breaking news
Shivadhar Reddy
-
డిపార్ట్మెంట్లో లంచం తీసుకుంటే చర్యలు తప్పవు.: డీజీపీ
హైదరాబాద్: ఫెయిర్ అండ్ ఫ్రెండ్లీ ప్రొఫెషనల్ పోలీసింగ్ తన ఫిలాసఫీ అనే మరొకసారి స్పష్లం చేశారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ సిబ్బందికి లేఖరాశారాయన. ‘ ప్రజల భద్రత మన ప్రధాన బాధ్యత. పోలీస్ సిబ్బంది వెల్ఫేర్ నా వ్యక్తిగత ప్రయారిటీ. పోలీస్ స్టేషన్లలో సివిల్ వివాదాలకు తావు లేదు. సివిల్ వివాదాల కోసం సివిల్ కోర్టులున్నాయి. పోలీస్ స్టేషన్ అడ్డాగా సివిల్ పంచాయితీ చేస్తే చర్యలు తీసుకుంటాం. యూనిఫాం, కరప్షన్ ఒకే దగ్గర ఉండవు. ఒక్కడూ లంచం తీసుకుంటే డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. డిపార్ట్మెంట్లో లంచం తీసుకుంటే కఠినంగా ఉంటాము. బేసిక్ పోలీసింగ్‌తో పాటు టెక్నాలజీను వాడాలి. పేదవారికి కష్టంలో, ఆపదలో పోలీస్ ఉన్నాడని గుర్తు చేయండి. ఆపదలో ఆదుకున్న వాళ్ళని పేదవారు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటారు’ అని డీజీపీ లేఖలో పేర్కొన్నారు. -
ఠాణాలను సివిల్ పంచాయితీ కార్యాలయాలుగా మార్చొద్దు
సాక్షి, హైదరాబాద్: పోలీస్స్టేషన్లు, పోలీస్ కార్యాలయాలను సివిల్ వివాదాలు తీర్చే పంచాయితీ కార్యాలయాలుగా మార్చొద్దని డీజీపీ బి.శివధర్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ‘సివిల్ వివాదాలను పోలీస్స్టేషన్లు లేదా పోలీస్ కార్యాలయాల్లో పరిష్కారం చేయరాదు. ఈ విషయాలు సివిల్ కోర్టుల పరిధిలోకి వస్తాయనే విషయం తెలిసిందే. పోలీస్స్టేషన్లు లేదా పోలీస్ కార్యాలయాల్లో సివిల్ పంచాయితీలు నిర్వహించడంలో పాల్గొనే అధికారులపై కఠిన చర్యలు తప్పవు’అని డీజీపీ పేర్కొన్నారు. కొందరు పోలీస్ అధికారులు, సిబ్బంది తమ అవినీతితో పోలీస్‌శాఖకు మచ్చ తేవొద్దని హెచ్చరించారు.తాజాగా మొత్తం 9 అంశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐపీఎస్ అధికారులు, అన్ని పోలీస్ యూనిట్ల ఆఫీసర్లు, డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, నాన్‌కేడర్ ఎస్పీలు, ఇతర స్టాఫ్ అధికారులకు డీజీపీ లేఖ రాసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అందులో పోలీసింగ్ విధానాలు ఎలా ఉండాలన్న దానితోపాటు, అవినీతికి తావు లేదంటూ డీజీపీ అత్యంత స్పష్టంగా పేర్కొన్న అంశాలపై పోలీస్‌శాఖలో ఇప్పుడు అంతర్గతంగా చర్చ జరుగుతోంది. డీజీపీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శివధర్‌రెడ్డి ఈ నెల 9న అన్ని యూనిట్ల పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమైన తన పంథాను స్పష్టం చేశారు. మీ అవినీతితో పోలీస్‌శాఖకు మచ్చ తేవొద్దు ‘అవినీతి,అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టేది పోలీస్ సిబ్బంది. కానీ, అవినీతికి పాల్పడే కొందరు పోలీస్‌శాఖకు అప్రతిష్ట తీసుకొస్తున్నారు. అవినీతికి పాల్పడి పోలీస్‌శాఖకు మచ్చ తీసుకురావొద్దు. అవినీతికి పాల్పడే సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. పోలీస్ యూనిఫాం అంటే గౌరవం, బాధ్యత, ప్రజలకు లేదా దేశ సేవకు ప్రతీక. అవినీతి అనేది నమ్మక ద్రోహానికి సంకేతంగా చెప్పొచ్చు. యూనిఫాం, అవినీతి రెండు విరుద్ధమైనవి. అంటే యూనిఫాం ధరించిన వ్యక్తి అవినీతికి పాల్పడితే, యూనిఫాం అసలు అర్థాన్ని చెరిపివేస్తుంది.ప్రజలు పోలీస్‌శాఖపై ఉంచిన విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మన ప్రవర్తన..యూనిఫామ్‌కు గౌరవం, ప్రభుత్వానికి ప్రతిష్ట, సమాజంలో శాంతిని కల్పించే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’అని డీజీపీ తన లేఖలో పేర్కొన్నారు. పేదవారి, బలహీనవర్గాల సమస్యలు విని న్యాయం చేయాలి..తద్వారా పోలీసుశాఖ పట్ల విశ్వాసం, అధికారులపై అభిమానం ఎప్పటికీ ఉంటుందని పేర్కొన్నారు. ఆపదలో ఆదుకునే వారిని పేద ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు అని తన అభిప్రాయంగా డీజీపీ ఈ లేఖలో పేర్కొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆలోచింపజేసేలా తన భావాలను వ్యక్తీకరిస్తూ డీజీపీ రాసిన లేఖ గురించి పోలీస్ అధికారులు, సిబ్బందిలోనూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. -
TG: డీజీపీ ఎదుట లొంగిపోయిన ముగ్గురు సీనియర్ మావోయిస్టు లీడర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మావోయిస్టుల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్లు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.లొంగిపోయిన వారిలో 36 సంవత్సరాలుగా అండర్‌గ్రౌండ్‌లో ఉన్న సీనియర్ మావోయిస్టు నాయకుడు కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్; 35 సంవత్సరాలుగా అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మొగిలిచెర్ల వెంకటరాజు అలియాస్ రాజు; 21 సంవత్సరాలు అండర్‌గ్రౌండ్‌లో ఉన్న తోడెం గంగా అలియాస్ సోనీ ఉన్నారు.సిద్దిపేట జిల్లాకు చెందిన వెంకటయ్య, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కింద దక్షిణ బస్తర్ డివిజన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా , కార్యదర్శిగా పనిచేశారు. అతని భార్య కోడి మంజుల అలియాస్ నిర్మల ఏడాది క్రితం వరంగల్‌లో లొంగిపోయారు.వారి లొంగిపోవడం మావోయిస్టు నెట్‌వర్క్‌ను బలహీనపరచడంతో పాటు ఇతర మావోయిస్టులు జీవన స్రవంతిలోకి తిరిగి రావడానికి దోహదపడటంలో మరో అడుగు అని పోలీసు అధికారులు తెలిపారు. -
ఫెయిర్.. ఫర్మ్.. ఫ్రెండ్లీ పోలీసింగ్
సాక్షి, హైదరాబాద్: ఫెయిర్.. ఫర్మ్..ఫ్రెండ్లీ (ఎఫ్–3) అనేవి తెలంగాణ పోలీస్ మూల సూత్రాలని డీజీపీ బి.శివధర్‌రెడ్డి స్పష్టం చేశారు. నిష్పాక్షికమైన, దృఢమైన, స్నేహపూర్వక, ప్రొఫెషనల్ పోలీసింగ్ ప్రజలకు అందించేందుకు పోలీస్‌శాఖలోని ప్రతి అధికారి పనిచేయాలని సూచించారు. డీజీపీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత శివధర్‌రెడ్డి తొలిసారి రాష్ట్రంలోని పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గురువారం డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీలు, పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, డీసీపీలతో జరిగిన సమావేశంలో డీజీపీ పలు అంశాలపై స్పష్టతనిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఫెయిర్ (న్యాయమైన) పోలీసింగ్ అంటే ప్రతి పౌరుడిని చట్టం ముందు సమానంగా చూస్తూ నిష్పక్షపాతంగా న్యాయం అందించడం. ఫర్మ్ (దృఢమైన) పోలీసింగ్.. అంటే భయం లేదా పక్షపాతం లేకుండా చట్టాన్ని అమలు చేస్తూ శాంతి భద్రతలను నెలకొల్పడం. ఫ్రెండ్లీ (స్నేహపూర్వక) పోలీసింగ్ అంటే పౌరులలో విశ్వాసం, సానుభూతి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం. అలాగే ప్రొఫెషనల్ (వృత్తిపరమైన) పోలీసింగ్ అంటే.. సామర్థ్యం, నీతి, క్రమశిక్షణ, జవాబుదారీతనాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నాలుగు సూత్రాలు ఆధునిక పోలీసింగ్ స్ఫూర్తిని నిర్వచిస్తాయి. మానవీయ కోణంలో పనిచేస్తూ.. నీతి, సామర్థ్యంలో రాజీపడకుండా పనిచేయాలి’ అని దిశానిర్దేశం చేశారు. బేసిక్ పోలీసింగ్ మరవొద్దు బేసిక్ పోలీసింగ్ తెలంగాణ పోలీసుల ఆపరేషనల్ వెన్నెముకగా ఉండాలని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. బేసిక్ పోలీసింగ్‌లో కీలకమైన బీట్ పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్, ఇంటెలిజెన్స్ సేకరణ, అత్యవసర స్పందన, నేర నివారణ, గుర్తింపు, ప్రజా శాంతిభద్రతల నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్ తప్పక ఉండాలని చెప్పారు. కేవలం నేరగణాంకాల్లో తగ్గుదలే బేసిక్ పోలీసింగ్ విజయానికి కొలమానం కాదని, పోలీసులపై ప్రజల విశ్వాసం, నమ్మకం, సంతృప్తి ద్వారా కొలవాలని ఆయన నొక్కిచెప్పారు. బేసిక్ పోలీసింగ్‌ను ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానం చేయడం ద్వారా పోలీసుల సామర్థ్యాన్ని పెంచవచ్చని అభిప్రాయ పడ్డారు.కొత్తగా ఎంపికైన డీఎస్పీల శిక్షణ ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతుందని అదనపు డీజీ (ట్రైనింగ్) వి.వి. శ్రీనివాసరావు తెలిపారు. సమావేశంలో అదనపు డీజీలు మహేశ్ భగవత్, స్వాతి లక్రా, చారు సిన్హా, అనిల్ కుమార్, సంజయ్ కుమార్ జైన్, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
KSR Comments: ఏపీ పోలీసులకు తెలంగాణ డీజీపీ చెంపపెట్టు
-
తెలంగాణ డీజీపీగా శివధర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ (ఫొటోలు)
-
రెడ్ బుక్, పింక్ బుక్ మాకు ఉండదు! మాకు తెలిసిందల్లా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర 6వ డీజీపీగా శివధర్‌రెడ్డి(Telangana New DGP Shivadhar Reddy) బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధికారికంగా బాధ్యతలు చేపట్టారాయన. ఈ సందర్భంగా తనను నియమించిన సీఎం రేంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియాతో మాట్లాడారు.. ‘‘స్థానిక సంస్థల ఎన్నికలను(Local Body Elections) సజావుగా నిర్వహించడమే మా లక్ష్యం. మాకు బలమైన టీమ్ ఉంది. ఈ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్నాం. ఎన్నికల భద్రత కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజల రక్షణే ధ్యేయంగా పని చేస్తాం. టెక్నాలజీని మరింత సమర్థవంతగా వినియోగించుకుంటాం. మావోయిస్ట్ విధానాలు సక్సెస్ కాలేదు. ఆ విధానాలు ఆచరణలో విఫలం అయ్యాయి. పోరాట మార్గం వీడతామని గతంలో వాళ్లు లేఖలు రాశారు. అడవుల నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవండి. మావోయిస్టులను స్వచ్చందంగా లొంగిపోవాలని సూచిస్తున్నా... శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంటుంది. అలాగేని ఫేక్ న్యూస్, తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం కఠిన చర్యలే ఉంటాయి. సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా పోస్టులు పెడితే ఊరుకోం. మాకు రెడ్ బుక్, పింక్ బుక్ ఉండదు.. మాదీ ఖాకీ బుక్(Khaki Book) అని స్పష్టం చేశారాయన. ఈ సందర్భంగా పోలీస్ శాఖకు సహకరించాలని తెలంగాణ పౌరులను కోరారాయన. తెలంగాణ పోలీస్ శాఖలో 17 వేల ఖాళీలు ఉన్నాయన్న నూతన డీజీపీ.. వాటి నియామకంపై ఫోకస్ పెడతామని తెలిపారు. ఇదీ చదవండి: కాళేశ్వరం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం -
తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : నూతన డీజీపీగా బత్తుల శివధర్‌రెడ్డి నియమితుల య్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్‌రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. ప్రస్తుత డీజీపీ డా.జితేందర్ ఈ నెల 30న పదవీ విరమణ పొందనున్నారు. ఆయన స్థానంలో డీజీపీ (హెచ్ఓపీఎఫ్– హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్) ఫుల్ అడిషనల్ చార్జ్‌గా శివధర్‌రెడ్డి ఉంటారని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఆ పోస్టులో కొనసాగుతారన్నారు. సమర్థుడైన అధికారిగా... శివధర్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ (పెద్దతుండ్ల) గ్రామం. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్‌లో చదువుకున్న శివధర్ రెడ్డి.. ఉస్మానియా వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి 1994లో ఐపీఎస్‌లోకి ప్రవేశించారు. ఏఎస్పీగా విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పని చేశారు.గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్‌గా, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్లగొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు. ఎస్ఐబీలో డీఐజీగా కూడా మావోయిస్టుల అణిచివేతలో కీలక పాత్ర పోషించారు. 2014లో తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. 2016లో గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ ఆపరేషన్‌లోనూ కీలకంగా వ్యవహరించారు. ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావోలో కూడా శివధర్ రెడ్డి పనిచేశారు.2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్ల ఘటనలో 14 మంది చనిపోయిన ఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా అప్పటి ప్రభుత్వం ఆయనను నియమించింది. అత్యంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ఆ సమయంలో తీవ్రంగా శ్రమించి, శాంతి భద్రతలను సమర్థంగా కాపాడిన అధికారిగా గుర్తింపు పొందారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 2024లో డీజీపీగా ప్రమోషన్ పొందిన తర్వాత కూడా అదే పోస్టులో కొనసాగుతున్నారు. ఉత్తమ సేవలకు గాను శివధర్‌రెడ్డి గ్యాలంట్రీ మెడల్, పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, ఐక్యరాజ్యసమితి మెడల్ సహా అనేక అవార్డులు అందుకున్నారు. -
పోలీస్ కొత్త బాస్ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తదుపరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఎవరన్నదానిపై పోలీస్ శాఖలో చర్చ జోరందుకుంది. ప్రస్తుత డీజీపీ డా.జితేందర్ ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత డీజీపీ (హెచ్ఓపీఎఫ్–హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్) పోస్టుకు ప్రధాన పోటీ సీనియర్ ఐపీఎస్‌లు సీవీ ఆనంద్, బి శివధర్‌రెడ్డి మధ్యే నెలకొంది. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం. ఇద్దరూ తెలంగాణ రాష్ట్రానికి చెందినవారే కావడంతో ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న శివధర్రెడ్డివైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. శివధర్‌రెడ్డి 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాగా.. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్ 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. డీజీపీగా శివధర్‌రెడ్డిని నియమిస్తే.. సీవీ ఆనంద్‌ను విజిలెన్స్ డీజీగా పంపడంతోపాటు, ఏసీబీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనూ సీవీ ఆనంద్ ఏసీబీ, విజిలెన్స్ డీజీగా పనిచేశారు. ఇలా చేయడం వల్ల సీనియారిటీ పరమైన పొరపచ్చాలు తలెత్తకుండా డీజీపీగా శివధర్‌రెడ్డి, పోలీస్ శాఖతో నేరుగా సంబంధం లేకుండా ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఏసీబీ, విజిలెన్స్‌కు డీజీగా ఆనంద్ కొనసాగే వెసులుబాటు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. వీరితోపాటు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ (డీజీ) ర్యాంకులో 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ రవిగుప్తా, డా.సౌమ్యామిశ్రా (1994 బ్యాచ్ ఐపీఎస్), శిఖాగోయల్ (1994 బ్యాచ్ ఐపీఎస్), ఆప్టే వినాయక్ ప్రభాకర్ (1994 బ్యాచ్ ఐపీఎస్) కొనసాగుతున్నారు. వీరిలో రవిగుప్తా ఈ ఏడాది డిసెంబర్ 19న పదవీ విరమణ పొందనున్నారు. ఆప్టే వినాయక్ ప్రభాకర్ కేంద్ర సర్వీస్‌లో ఉన్నారు. మిగిలిన వారిలో శిఖాగోయల్ శిఖాగోయల్ సైతం డీజీపీ రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ సీపీకి తీవ్ర పోటీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పోస్టుకు తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం సీపీ సీవీ ఆనంద్ బదిలీ అయితే, ఆ స్థానంలోకి ఎవరు వస్తారన్నది ఆసక్తిరంగా మారింది. ఈ పోస్టుకు ప్రధానంగా 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న వీసీ సజ్జనార్, 1995 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం శాంతిభద్రతల అడిషనల్ డీజీగా ఉన్న మహేశ్ భగవత్ ప్రధానంగా పోటీ పడుతున్నట్లు సమాచారం. 1996 బ్యాచ్ ఐపీఎస్, సీఐడీ చీఫ్ చారుసిన్హా, 1997 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు డీఎస్ చౌహాన్, వై నాగిరెడ్డి అడిషనల్ డీజీ హోదాలో ఉన్నారు. వీరితోపాటు వీవీ శ్రీనివాస్, స్వాతిలక్రా, సంజయ్‌కుమార్ జైన్, స్టీఫెన్రవీంద్ర సైతం హైదరాబాద్ సీపీ పోస్టుకు అర్హులుగా ఉన్నారు. అయితే, వీరిలో సజ్జనార్ పేరు హైదరాబాద్ సీపీతోపాటు ఇంటెలిజిన్స్ డీజీ పోస్టుకు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంటెలిజెన్స్ డీజీగా 1996 బ్యాచ్ ఐపీఎస్ అనిల్‌కుమార్ పేరు సైతం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్ తర్వాత అత్యంత కీలక కమిషనరేట్ అయిన సైబరాబాద్ సీపీ సైతం బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఈ పోస్టుకు ఎస్ఐబీ చీఫ్ సుమతితోపాటు ఏసీబీలో పనిచేస్తున్న తరుణ్‌జోషి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా పలు కీలక విభాగాలతోపాటు జిల్లా ఎస్పీల వరకు త్వరలో పెద్ద సంఖ్యలో అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వవర్గాల ద్వారా తెలిసింది. దసరా పండుగలోపే ఈ బదిలీలు జరిగే అవకాశం ఉందని సమాచారం. -
సీఎం ముఖ్యకార్యదర్శిగా వి.శేషాద్రి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వి. శేషాద్రి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా బి. శివధర్‌రెడ్డి నియమితుల య్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సొంత జట్టు కూర్పుపై దృష్టి సారించిన రేవంత్‌రెడ్డి తన తొలి ఎంపికగా ఇద్దరు సమర్థులైన అధికారులనే నియమించుకున్నారు. ఇద్దరు అధికారులూ ఆయా పదవుల్లో విశేష అనుభవం కలిగి ఉన్నారు. 1999 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వి.శేషాద్రి సమర్థుడైన అధికారిగా పేరుతెచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆయనకు రెవెన్యూ వ్యవహారాలు, భూ చట్టాలపై పట్టు ఉంది. 2013 ఆగస్టు 22 నుంచి 2020 ఆగస్టు 22 వరకు ప్రధానమంత్రి కార్యాలయంలోని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో డైరెక్టర్, జాయింట్ సెక్రటరీల హోదాల్లో ఆయన డిప్యుటేషన్‌పై పనిచేశారు. 2020 సెప్టెంబర్ నుంచి 2022 మే వరకు నాటి సీఎం కేసీఆర్‌కు ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించారు. ఈ సమయంలో భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన ధరణి ప్రాజెక్టు అమలులో కీలకంగా వ్యవహరించారు. 2022 మే నుంచి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 2009–12 మధ్య చిత్తూరు, రంగారెడ్డి, విశాఖపట్నం కలెక్టర్‌గా పనిచేశారు. మరోవైపు ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా నియమితులైన శివధర్‌రెడ్డి ప్రస్తుతం రైల్వే, రోడ్డు భద్రతా విభాగం అదనపు డీజీగా వ్యవహరిస్తున్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఇంటెలిజెన్స్ విభాగంలో అత్యంత కీలకంగా పనిచేశారు. అంతకుముందు ఆయన ఎస్ఐబీలో డీఐజీగా, నల్లగొండ, నెల్లూరు, గుంటూరులో ఎస్పీగా పలు కీలక పోస్టింగ్‌లలో పనిచేశారు. సమర్థుడైన అధికారిగా పోలీస్‌శాఖలో శివధర్‌రెడ్డికి పేరు ఉంది. ఆయనకు రేవంత్‌రెడ్డి సర్కార్ నిఘా విభాగాధిపతిగా కీలక బాధ్యతలు అప్పగించింది. -
అడిషనల్ డీజీపీ శివధర్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్ మెడల్
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురి పోలీసు అధికారులకు రాష్ట్రపతి పతకాలు ప్రకటించారు. విశిష్ట సేవా పతకాల విభాగంలో తెలంగాణ నుంచి అడిషనల్ డీజీపీ (పర్సనల్) బి.శివధర్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్ మెడల్ లభించింది. శనివారం ఈ మేరకు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. 4 విభాగాల్లో మెడల్స్ దక్కగా.. రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకం, పోలీస్ శౌర్య పతకం విభాగాల్లో మెడల్స్ దక్కలేదు. కాగా, ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి, విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) కొట్ర సుధాకర్లకు రాష్ట్రపతి పతకం దక్కింది. సేవా పతకాలు.. తెలంగాణ నుంచి 12 మంది అధికారులకు ప్రతిభావంతమైన సేవా పతకాలు దక్కాయి. అకున్ సబర్వాల్ (ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్), టీఎస్ఎస్పీ రెండో బెటాలియన్ (ఐఆర్ యాప్లగూడ, ఆదిలాబాద్) కమాండెంట్ ఆర్.వేణుగోపాల్, హైదరా బాద్ స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఇక్బాల్ సిద్దిఖీ, బీచుపల్లి పదో బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ పి.సత్యనారాయణ, నిజామా బాద్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ డి.ప్రతాప్, ఖమ్మం టౌన్ ఏసీపీ ఘంటా వెంకటరావు, నల్లగొండ డీఎస్పీ సామ జయరాం, 8వ బెటాలియన్ (కొండాపూర్) ఆర్ఐ రవీంద్రనాథ్, హన్మకొండ ఏఎస్సై సుధాకర్, హైదరాబాద్ పోలీస్ అకాడమీ ఏఎస్సై ఎం.నాగలక్ష్మి, గండిపేట్ ఏఎస్సై ఆర్.అంతిరెడ్డి, పుప్పాలగూడ పోస్ట్ సీనియర్ కమాండో డి.రమేశ్‌బాబులకు సేవ పతకాలు లభించాయి. ఎన్పీఏ నుంచి..: నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్ ఎస్ఐ (బ్యాండ్) బి.గోపాల్‌కు విశిష్ట సేవా పతకాల విభాగంలో మెడల్ లభించింది ఎన్ఐఏ నుంచి: ప్రతిభావంతమైన సేవా పతకాల (పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) విభాగంలో హైదరాబాద్ ఎన్ఐఏ అసిస్టెంట్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి, హైదరాబాద్ ఎన్ఐఏలో డీఎస్పీగా పనిచేస్తున్న దొంపాక శ్రీనివాసరావుకు పతకం లభించింది. భారతీయ రైల్వే నుంచి: హైదరాబాద్‌లో రైల్వేలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న తూంకుంట చంద్రశేఖర్‌రెడ్డి, కర్నాటి చక్రవర్తి, సబ్ఇన్స్పెక్టర్ దోమాల బాలసుబ్రమణ్యానికి ప్రతిభావంతమైన సేవా పతకం లభించింది. ఫైర్ సర్వీస్ మెడల్స్.. దేశవ్యాప్తంగా 104 మంది అగ్నిమాపక సర్వీసు అధికారులకు పతకాలు ప్రకటించగా తెలంగాణ నుంచి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజ్ కుమార్ జనగామ, ఫైర్‌మన్ భాస్కర్‌రావు కమతాలకు ఫైర్ సర్వీస్ మెడల్స్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకం లభించింది. -
బాబుపై కేసు నమోదుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ !
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న ఓటుకు నోటు వ్యవహారంలో దూకుడు పెంచాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులోభాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అవినీతి నిరోధక శాఖ డీజీ ఏకే ఖాన్, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు నమోదుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో చంద్రబాబుకు ఏ క్షణమైనా నోటీసులు జారీ చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసుకుంటోది. అదీకాక చంద్రబాబు ఢిల్లీ పయనంపై కూడా వారు ఈ సందర్భంగా వారు చర్చించినట్లు తెలుస్తోంది. -
బాబుపై కేసునమోదుకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్!
-
విశాఖలో విజయోత్సవాలు, సంబరాలపై ఆంక్షలు!
విశాఖపట్నం: విశాఖ కమిషనరేట్ పరిధిలో రాజకీయ పార్టీల విజయోత్సవ సంబరాలపై నిషేధం విధించారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నుంచి 16 వరకు విజయోత్సవ సంబరాలు నిషేధమని విశాఖ సీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా కమిషనరేట్ పరిధిలో విజయోత్సవాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శివధర్ రెడ్డి హెచ్చరించారు. విశాఖలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉంటుందన్నారు. ఈనెల 16 తర్వాతే ముందస్తు అనుమతితో సంబరాలు జరుపుకోవాలని సీపీ శివధర్‌రెడ్డి సూచించారు.