సర్కారు బాధితులకు పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా
పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం
అందరి సమస్యలు వింటూ.. నేనున్నానని ధైర్యం చెబుతూ..
పేరు పేరునా పలకరిస్తూ.. కష్టసుఖాలు ఆరా తీస్తూ..
వినతిపత్రాలు స్వీకరించి ధైర్యం చెప్పిన జననేత
భారీగా తరలివచ్చిన యువత, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు
సాక్షి కడప ప్రతినిధి: మంచి రోజులు ముందున్నాయని, అందరూ ధైర్యంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనను కలిసి కష్టాలు చెప్పుకున్న వారికి భరోసా ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గాలతో నష్టపోయిన వారికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. వైఎస్ జగన్ రాకతో వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల కోలాహలంగా మారింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు పులివెందులకు చేరుకున్న ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.
నేరుగా తన క్యాంపు కార్యాలయానికి విచ్చేసి మూడు గంటలకు పైగా ప్రజలతో మమేకమై మాట్లాడారు. క్యాంపు కార్యాలయంలో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నారు. కార్యకర్తల కష్టసుఖాలు ఆరా తీస్తూ.. టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన బాధితుల కష్టాన్ని వింటూ.. నేనున్నానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. తర్వాత ఇంటి వద్ద వేచి ఉన్న నాయకులతోనూ చర్చించారు.

క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, సమస్యల పరిష్కారం కోసం వచ్చిన బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. ప్రతి ఒక్క కార్యకర్తను పేరు పేరునా పలకరించడమే కాక ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కొంత మంది యువకులు జగన్‌ను దగ్గరి నుంచి చూడాలని, ఆయనతో కరచాలనం చేయాలని అభిమానంతో ముందుకు రాగా, వారి కోరిక మేరకు సెల్ఫీలు దిగుతూ వారితో మాట్లాడారు.

వైఎస్ జగన్‌ను కలిసేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు, ప్రజలు
కార్యాలయం వద్ద జన సందోహం
వైఎస్ జగన్ పులివెందులకు వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు భారీగా తరలివచ్చారు. వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ఆవరణమంతా జన సంద్రంగా మారింది. పార్టీ అభిమానులు, కేడర్‌తోపాటు యువత, దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు ఇలా అందరూ తరలి రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. యువకులు వైఎస్ జగన్ నినాదాలతో హోరెత్తించారు. వైఎస్ జగన్ వాహనంపై నుంచి అందరికీ అభివాదం చేస్తూ.. కరచాలనం చేస్తూ.. సెల్ఫీలు దిగుతూ ముందుకు కదిలారు. కాగా, పార్టీనేతలు తదితరులు వైఎస్ జగన్‌ను కలిశారు.


