కోర్టు ముందు అసత్యాలు ఉంచడం సరికాదు | High Court angry on Sarva Shiksha Abhiyan PD Srinivasa Rao | Sakshi
Sakshi News home page

కోర్టు ముందు అసత్యాలు ఉంచడం సరికాదు

Feb 25 2026 4:10 AM | Updated on Feb 25 2026 4:10 AM

High Court angry on Sarva Shiksha Abhiyan PD Srinivasa Rao

ఇలాంటి చర్యలను డీవోపీటీకి నివేదిస్తాం  

12 ఏళ్ల సర్వీసు ఉన్నందున ఆ పని చేయడం లేదు 

వాస్తవాలతో అఫిడవిట్‌ వేయండి  

సర్వశిక్షాభియాన్‌ పీడీ శ్రీనివాసరావుపై ఆగ్రహం 

విచారణ మూడు వారాలకు వాయిదా 

కేజీబీవీల్లో బోధనా సిబ్బంది నియామకంపై ముగిసిన వాదనలు 

తీర్పు రిజర్వ్‌ చేసిన ధర్మాసనం 

సాక్షి, అమరావతి: సర్వశిక్షాభియాన్‌ పీడీ శ్రీనివాసరావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ముందు అసత్యాలు ఉంచడం సరికాదని ఆక్షేపించింది. క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) బోధనా సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించే వ్యవహారంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. 

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేజీబీవీల్లో పార్ట్‌టైం పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ)గా పనిచేస్తున్న తమను అర్థాంతరంగా తొలగించడాన్ని సవాలు చేస్తూ పలువురు పీజీటీలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్‌జడ్జి అధికారుల తీరును తప్పుపట్టారు. వారి సేవలను కొనసాగించాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అధికారులు ధర్మాసనం ముందు ఈ ఏడాది జనవరిలో అప్పీల్‌ దాఖలు చేశారు. 

ఈ అప్పీల్‌పై జస్టిస్‌ బట్టు దేవానంద్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతూ వస్తోంది. సింగిల్‌ జడ్జి తీర్పును అమలు చేస్తామంటూ కోర్టుకిచి్చన హామీని ఉల్లంఘించినందుకు సర్వశిక్షాభియాన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ (పీడీ) శ్రీనివాసరావుపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది. తాజాగా ధర్మాసనం ఈ సుమోటో కోర్టు ధిక్కార వ్యాజ్యంతో పాటు సింగిల్‌ జడ్జి తీర్పుపై అధికారులు దాఖలు చేసిన అప్పీళ్లపై కూడా విచారణ జరిపింది. శ్రీనివాసరావు ఈ విచారణకు సైతం వ్యక్తిగతంగా హాజరయ్యారు. 

కోర్టు ఆదేశాలను గౌరవించి అమలు చేయండి చాలు... 
ఈ సందర్భంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టుకు అసత్యాలు చెప్పొద్దని తేల్చి చెప్పింది. క్రిమినల్‌ కోర్టు ధిక్కార చర్యలూ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసులో మీ చర్యలను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డీవోపీటీ)కి నివేదించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయితే 12 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు ఉన్న నేపథ్యంలో ఆ పని చేయడం లేదని స్పష్టం చేసింది. 

కోర్టు ముందు ఎందుకు అసత్యాలు చెప్పాల్సి వ చ్చిందని ధర్మాసనం ప్రశ్నించగా, కోర్టు అంటే భయమని శ్రీనివాసరావు చెప్పారు. కోర్టు అంటే భయమంటూ మళ్లీ అబద్ధం చెబుతున్నారని ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. మరోసారి ఇలాంటి వాటిని పునరావృత్తం చేయవద్దని స్పష్టం చేసింది. పూర్తి వాస్తవాలతో మరో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆయన్ను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement