయం శాసనసభ పట్ల కనీస గౌరవం లేదని నిస్సిగ్గుగా నిరూపించుకున్నారు! భగవంతుడి గురించి ఏమాత్రం అవాస్తవం చెప్పాలన్నా ఏ ఒక్క భక్తుడూ సాహసించరు. 

అందుకే ‘దేవుడి తోడు.. నిజమే చెబుతున్నా!’ అని ప్రమాణం చేస్తారు. ఇక నిండు సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడాలంటే ఏ పాలకుడైనా కాస్త తటపటాయిస్తారు. కానీ తనకు అవేవీ పట్టవని చంద్రబాబు చాటి చెబుతూ, శాసనసభ వేదికగా తిరుమల క్షేత్రం గురించి పచ్చి అవాస్తవాలు వల్లిస్తూ, బుకాయిస్తూ రాజకీయ దురుద్దేశ ఆరోపణలు చేశారు. తిరుమలను రెండు కొండలకే పరిమితం చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవోలు జారీ చేశారని చంద్రబాబు నిస్సిగ్గుగా అవాస్తవాలు ప్రచారం చేశారు.

ఇక తిరుమల లడ్డూ ప్రసాదం కోసం కల్తీ నెయ్యి సరఫరా మహాపచారం టీడీపీ సిండికేట్‌ నిర్వాకమేనని బట్టబయలు కావడంతో చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. కల్తీ దందా మహాపచారం పచ్చ ముఠా పనేనని ఆధారాలతో సహా  నిగ్గు తేలడంతో చంద్రబాబు అసెంబ్లీలో అడ్డంగా బుకాయించి ప్రజల్ని మభ్య పెట్టేందుకు పడరాని పాట్లు పడ్డారు. కానీ దాచేందుకు యత్నిస్తున్న కొద్దీ టీడీపీ కల్తీ నెయ్యి కంపు మరింతగా బయటపడుతోంది. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం సాగిందంతా 2024 జూన్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతేనన్నది తేదీలతో సహా వెలుగులోకి వచ్చింది. 

కల్తీ అని నిర్ధారణ అయినా సరే అదే నెయ్యిని తిరుమల ప్రసాదం కోసం సరఫరా చేసిన మహాపాపం టీడీపీ పాలకులదేనన్నదీ నిగ్గు తేలింది. ఇక కల్తీ నెయ్యి సరఫరాలో నిందితులుగా ఉన్న భోలే బాబా డెయిరీ, వైష్ణవి డెయిరీలతో చంద్రబాబు ముఠా వ్యాపార బంధం బట్టబయలైంది. టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్‌గా ఉన్న సంగం డెయిరీకి వైష్ణవి డెయిరీతో వ్యాపార సంబంధాలు ఉండటం.. అదే  సంగం డెయిరీకి 5 లక్షల కిలోల టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టడం.. మొత్తం పక్కా పన్నాగంతో కల్తీ దందా సాగిస్తున్నారన్నది టీటీడీ పాలక మండలి తీర్మానాల సాక్షిగా వెలుగులోకి వచ్చింది. 

ఇక చంద్రబాబు బుకాయించేందుకు ఏమీ లేదు.. తిరుమల శ్రీవారి ఆలయం పట్ల... పవిత్ర ప్రసాదం పట్ల మీరు చేసిన మహాపచారం బట్టబయలైంది బాబూ! టీడీపీ అనుకూల పత్రికలు ఎంత భాజాభజంత్రీలు మోగించినా సరే కల్తీ నెయ్యి పాపాన్ని దాచిపెట్టడం సాధ్యం కాదు. ఇకనైనా లెంపలు వేసుకుని తిరుమల శ్రీవారిని క్షమాపణలు వేడుకోండి... యావత్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పండి అని పరిశీలకులు సూచిస్తున్నారు. ఇంకా మొండిగా రాజకీయ కుట్రతో తిరుమల క్షేత్రంపై దుష్ప్రచారం చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరిస్తున్నారు. శాసన సభ వేదికగా చంద్రబాబు చేసిన అవాస్తవ ఆరోపణలను వైఎస్సార్‌సీపీ పూర్తి ఆధారాలతో తిప్పికొట్టింది. వైఎస్సార్‌ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్‌రెడ్డి, పేర్ని నాని వేర్వేరు విలేకరుల సమావేశాల్లో చంద్రబాబు బండారాన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement