
సాక్షి, హైదరాబాద్/నిజామాబాద్ : నిజామాబాద్ కానిస్టేబుల్ హత్యోదంతాన్ని తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలో నిందితుడు రియాజ్‌ను పట్టుకుని తీరాలని జిల్లా పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో 8 బృందాలు రంగంలోకి దిగాయి.
చిన్నచిన్న దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడే రియాజ్ గురించి శుక్రవారం నిజామాబాద్ సీసీఎస్‌కు సమాచారం అందింది. దీంతో సీసీఎస్ ఎస్‌ఐ భీమ్‌రావు, కానిస్టేబుల్ ప్రమోద్(48) కలిసి అతన్ని పట్టుకునేందుకు బైక్‌పై బయల్దేరారు. ఖిల్లా ప్రాంతంలో రాత్రి 8గం. ప్రాంతంలో రియాజ్‌ను పట్టుకుని.. ఠాణాకు తీసుకెళ్లేందుకు తమ బైక్‌పై ఎక్కించుకున్నారు.
అయితే అప్పటికే తన దగ్గర దాచుకున్న కత్తి తీసి.. కానిస్టేబుల్ ప్రమోద్‌ను పొడిచి పరారయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్‌ను దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంకిత భావంతో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఘటనను తీవ్రంగా పరిగణించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితుల్ని పర్యవేక్షించాలని, మృతుని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించాలని, ఆ కుటుంబానికి అవసరమైన సాయం అందించాలని మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు.
దీంతో రియాజ్ పేరిట మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు వెలిశాయి. అతని ఆచూకీ చెబితే రూ.50 వేలు ఇస్తామని పోలీస్ శాఖ ప్రకటించింది. అదే సమయంలో ఎనిమిది బృందాలు అతని ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.