హెరిటేజ్‌ కోసం టీటీడీ పరువు తీస్తారా? | Former TTD Chairman Bhumana Karunakar Reddy fires on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

హెరిటేజ్‌ కోసం టీటీడీ పరువు తీస్తారా?

Feb 25 2026 3:44 AM | Updated on Feb 25 2026 3:44 AM

Former TTD Chairman Bhumana Karunakar Reddy fires on Chandrababu Naidu

షేర్లను పెంచుకోవడానికే చర్చ పేరుతో అసెంబ్లీలో డ్రామా 

ఇందాపూర్‌ టెండర్లపై పచ్చి అబద్ధాలు 

కిలో రూ.278 నెయ్యి రూ.658 ఎలా అయ్యింది? 

ఏడుకొండల పవిత్రతను కాపాడింది వైఎస్సారే 

సనాతన ధర్మం ముసుగులో విష ప్రచారం చేస్తున్నది మీరే 

హిందూ సంప్రదాయంలోనే నా బిడ్డ పెళ్లి 

బాబు వియ్యంకుడు బాలకృష్ణ, సోదరుడు రామ్మూర్తి నాయుడులే సాక్ష్యం 

బాబూ.. బైబిల్‌ పట్టుకున్న మీరు క్రిస్టియనా? నమాజు చేస్తున్న మీరు ముస్లిమా? 

సనాతన ధర్మ పరిరక్షకుడినని చెప్పుకుంటున్న ఆయన మూడో భార్య క్రిస్టియన్‌ 

టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి మండిపాటు 

సాక్షి ప్రతినిధి, తిరుపతి:  శాసనసభ వేదికగా తిరుమల లడ్డూ అంశంపై జరిగిన చర్చ కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమేనని, పడిపోతున్న హెరిటేజ్‌ సంస్థ షేర్ల విలువను పెంచుకోవడానికే చంద్రబాబు ప్రభుత్వం ఈ నాటకానికి తెర లేపిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. మంగళవారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 

శాసనసభలో తిరుమల లడ్డూ అంశంపై ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీపై, వైఎస్‌ జగన్‌పై పనిగట్టుకుని దు్రష్పచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నెయ్యి కల్తీకి సంబంధించి పచ్చి అబద్ధాలతో ఇవాళ అసెంబ్లీలో 4 గంటలపాటు చర్చ సాగింది. బోలేబాబాకు పూర్వనామమైన హర్ష్ ఫ్రెష్‌ డెయిరీని తెచ్చిందే చంద్రబాబు ప్రభుత్వం. వారి హయాంలోనే 80 వేల కేజీల నెయ్యిని వాళ్లు సరఫరా చేశారు. చంద్రబాబు టైంలోనే హర్ష్ ఫ్రెష్‌ డెయిరీకి టెండర్లలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. ఇందాపూర్‌ డెయిరీని తీసుకొచ్చింది కూడా చంద్రబాబే. 

ఇది హెరిటేజ్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌. అదే ఇందాపుర్‌ సంస్థ కేజీ నెయ్యి రూ.278తో సరఫరా చేసింది. 20 లక్షల కేజీల నెయ్యి సరఫరా టెండర్‌లో కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ మాత్రమే ఏకైక బిడ్డర్‌. అందులో మరెవ్వరూ పాల్గొనలేదు. కానీ పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాత్రం అదే టెండరులో ఎల్‌–2 గా ఉన్న ఇందాపూర్‌ డెయిరీకి 35 శాతం సరఫరాకు అవకాశం ఇచ్చామని శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారు. ఈ టెండర్లు అయిన మూడో రోజునే కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ డైరెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 లక్షల కేజీలు సరఫరా చేశాం.. మరో 20 లక్షల కేజీలు నెయ్యి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ప్రకటించారు. 

అయినా కూడా కూటమి ప్రభుత్వంలోని పెద్దలు కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ను బలవంతంగా ఆపి.. మీరు 10 లక్షల కేజీలకే పరిమితం అవ్వాలని చెప్పారు. ఆ తర్వాత మిగిలిన 10 లక్షలకు టెండర్లు పిలిచి ఇందాపూర్, మదర్‌ డెయిరీలకు కట్టబెట్టారు. ఈ టెండర్లలో కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ ఎల్‌–3గా పాల్గొంది. అంటే కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ సరఫరా చేయలేమని చెప్పిందన్న వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని తేలిపోయింది. కిలో రూ.658, రూ.657లకు కోట్‌ చేసిన ఇందాపూర్, మదర్‌ డెయిరీలు టెండర్లు దక్కించుకున్నాయి. 

హెరిటేజ్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థ అయిన ఇందాపూర్‌ రూ.278కే ఆ రోజు నెయ్యి సరఫరా చేస్తే.. ఇప్పుడు ఒకేసారి రూ.658కి ఎలా పెరిగిందని ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పడం లేదు’ అని తప్పుపట్టారు. ఆర్టీసీ టిక్కెట్ల వెనుక ప్రచార సమాచారం మీ హయంలో ముద్రిస్తే.. దాన్ని కూడా మాపై వేసి ఆరోపణలు చేస్తూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా భూమన ఇంకా ఏమన్నారంటే..  

ఏడు కొండల జీవో ఇచ్చింది వైఎస్సార్‌ 
»  సీబీఐ సిట్‌ తన చార్జిïÙట్‌లో ఎక్కడా మా ప్రమేయం ఉందని ప్రస్తావించ లేదు. మేము సుబ్రమణ్య స్వామి చేత రిట్‌ పిటిషన్‌ వేయించినట్లు మాపై ప్రచారం చేయిస్తున్నారు. మీరు భగవంతుడి పట్ల చేస్తున్న అపచారంపై ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి ఉండొచ్చు. మీరు ఏడాది కాలంగా  చెప్పిన మాటలనే మళ్లీ మళ్లీ చెబుతూ ఇవాళ శాసనసభ సాక్షిగా మళ్లీ అవే అబద్దాలను వల్లె వేశారు. దెయ్యాలు వేద యజ్ఞం చేసినట్లు.. చంద్రబాబు కూటమి నేతలు హిందూ ధర్మం మీద మాట్లాడటం అంత కంటే దారుణం.  

»   దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెండు కొండల జీవో తెచ్చారని ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారం జరగకూడదని 747 జీవోను, 352 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏడు కొండలన్నీ శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి చెందుతాయని జీవో ఇచ్చింది కూడా వైఎస్‌ రాజశేఖరరెడ్డే. గతంలో 1894 ప్రాంతంలో బ్రిటీష్‌ వారు  తిరుమల 25 కిలోమీటర్ల పరిధిలో ఉందని చెబితే.. దాన్ని సవరించి 352 కిలోమీటర్లకు పెంచి తిరుమల క్షేత్ర మహిమను పెంచింది వైఎస్సార్‌.  

»   2009 ఎన్నికల్లో ప్రచారం చేస్తూ.. టీడీపీ అధికారంలోకి వస్తే వైఎస్సార్‌ ఇచ్చిన రెండు జీవోలను తీసివేస్తానని మైనార్టీ సభలో చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇలాంటి ఆయన వైఎస్సార్‌ గురించి, జీవోల గురించి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు.  

చాలెంజ్‌ చేస్తున్నాం.. నిరూపించండి 
»  సుప్రీంకోర్టు ప్రకటించిన సిట్‌ తన నివేదికలో వైఎస్సార్‌సీపీ నేతల ప్రమేయం లేదని, కరుణాకరరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను దోషులగా ప్రకటించలేదన్నదే చంద్రబాబు బాధ. నెయ్యి వ్యవహారంలో టీడీడీ అధికారులు, నెయ్యి సరఫరాదారులు, కింది స్థాయి ఉద్యోగులు 36 మందిని దోషులుగా ప్రకటిస్తే దానిపై మీరు ఏకసభ్య కమిషన్‌ వేశారు. ఇంతలో ఇందాపూర్‌ డెయిరీకి– హెరిటేజ్‌కు మధ్య ఉన్న సంబంధం బయటపడ్డంతో ఒక్కసారిగా హెరిటేజ్‌ షేర్ల విలువ అమాంతంగా పాతాళంలోకి పడిపోయింది. దాన్ని పైకి లేపడానికే మీరు శాసనసభలో నెయ్యి వ్యవహారాన్ని చర్చకు తీసుకొచ్చారు.  

»   మేం ఏ తప్పూ చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నాం. ఆవులు తినే ఆహారం కారణంగా అందులో ఒకటి అరా కొవ్వు శాతం ఉంటుందన్న విషయాన్నే ఎన్‌డీడీబీ ప్రకటించింది. అయినా చంద్రబాబు ఇవాళ శాసనసభ సాక్షిగా ఎన్‌డీడీబీ ఇచి్చన రిపోర్టు ప్రకారమే మాట్లాడానని చెబుతున్నారు. కానీ ఆ రోజు మీరు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం లడ్డూలో నెయ్యికి బదులుగా ఆవు కొవ్వు కలిపిందని చెప్పలేదా? డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అయితే తిరుమల నుంచి అయోధ్యకు పంపించిన లక్ష లడ్డూల్లో ఆవుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిపారని చెప్పారు. ఇవాళ కూడా అదేమాట చెబుతున్నాడు. బోర్డు సభ్యుడు బోరా మీ పక్కనే ఉన్నాడు. ఆయన్ను అడగండి.    

నా కుటుంబ వ్యవహారాలపైనా అబద్ధాలే 
»   నేను నా కుమార్తెకు క్రిస్టియన్‌ మ్యారేజ్‌ చేశానని ఫోటో వేశారు. నా కుమార్తె పెళ్లిని తిరుచానూరు పరిధిలో 30 వేల మంది అతిథుల సమక్షంలో జరిపించా. మీ వియ్యంకుడు, లోకేశ్‌ మామ బాలకృష్ణ.. నీ తమ్ముడు, నా స్నేహితుడు నారా రామ్మూర్తి, అప్పటి హైకోర్టు న్యాయమూర్తులు పలువురు వచ్చారు. నా కూతురు పెళ్లిని హిందూ సంప్రదాయం ప్రకారం చేశానని ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నా. తిరుమల ఆలయ ప్రధానార్చకుల దగ్గర నుంచి తిరుమల వేదపారాయణదారులందరూ వచ్చి నా కుమార్తెను ఆశీర్వదించారు.  

»     మీరు కూడా బైబిల్‌ పట్టుకుని ఉన్నారు.. మరి మీరు క్రిస్టియనా చంద్రబాబూ? నమాజు చేస్తున్న ఈ ఫోటో చూసి మిమ్నల్ని ముస్లిం అంటే ఎలా ఉంటుంది చంద్రబాబూ? మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ మూడో భార్య క్రిస్టియన్‌.. అలాంటప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడు అని చెప్పుకునే ఆయన్ను క్రిస్టియన్‌ అని ఎందుకు అనడం లేదు? నన్నెలా అంటున్నారు? క్రిస్టియన్‌ యువతులతో ఉన్న లోకేశ్‌ని క్రిస్టియన్‌ అని అనాలా? మీరు ఎన్ని రకాల అబద్ధాలు చెప్పినా కల్తీ నెయ్యి మూలాలు మీ హయాంలోనే మొదలయ్యాయి. ఇందాపూర్‌ డెయిరీ, హర్ష్ ప్రెష్‌ డెయిరీగా ఉండి పేరుమార్చుకున్న బోలేబాబా డెయిరీ కూడా మీ హయాంలోనే వచ్చాయి.  

Advertisement
 
Advertisement
Advertisement