ఆగని కల్తీ పాల మరణాలు | Six year old boy dies at KGH in adulterated milk incident | Sakshi
Sakshi News home page

ఆగని కల్తీ పాల మరణాలు

Feb 25 2026 4:33 AM | Updated on Feb 25 2026 4:33 AM

Six year old boy dies at KGH in adulterated milk incident

గణేష్ ను కోర్టుకు తరలిస్తున్న పోలీసులు

కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆరేళ్ల బాలుడి మృతి

ఆరుకు చేరిన మరణాలు 

పెరుగుతున్న కేసులు.. ఆస్పత్రిలో చేరిన మరో మహిళ.. 21కి చేరిన బాధితుల సంఖ్య 

చికిత్స పొందుతున్న 15 మందిలో ఏడుగురి పరిస్థితి విషమం.. 

వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు

సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/మహారాణిపేట (విశాఖ): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలకూట విష ప్రభావం రోజు రోజుకూ మరింతగా పెరుగుతోంది. తాజాగా స్వరూప్‌ నగర్‌కు చెందిన చిన్నారి డి.మనోహర్‌ (6) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అ బాలుడిని మూత్రపిండాల సమస్యతో తొలుత రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కాకినాడ జీజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. 

పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడి నుంచి ఆదివారం మధ్యాహ్నం విశాఖకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మనోహర్‌ కిడ్నీ ఫెయిలైందని వెల్లడించారు. డయాలసిస్‌ చేశారు. కల్తీ పాలు తాగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆ బాలుడి కుటుంబ సభ్యులకు చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ మనోహర్‌ మంగళవారం మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రస్తుతం అక్కడి మార్చురీలోనే ఉంచారు. 

ఆస్పత్రిలో చేరిన మరో బాధితురాలు 
ఇప్పటికే కల్తీ పాలు తాగి 19 మంది అస్వస్థతకు గురవగా.. మంగళవారం మరో కేసు నమోదైంది. రాజమహేంద్రవరం నగరానికి చెందిన రెడ్డి అనంతలక్ష్మి (55) మూత్రపిండాల వ్యాధితో డెల్టా ఆస్పత్రిలో చేరారు. ఆమెను తొలుత కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే ఆ ఆస్పత్రిలో ఇప్పటికే ఇదే కేసు బాధితులు ఎక్కువ మంది ఉండటంతో డెల్టా ఆస్పత్రికి మార్చారు. ప్రస్తుతం ఆమెకు డయాలసిస్‌ చేస్తున్నారు. 

దీంతో బాధితుల సంఖ్య 21కి చేరింది. వీరిలో ఆరుగురు ఇప్పటికే మృతి చెందగా.. మిగిలిన 15 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. రెయిన్‌బో ఆస్పత్రిలో మూడేళ్లలోపు చిన్నారులు ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వారికి రోజుకు రెండుసార్లు డయాలసిస్‌ చేస్తున్నారు. ఈ దృశ్యాలు చూపరులను కలచివేస్తున్నాయి. 

హెల్త్‌ బులెటిన్‌ విడుదల 
కల్తీ పాల ఘటనపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం నివేదిక విడుదల చేసింది. లాలాచెరువు పరిధిలోని చౌడేశ్వర నగర్, స్వరూప్‌ నగర్‌ ప్రాంతాలకు చెందిన పలువురు వృద్ధులు అనూరియా, వాంతులు, పొత్తికడుపు నొప్పి, తీవ్ర మూత్రపిండ వైఫల్యంతో ఆసుపత్రిలో చేరినట్టు గుర్తించారు. రక్తంలో యూరియా, సీరమ్‌ క్రియాటినిన్‌ స్థాయిలు అధికంగా ఉండటంతో విషపూరిత ప్రభావం ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. 

పాల వినియోగమే దీనికి ప్రధాన కారణమని తేలింది. నెఫ్రాలజిస్టులతో కూడిన 14 ఫీల్డ్‌ సర్వేలెన్స్‌ బృందాలు 679 ఇళ్లను సందర్శించి 957 కుటుంబాలను స్క్రీనింగ్‌ చేశాయి. 110 కుటుంబాల్లో 293 మందిని గుర్తించి 315 రక్త నమూనాలు సేకరించారు. వాటిలో 313 సాధారణంగా ఉండగా ఇద్దరిలో యూరియా, క్రియాటినిన్‌ స్థాయిలు పెరిగినట్లు వెల్లడైంది. 

సెంట్రల్‌ జైలుకు పాల వ్యాపారి తరలింపు 
కల్తీ పాల వ్యాపారి అడ్డాల గణేష్‌ అరెస్టుపై హైడ్రామా నడిచింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గణేష్  ను అరెస్టు చేసిన పోలీసులు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసుల అదుపులో ఉన్న అతడికి కడుపు నొప్పి రావడంతో మంగళవారం కిమ్స్‌ బొల్లినేని ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం మధ్యాహ్నం అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడు కోలుకోవడంతో కోర్టులో హాజరుపర్చగా.. మార్చి 10 వరకూ రిమాండ్‌ విధించడంతో రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. 

వీడని కల్తీ గుట్టు 
కల్తీ పాల గుట్టు ఇంకా వీడలేదు. కల్తీపై స్పష్టత రావాలంటే రక్తం, పాల నమూనాల నివేదికలు రావాల్సి ఉంది. ఇవి మంగళవారం వచ్చే అవకాశముందని అధికారులు వెల్లడించినా.. మరికొంత సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. ల్యాబ్‌ రిపోర్టులు వస్తేగాని.. మరణాలు ఎలా సంభవించాయి.. పాలు పూర్తిస్థాయిలో కల్తీ జరిగాయా.. లేక వేరే ఏమైనా కలుషితం జరిగాయా అనే విషయం స్పష్టమవుతుంది. 

కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం అత్యుత్సాహంతో కూలెంట్‌ లీకేజీ సంభవించి ‘ఇథలీన్‌ గ్లైకాల్‌’ కలవడంతో పాల కల్తీ జరిగి ఈ మరణాలు సంభవించాయనే వాదన వినిపిస్తున్నారు. ల్యాబ్‌ రిపోర్టులు అందకుండానే దీనిపై ఎలా నిర్ధారిస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. పాల వ్యాపారి అడ్డాల గణేష్‌ డెయిరీ వద్ద పాల కల్తీకి ఉపయోగించే అనుమానిత పౌడర్‌ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఆ పౌడర్‌ ఏమిటనేదానిపై ల్యాబ్‌ నివేదికలు రావాల్సి ఉంది. అప్పుడే కల్తీ గుట్టు వీడుతుంది. 

మెలమైన్‌ కూడా కలిసే అవకాశం 
పాలల్లో ఇథలీన్‌ గ్లైకాల్‌తోపాటు యూరియా, మెలమైన్‌ కలిసే అవకాశం ఉందని ఎన్‌టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ మాజీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ రవిరాజు, విశాఖపట్నం కేజీహెచ్‌కు చెందిన డాక్టర్‌ గుళ్లపల్లి ప్రసాద్, డాక్టర్‌ సుధాకర్‌ వెంచురి, పి.శశాంక పాకలపాటి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కల్తీ పాల కేసులను వీరే సమన్వయం చేస్తున్నారు. బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాలకు పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ల్యాబ్‌ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని, ఫలితాలు 2 నుంచి 4 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.  

63 సార్లు డయాలసిస్‌ చేసినా.. 
రాజమహేంద్రవరంలోని స్వరూప్‌ నగర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు డి.మనోహర్‌కు కేజీహెచ్‌లో ఆరు రోజుల్లో ఏకంగా 63 సార్లు డయాలసిస్‌ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఆ బాలుడు మంగళవారం ప్రాణం వదిలాడు. ఈ నెల 18న అతడిని కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. అతడికి పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లోడాక్టర్‌ చక్రవర్తి ఆధ్వర్యంలో వైద్యులు కిడ్నీ సమస్య ఉందని వైద్యులు గుర్తించి, అప్పుడే వైద్యం ప్రారంభించారు. చివరకు కిడ్నీ ఫెయిల్యూర్‌ కారణంగా బాలుడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. 

అసలు ఊహించలేదు 
కల్తీ పాలు తాగటం వల్లే మా అబ్బాయి చనిపోయాడు. మూడేళ్లుగా గణేష్‌ వద్దే పాలు తీసుకుంటున్నాం. ఇంట్లో మా బాబు ఒక్కడే పాలు తాగుతున్నాడు. మహా శివరాత్రి నుంచి మా అబ్బాయికి ఆరోగ్యం బాగోలేదు. ఆ రోజు నుంచే యూరిన్‌ ఆగిపోయింది. రాజమండ్రి ఆస్పత్రి నుంచి కాకినాడ పంపారు. అక్కడి నుంచి 18న వైజాగ్‌ తీసుకొచ్చాం. మంగళవారం మధ్యాహ్నం చనిపోయాడని తెలిపారు. మనోహర్‌ను నమ్ముకునే బతుకుతున్నాం. ఇలా జరుగుతుందని ఊహించలేదు.   – అర్చన, బాలుడి తల్లి, రాజమహేంద్రవరం 

రెండింటి వల్ల కిడ్నీ పాడవుతుంది     
పాలు కల్తీ ఎలా జరిగాయనేది ల్యాబ్‌ రిపోర్టులు వస్తేనే కానీ చెప్పలేం. ఫ్రిజ్‌ నుంచి ఇథలీన్‌ గ్లైకాల్‌ లీకై పాలలో కలిసినా కిడ్నీ సమస్యలు వస్తాయి. అలా కాకుండా పాలలో యూరియా వంటి రసాయనాలు కలిపినా కిడ్నీ ఫెయిలయ్యే అవకాశం ఉంటుంది. గణేష్‌ వద్ద పాలు తీసుకున్న వారంతా కిడ్నీ పనితీరును నిర్ధారించే క్రియాటినిన్‌ పరీక్షలు తప్పక చేయించుకోండి. తేడా వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే  చికిత్సలు పొందండి.  – డాక్టర్‌ శశాంక్, నెఫ్రాలజిస్ట్, రాజమహేంద్రవరం

బాధ్యులపై చర్యలేవీ? 
మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం   
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో జనం చచి్చపోతున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా చూస్తూ కూర్చుందని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ప్రజలు చనిపోవడానికి ప్రభుత్వ అవినీతి, పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణమని అన్నారు. ‘ఓ వ్యక్తిపై చర్య తీసుకుని చేతులు దులుపుకుంటారా.. బాధ్యులైన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. 

కొన్ని నెలలుగానో, అంతకు ముందు నుంచో కల్తీ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు. జనం చచి్చపోతుంటే పట్టించుకోకుండా, ప్రశి్నంచే వారిపై మాత్రం కక్ష సాధింపు చర్యలపై మాత్రమే ఈ ప్రభుత్వం దృష్టి సారించింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి భారీగా పెరిగిపోయిందని, ఇదేంటని ఎవరినైనా అడిగితే పెదబాబు, చినబాబులకు ముడుపులు ఇస్తున్నామని చెబుతున్నారని చెప్పారు.

‘దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఏవో తప్పులు జరిగినట్లు సభలో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటం సరికాదు. తన తండ్రిని ప్రత్యర్థులు పొట్టన పెట్టుకున్నా, ఆ బాధను దిగమింగుకుని వైఎస్సార్‌ పరిపాలన చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల సమయంలో ప్రధాని పర్యటనలను పట్టించుకోలేదని మాట్లాడుతున్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు ప్రధాని పర్యటనలను చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దే కదా.. మహిళలు ఉన్నారని కూడా చూడకుండా సత్యదూరమైన మాటలను సభలో మాట్లాడుతున్నారు. 

సోము వీర్రాజుకు వయసొచ్చిందే గానీ దానికి తగ్గట్టు మాట్లాడటం లేదు. మేం ఏం అడిగినా ప్రభుత్వం బాధ్యతగా సమాధానం చెప్పడం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా క్షీణించాయి. దానికి నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేసి బయటకు వచ్చేశాం. సభలో ఏ అంశంపై అయినా చర్చించడానికి ఎంత సమయం అయినా ఎన్ని గంటలైనా మేం సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement