ఆ ప్రాంతంలో కాన్పు కోసం గర్భిణీని అంగడికి తీసుకువెళతారు. తీసుకెళ్లాల్సింది ఆస్పత్రికి కదా అంగడికి ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఇది చదవాల్సిందే...
కాన్పు జరగడంలో ఆలస్యం అయితే చాలు అక్కడ ముందు అంగడికి తీసుకువెళతారు. గర్భిణీ తన కొంగు జాపి కూరగాయలు అడుక్కుంటుంది. ఇంటికి వచ్చిన తరువాత ఆ కూరగాయలను వండుకునే సంప్రదాయం చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. మంజీర నది పరివాహక ప్రాంతంలోని చాలా గ్రామాల్లో దశాబ్దాల కాలంగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
తొమ్మిది నెలలు నిండిన తరువాత కాన్పు ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూడడం సహజం. పూర్వ కాలంలో కాన్పు ఆలస్యం అవుతుందంటే చాలు దగ్గరలో జరిగే అంగడికి తీసుకువెళ్లేవారు. ఆమె వెంట తల్లీ, కుటుంబ సభ్యులు వెళ్లి గర్భిణి కొంగు పట్టుకుని ఐదు రకాల కూరగాయలు సేకరిస్తారు. కూరగాయలు అమ్మేవారు గర్భిణిని చూడగానే కూరగాయలు ఆమె కొంగులో వేసి దీవిస్తారు.
తరువాత గర్భిణికి ఇష్టమైన పదార్థాలను తినిపిస్తారు. అంగడికి తీసుకువెళ్లడం మూలంగా గర్భిణికి శారీరక వ్యాయామం కలుగుతుంది. ఇంట్లో కూర్చుని కాన్పు కోసం పడే ఆందోళన కూడా తగ్గుతుంది, కాన్పు సులభంగా జరుగుతుంది అనే నమ్మకంతో ఈ ఆచారం మొదలైంది అంటారు.
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, లింగంపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, మహ్మద్‌నగర్, పిట్లం, బాన్సువాడ, బిచ్కుంద, పెద్దకొడప్‌గల్, జుక్కల్ తదితర మండలాలతో పాటు పొరుగున ఉన్న మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో గర్భిణులను అంగడికి తీసుకువెళ్లే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.
– ఎస్.వేణుగోపాలచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
(చదవండి: ఆనంద్ మహీంద్రా మెచ్చిన గ్రామం..! ఐక్యతతో ఏదైనా సాధ్యం..!)


