
ఇటీవల కాలంలో యూట్యూబ్ చానళ్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. దీంతో పాటు ఇతర సోషల్ మీడియాలోనూ పోటీ పెరిగిపోయింది. ఎవరికి వారు లైకులు, షేర్లు, వ్యూస్ కోసం వివిధ మార్గాలు ఎంచుకుంటున్నారు. కొందరైతే విశృంఖలానికి తెర లేపుతున్నారు. ఈ క్రమంలో.. ఇంటర్వ్యూల పేరుతో మైనర్లను ఎంచుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు, చేష్టలు చేయిస్తున్నారు.
తాజాగా ఓ మైనర్ జంట ఇంటర్వ్యూ సో.మీ. ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా వైరల్ అయ్యింది. ఓ షార్ట్‌ఫిల్మ్/ఆల్బమ్ చేసిన జంట అందులో ముద్దు సీన్ చేయడంపై యాంకర్ ప్రశ్నిస్తాడు. అయితే ఆ బాలిక దాంట్లో ఏముంది? ఇప్పుడు కూడా పెట్టేస్తా.. అంటూ ఇంటర్వ్యూలో బరితెగించి ఓవరాక్షన్‌కు దిగింది. ఈ పరిణామంతో యాంకర్ షాక్ కావడం.. మీమ్స్, ఫన్నీ ఎడిట్ వీడియోల రూపంలోనూ వైరల్ అయ్యింది. అయితే ఈ తరహా ఇంటర్వ్యూలు, వీడియోల వ్యవహారంపై నగర పోలీస్ బాస్ వీసీ సజ్జనార్ కన్నెర్ర చేశారు.
మైనర్ల అభ్యంతరకరమైన వీడియోలు, ఇంటర్వ్యూలు, రీల్స్ యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్ట్రాగామ్ తదితర సోషల్‌మీడియాల్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వీడియోలు, ఇంటర్వ్యూలను అధ్యయనం చేస్తూ పోక్సోతో పాటు కిడ్నాప్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సజ్జనార్ హెచ్చరికల నేపథ్యంలో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లపై సిటీ పోలీసుల నజర్ పెరిగింది. మైనర్లతో అభ్యంతరకర వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇలాంటి వీడియోలను చేసేవాళ్లనే కాదు, అప్‌లోడ్ చేస్తున్నవాళ్లను, మీమ్స్ పేరిట పరోక్షంగా ప్రమోట్ చేస్తున్నవాళ్లను కూడా వదిలిపెట్టబోమని పోలీసులు అంటున్నారు.
అంతా అల్గారిథమ్ మహిమ!
ఇటీవల కాలంలో సోషల్‌మీడియా ఖాతాలు, ఈ–కామర్స్ వెబ్‌సైట్లు తదితరాలన్నీ ప్రత్యేక ఆల్గరిథెమ్ ఆధారంగా పని చేస్తున్నాయి. ఈ ఆల్గరిథెమ్ సదరు వ్యక్తి ఏ తరహా కంటెంట్‌ను వీక్షిస్తున్నారు? ఎలాంటి వస్తువులు ఖరీదు చేస్తున్నారు? సెర్చ్ చేస్తున్నారు? అనే అంశాలను అధ్యయనం చేస్తుంది. ఐపీ అడ్రస్, మెయిల్ ఐడీ ఆధారంగా జరిగే ఈ ప్రక్రియలో ఆ వ్యక్తికి అదే తరహా కంటెంట్, ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలు, యాప్స్ పదేపదే పంపిస్తుంది. ఈ కారణంగా ఇలాంటి వీడియోలు, రీల్స్‌ను పొరపాటున మైనర్లు ఒక్కసారి వీక్షిస్తే చాలు.. వారికి పదేపదే అదే తరహావి కనిపిస్తాయి.
వ్యూస్ కోసం విలువలు వదిలేస్తారా?
వ్యూస్, లైక్స్‌తో పాటు సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్తును ఫణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం? ఇది విలువలను వదిలేయడంతో సమానం. మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించొద్దు. అలా చేయడం బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు..చట్టరీత్యా నేరం. బాలబాలికల్ని ఇలాంటి కంటెంట్‌లో భాగం చేయడం చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషనే అవుతుంది. ఇప్పటికే ఉన్న కంటెంట్‌ను తొలగించకున్నా, భవిష్యత్తులో అప్‌లోడ్ చేసినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఇలాంటి వీడియోలు, రీల్స్ గమనిస్తే 1930కు ఫోన్ చేసి లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయండి. పిల్లల బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం కూడా తల్లిదండ్రుల బాధ్యతే.
వీసీ సజ్జనార్, నగర కొత్వాల్
పోక్సోతో పాటు కిడ్నాప్ కేసు కూడా!
ప్రేమ, పెళ్లి, భాగస్వామ్యం తదితర అంశాలపై మైనర్లలో సరైన అవగాహన పెరిగేలా, వారు పెడదారి పట్టకుండా వీడియోలు రూపొందిస్తే ఇబ్బంది ఉండదు. అయితే మైనర్ల ప్రేమ వ్యవహారాలు, ముద్దుమచ్చట్లను రీల్స్, వీడియోలు, ఇంటర్వ్యూలుగా చిత్రీకరించి మరింత మందిని పెడదోవ పట్టించడం నేరమే అవుతుంది. ఈ వీడియోలతో పాటు వాటిలో మైనర్లు, యాంకర్లు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో పోక్సో యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద యాంకర్లు, నిర్వాహకులపై కేసులు నమోదు చేయవచ్చు. ఈ ఇంటర్వ్యూల కోసం ఆ మైనర్లను వివిధ ప్రాంతాల నుంచి మరో ప్రాంతానికి తరలించడమూ నేరమే. దీనికి సంబంధించి కిడ్నాప్ కేసు నమోదు చేసే అవకాశమూ ఉంది. ఇవన్నీ పరిశీలించిన కొత్వాల్ సజ్జనర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై గురువారం కొత్వాల్ ‘ఎక్స్’ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఇవి చూసిన అనేక మంది తమ వీడియోలు, రీల్స్, ఇంటర్వ్యూలను డిలీట్ చేస్తుండటం గమనార్హం.
:::సాక్షి, సిటీబ్యూరో