ఏపీని నియంత్రించండి | Telangana letter to Krishna Board | Sakshi
Sakshi News home page

ఏపీని నియంత్రించండి

Feb 25 2026 3:22 AM | Updated on Feb 25 2026 3:22 AM

Telangana letter to Krishna Board

శ్రీశైలం, సాగర్‌ నుంచి ఏపీ నీళ్లు విడుదల చేసుకునే అవుట్‌లెట్లను అధీనంలోకి తీసుకోండి 

కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ 

ఏపీ వాటా ఎప్పుడో ముగిసినా ఇంకా కొనసాగిస్తోంది 

అనధికారికంగా శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి జరుపుతోంది 

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నుంచి ఇప్పటికే వాటాకి మించి నీళ్లను వాడుకున్న ఏపీని.. మళ్లీ వరదలు వచ్చే వరకు నీళ్లు తీసుకోకుండా తక్షణమే నిలువరించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలు పూర్తిగా తమ రాష్ట్ర్ట వాటా జలాలేనని, తమ రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాల కోసం ఆ నిల్వలను పరిరక్షించాలని కోరింది. 

ఇందులో భాగంగా శ్రీశైలం, సాగర్‌పై ఉన్న ఏపీకి సంబంధించిన జలవిద్యుత్‌ కేంద్రాలతోపాటు ఆ జలాశయాల నుంచి ఆ రాష్ట్రం నీళ్లను తరలించుకునే అవుట్‌లెట్లను తక్షణమే తమ నియంత్రణలోకి తీసుకోవాలని కృష్ణా బోర్డుకు సూచించింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్‌) ఓవీ రమేశ్‌ బాబు ఈ నెల 21న కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. 

శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, మల్యాల, ముచ్చుమర్రి అవుట్‌లెట్లతోపాటు శ్రీశైలం కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం, నాగార్జునసాగర్‌ కుడి ప్రధాన కాల్వతోపాటు సాగర్‌ కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా ఏపీ నీళ్లను తరలించుకుంటోందని, వాటన్నింటినీ తక్షణమే తన అదీనంలోకి తీసుకోవాలని కోరింది. 

వాటాకి మించి ఏపీ వాడకం 
ప్రస్తుత నీటి సంవత్సరంలో ఈ నెల 19 నాటికి ఏపీ 697.7 టీఎంసీల (77.84శాతం)ను తరలించుకోగా, తాము కేవలం 198.64 టీఎంసీల (22.16శాతం)ను తరలించుకున్నట్టు లేఖలో తెలంగాణ పేర్కొంది. ఇప్పటికే ఏపీ తమ వాటాకి మించి 28.64 టీఎంసీలను అధికంగా వాడుకున్నట్టు తెలిపింది. శ్రీశైలం, సాగర్‌ నుంచి తాము 157.239 టీఎంసీలను వాడుకోవడానికి హక్కులు కలిగి ఉన్నామని స్పష్టంచేసింది. దీనిపై గతంలోనే పలుమార్లు లేఖలు రాసిన విషయాన్ని తెలంగాణ గుర్తు చేసింది. 

ఏపీ నీటి వాడకాన్ని ఆపకపోగా, శ్రీశైలం జలవిద్యుత్‌కేంద్రం ద్వారా ఈ నెల 13 నుంచి విద్యుదుత్పత్తిని ప్రారంభించి 18వ తేదీ నాటికి 15 టీఎంసీల జలాలను కిందికి విడుదల చేసిందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘శ్రీశైలం జలాశయంలో నిల్వలు 866 అడుగులకు పడిపోగా, కనీస మట్టానికి ఎగువన 72.186 టీఎంసీలే మిగిలి ఉన్నాయి. నాగార్జునసాగర్‌లో నిల్వలు 540 అడుగులకు తగ్గిపోగా కనీస మట్టానికి ఎగువన 56.65 టీఎంసీలే మిగిలి ఉన్నాయి. 

గత జనవరి 29 నాటికే ఏపీ తమ వాటా జలాలను పూర్తిగా వాడుకుంది. శ్రీశైలం, సాగర్‌లో మిగిలి ఉన్న నిల్వలు పూర్తిగా తెలంగాణకి హక్కుగా రావాల్సిన వాటా జలాలే’అని తెలంగాణ స్పష్టం చేసింది. తమకు ఇతర నిల్వ సదుపాయాలు లేకపోవడంతో ఉమ్మడి జలాశయాల్లోనే తమ వాటా నీళ్లను నిల్వ చేస్తున్నామని పేర్కొంది.  

Advertisement
 
Advertisement
Advertisement