రేవంత్‌ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదు | BRS Party Working President KTR comments over Revanth Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదు

Feb 25 2026 3:01 AM | Updated on Feb 25 2026 9:28 AM

BRS Party Working President KTR comments over Revanth Reddy

బాల్క సుమన్‌ను కలిసి జైలు నుంచి బయటకు వస్తున్న కేటీఆర్, ఎమ్మెల్యేలు

కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారు.. అప్పుడు రేవంత్‌ను వదిలిపెట్టం 

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టీకరణ 

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో ఆదిలాబాద్‌ జిల్లా జైలులో ములాఖత్‌ 

ఆదిలాబాద్‌ టౌన్‌: సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా జైలులో రిమాండ్‌పై ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం ములాఖత్‌ అయ్యారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నీచ రాజకీయాలను మానుకోవాలని, కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారని, అప్పుడు కలుగులో దాక్కున్నా రేవంత్‌ను వదిలిపెట్టమని హెచ్చరించారు. 

చట్టాలను, ప్రజా తీర్పులను గౌరవించాలని, మున్సిపల్‌ పాలకవర్గ ఎన్నికలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్నచోట పారదర్శకంగా నిర్వహణ చేపట్టాలన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు గెలిచారని, ఏడు స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌ అధికార దాహంతో ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వివేక్‌లు అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. బాల్క సుమన్‌ జైలుకు వెళ్లడం కొత్తేమీ కాదని, తెలంగాణ కోసం పదుల సార్లు జైలుకు వెళ్లినట్లు కేటీఆర్‌ గుర్తు చేశారు. 

డీజీపీ శివధర్‌రెడ్డి సినిమా డైలాగ్‌లు చెప్పారని, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు పోలీసులను తిట్టినప్పటికీ వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఏం తప్పు చేశారని కేసు పెట్టారన్నారని ప్రశ్నించారు. రాహుల్‌ కుటుంబానికి ఇచ్చే వెయ్యి కోట్లు ఎవరి సొత్తు అని, ఈ విషయంలో ఈడీ ఏం చేస్తోందని పేర్కొన్నారు. రైతులకు రైతుబంధు ఇచ్చే తెలివి లేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన పూర్తిగా గాలికి వదిలేసి దోపిడే లక్ష్యంగా పనిచేస్తోందని కేటీఆర్‌ మండిపడ్డారు. 

రెండేళ్ల కాలంలో ఢిల్లీకి చేరవేసేందుకు ముఖ్యమంత్రి వద్ద వెయ్యి కోట్లు సిద్ధంగా ఉన్నాయంటే ఆయన రాష్ట్ర ప్రజల సొత్తు ఇంకా ఎన్ని వేలకోట్లు మింగే ఆలోచనలో ఉన్నారని పేర్కొన్నారు. ములాఖత్‌ అయిన వారిలో మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు అనిల్‌ జాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గంగుల కమలా కర్, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, గొంగిడి సునీత, కోనేరు కోనప్ప, జీవన్‌రెడ్డి, జాన్సన్‌ నాయక్‌ ఉన్నారు. కాగా కేటీఆర్‌ వచి్చన విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement