ఈ ప్రభుత్వమే కల్తీ | YSRCP leaders are angry over the government negligence | Sakshi
Sakshi News home page

ఈ ప్రభుత్వమే కల్తీ

Feb 25 2026 4:26 AM | Updated on Feb 25 2026 4:26 AM

YSRCP leaders are angry over the government negligence

ఆస్పత్రిలో కల్తీ పాల బాధితులను పరామర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు

పాలు, నీళ్లు, ఆహారం, మద్యం సహా అన్నీ కల్తీయే 

20 నెలల పాలనలో 36 కల్తీ ఘటనలు 

900 మందికి పైగా బాధితులు 

40 మంది చిన్నారుల మృతి 

సర్కారు నిర్లక్ష్యంపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం 

కల్తీ పాల బాధితులకు పరామర్శ 

సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కల్తీ సర్వసాధారణంగా మారిందని, ఈ ప్రభుత్వమే కల్తీదని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. పాలు, నీళ్లు, ఆహారం, మద్యం.. ఇలా అన్నింటా కల్తీ విలయ తాండవం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కల్తీ పాల బాధితులను మంగళవారం వారు పరామర్శించారు. అనంతరం కిమ్స్‌ బొల్లినేని ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. పాలనపై సీఎం చంద్రబాబు పట్టు కోల్పోయారన్నారు. 

20 నెలల పాలనలో మొత్తం 36 కల్తీ ఘటనలు జరిగితే.. 900 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారని, 40 మంది చిన్నారులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి సంపాదనపై దృష్టిపెట్టిన చంద్రబాబు పాలనను పూర్తిగా గాలికొదిలేశారని, ఫలితంగానే కల్తీలతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారని అన్నారు. మాజీ మంత్రులు విడదల రజిని, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, సీదిరి అప్పలరాజు, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, పార్టీ నేత డాక్టర్‌ గూడూరు శ్రీనివాస్‌ ఏమన్నారంటే.. 

20 నెలల్లో 36 ఘటనలు 
‘కల్తీ పాల వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. 2024 జూలైలో తొలిసారి శ్రీకాకుళం కేజీబీవీ హాస్టల్‌లో డయేరియా ప్రబలినప్పుడే ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే ఇన్ని దారుణాలు జరిగేవి కావు. 20 నెలల్లో 36 ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి పేదలే బలైపోతున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో సింథటిక్‌ మిల్క్‌ తయారీ యూనిట్‌ వెలుగులోకి వచ్చినా కనీసం పట్టించుకోలేదు. 

కల్తీ పాల ఘటనను డైవర్ట్‌ చేసి, ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి ఎల్లో మీడియా రంగంలోకి దిగింది. ఇష్యూను డైవర్ట్‌ చేసేందుకు కూలెంట్‌ లీకేజీ అయిందంటూ కథనాలు అల్లుతోంది. రక్తం, పాల నివేదికలు రాక ముందే ఇలా ఎలా ప్రకటిస్తారు? మీరేమైనా సీసీ కెమెరాలో చూశారా? రాష్ట్రంలో 200 లక్షల లీటర్ల పాలు అనధికారంగా సరఫరా అవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో మిల్క్‌ ప్రొక్యూర్‌మెంట్‌ యాక్ట్‌ తీసుకొచ్చారు. కానీ, ఆ నిబంధనలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదు. 

కూటమి ప్రభుత్వం కల్తీ మాటలతో అధికారంలోకి వచ్చింది. అందుకే పాలు, తిండి, నీరు, ఆఖరికి కల్తీ మద్యం.. ఇలా ప్రతిదాన్నీ కల్తీ చేస్తూ దోపిడీ చేసేవారి ఆగడాలు ఎక్కువైపోయాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా డయేరియాతో 900 మంది ఆస్పత్రుల్లో చేరారు. సంక్షేమ హాస్టళ్లలో చదివే ఎంతోమంది విద్యార్థులు చనిపోయారు. కల్తీ పాలతో అస్వస్థతకు గురైన బాధితులు రాజమహేంద్రవరం, కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే వైద్యం నిరాకరిస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు రూ.లక్షల ఫీజులతో దోపిడీ చేస్తున్నాయి. 

రితిక్‌ అనే బాలుడిని కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఆస్పత్రిలో రూ.8.50 లక్షల బిల్లు కట్టాల్సి వచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి కల్తీ పాల దారుణాలు వెలుగు చూసినా స్పందించాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. బాధితులకు ఏకంగా డయాలసిస్‌ చేయాల్సిన దుస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఘోరంగా ఉందని అర్థమవుతోంది. రాజమహేంద్రవరం చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం ఇది. ఏమవుతుందో తెలుసుకునే లోపే ఐదుగురు చనిపోయారు. ఎంతోమంది వెంటిలేటర్ల మీద చికిత్స పొందుతున్నారు. 

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలి. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా నిందితులను కఠినంగా శిక్షించాలి. బాధితులందరికీ ఉచితంగా వైద్యం అందించాలి. ఇప్పటికే ఆస్పత్రులు తీసుకున్న ఫీజులు వెనక్కివ్వాలి’ అని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement