మైక్‌ కట్‌ చేయొద్దు.. కెమెరా తిప్పొద్దు | Harish Rao on Godavari waters | Sakshi
Sakshi News home page

మైక్‌ కట్‌ చేయొద్దు.. కెమెరా తిప్పొద్దు

Feb 25 2026 2:57 AM | Updated on Feb 25 2026 2:57 AM

Harish Rao on Godavari waters

గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు రెడీ 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌కు మేం సిద్ధం: హరీశ్‌రావు  

సాక్షి, వరంగల్‌: ‘గోదావరి జలాలపై అసెంబ్లీలో మాట్లాడదామని సీఎం అంటున్నారు. ఈ సవాల్‌ను మేం స్వీకరిస్తున్నాం. మైక్‌ కట్‌ చేయకుండా, కెమెరా తిప్పకుండా చర్చకు పెట్టు. ఎన్ని రోజులైనా, ఏ ప్రాజెక్టు మీదనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఎవరు ఏం చేశారో అసెంబ్లీ వేదికగా తేల్చుకుందాం’అని శాసనసభలో బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఇటీవల ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో దేవాదుల ఎత్తిపోతల పంప్‌హౌస్‌ పరిశీలన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు స్పందించారు. 

వరంగల్‌లో 24 అంతస్తులతో నిర్మితమవుతున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌  తదితరులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ...దేవాదుల పనులు చేయడం చేతగాక మంత్రులకో డెడ్‌ లైన్, ముఖ్యమంత్రికో డెడ్‌లైన్‌ పెడుతూ దేవాదుల ప్రాజెక్టును కాంగ్రెస్‌ సర్కార్‌ ఆగమాగం చేస్తోందన్నారు. రోజుకో డేట్‌ మారుతోందే తప్ప ప్రాజెక్టులో అంగుళం పని కూడా ముందుకు సాగడం లేదన్నారు. 

రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? అని మండిపడ్డారు. మొన్న ఉత్తమ్‌ రివ్యూలో మాట్లాడుతుంటే, ఆయన్ను ఆపి కడియం శ్రీహరికి దేవాదులపై మంచి నాలెడ్జ్‌ ఉంది, తర్వాతి సమీక్షలో ఆయన్ను పిలవండి అని సీఎం అనడం ఇరిగేషన్‌ మంత్రిని అవమానించడమేనన్నారు.  

కక్షలు కట్టడం కాదు...ముందు ఆస్పత్రి కట్టు రేవంత్‌రెడ్డి  
కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే.. వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను కావాలనే నత్తనడకన సాగిస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. 2024 దసరాకే ఇది ప్రారంభం కావాల్సిందని, వెంటనే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తి చేసి ప్రారంభించకపోతే బీఆర్‌ఎస్‌ పక్షాన వరంగల్‌ గడ్డపైనే నిరాహారదీక్షకు దిగుతామని ప్రకటించారు. జర్నలిస్టులకు ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రిడిటేషన్లు ఇవ్వాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement