తెలంగాణలో పుట్టుక.. తెలంగాణలోనే అంతం! | DGP Shivadhar Reddy says Only 11 Maoists remain from Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పుట్టుక.. తెలంగాణలోనే అంతం!

Feb 25 2026 2:33 AM | Updated on Feb 25 2026 2:33 AM

DGP Shivadhar Reddy says Only 11 Maoists remain from Telangana

డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు బడే చొక్కారావు, మల్ల రాజిరెడ్డి, తిప్పిరి తిరుపతి, నూనె నర్సింహారెడ్డి. చిత్రంలో ఎస్‌ఐబీ చీఫ్, ఐజీ సుమతి, అడిషనల్‌ డీజీలు విజయ్‌కుమార్, మహేశ్‌భగవత్‌

మావోయిస్టుల్లో మిగిలిన తెలంగాణ వాళ్లు 11 మందే..: డీజీపీ శివధర్‌రెడ్డి

వాళ్లు కూడా టచ్‌లో ఉన్నారు.. చర్చలు జరుగుతున్నాయి.. 

వాళ్లు కూడా లొంగిపోతే తెలంగాణ వారంతా బయటికి వచ్చినట్టే.. 

సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు,ప్రభుత్వ పాలసీ నేపథ్యంలో అంతా లొంగిపోతున్నారు 

కీలక నేత గణపతి షెల్టర్‌ జోన్‌లో ఉన్నట్టు సమాచారం ఉందన్న డీజీపీ

ఆయన సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి,సెంట్రల్‌ కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి, తెలంగాణ స్టేట్‌ కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు,స్టేట్‌ కమిటీ సభ్యుడు గంగన్న  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మొదలైన మావోయిస్టు ఉద్యమం..తెలంగాణలోనే అంతానికి వచ్చిందని డీజీపీ బి.శివధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం తెలంగాణకు చెందిన 11 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని, అయితే దాదాపుగా వారంతా తమకు టచ్‌లోకి వచ్చినట్టు తెలిపారు. చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే వారు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ 11 మంది లొంగిపోతే మావోయిస్టుల్లో ఉన్న  తెలంగాణ వారంతా బయటికి వచ్చినట్టే అవుతుందన్నారు. 

మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి (అప్రకటిత) తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ అలియాస్‌ కుమ్మదాదా, కేంద్ర కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి అలియాస్‌ గంగన్నలు సాయుధ పోరాటాన్ని వదిలి మంగళవారం డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అదనపు డీజీలు మహేశ్‌ భగవత్, అనిల్‌కుమార్, విజయ్‌కుమార్, ఎస్‌ఐబీ చీఫ్, ఐజీ సుమతితో కలిసి శివధర్‌రెడ్డి మాట్లాడారు.  

కీలక నేతలు లొంగిపోతున్నారు.. 
‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు, తెలంగాణ సరెండర్‌ పాలసీ కారణంగా ఎంతో మంది మావోయిస్టు కీలక నేతలు లొంగిపోతున్నారు. గత రెండేళ్లలో ఇప్పటివరకు నలుగురు సెంట్రల్‌ కమిటీ సభ్యులు సహా మొత్తం 544 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మొత్తంగా చూస్తే ఇప్పటివరకు 5,865 మంది లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై కేసుల విషయంలో సానుభూతితో వ్యవహరిస్తాం. వారి హక్కులను కాపాడేందుకు ప్రయత్నిస్తాం. అవసరమైతే వారి ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డువేస్తాం. మాకున్న సమాచారం ప్రకారం..మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్న ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి అడవుల బయట షెల్టర్‌లో ఉన్నారు. 

ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీలో గణపతి, పుసునూరి నరహరి, బిష్రా అలియాస్‌ సాగర్‌ మాత్రమే మిగిలి ఉన్నారు..’ అని డీజీపీ తెలిపారు. మావోయిస్టుల లొంగుబాటులో కీలకంగా వ్యవహరించిన ఎస్‌ఐబీ చీఫ్‌ సుమతి, ఆమె బృందాన్ని, ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ విజయ్‌కుమార్‌ను అభినందిస్తున్నామన్నారు. కాగా లొంగిపోయిన మావోయిస్టులు తిప్పిరి తిరుపతి, మల్ల రాజిరెడ్డిలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డిలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున చెక్కులను రాష్ట్ర ప్రభుత్వ పునరావాస పథకం కింద డీజీపీ అందజేశారు. 

తెలంగాణ నుంచి మిగిలిన 11 మంది వీళ్లే.. 
కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి, ఈస్ట్‌ డివిజనల్‌ బ్యూరో సభ్యుడు, మావోయిస్టు టెక్నికల్‌ విభాగం ఇన్‌చార్జి పుసునూరి నరహరి అలియాస్‌ సంతోష్, ఒడిశా స్టేట్‌ కమిటీ సభ్యుడు ముప్పిడి సంబయ్య అలియాస్‌ సుదర్శన్, దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ, కమ్యూనికేషన్‌ విభాగం ఇన్‌చార్జి వార్త శేఖర్‌ అలియాస్‌ మంగ్తు, గణపతి భార్య..మాడ్‌ డివిజన్‌ ఇన్‌చార్జి జోడే రత్నాభాయ్‌ అలియాస్‌ సుజాత, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీలో ఎడ్యుకేషన్‌ కమిటీ ఇన్‌చార్జి లక్కా సుశీల అలియాస్‌ రేల, దేవ్‌జీతో పాటు కంప్యూటర్‌ ఆపరేటర్‌ అనిల్‌కుమార్‌ అలియాస్‌ భగత్‌సింగ్, మాడ్‌ డిజినల్‌ కమిటీ డీసీఎం రంగబోయిన భాగ్య అలియాస్‌ రూపీ, చర్లలో ఏసీఎం మడివి అడిమె అలియాస్‌ సంగీత, దేవ్‌జీ టీంలో పనిచేసే కాశపోగు భవానీ అలియాస్‌ సుగుణ, ఇల్లెందు నర్సంపేట ఏరియా కమాండర్‌ కుంజం ఇడామల్‌.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement