తప్పు తెలిసీ మౌనం... నేరంగా మారిన ఇద్దరు మహిళలు | jubilee hills police station minor girl incident | Sakshi
Sakshi News home page

తప్పు తెలిసీ మౌనం... నేరంగా మారిన ఇద్దరు మహిళలు

Dec 3 2025 8:09 AM | Updated on Dec 3 2025 8:09 AM

jubilee hills police station minor girl incident

అప్పట్లో ఈ ఘాతుకానికి ఒడిగట్టిన కారు డ్రైవర్‌ 

విషయం తెలిసీ దాచిపెట్టిన ఇరువురు మహిళలు 

దర్యాప్తులో ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు 

ముగ్గురినీ నిందితులుగా చేరుస్తూ చార్జ్‌షిట్‌ దాఖలు

సాక్షి,హైదరాబాద్‌: నేరుగా తప్పు చేయడమే కాదు... తప్పు జరుగుతోందని, జరిగిందని తెలిసీ పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమూ నేరమే. ఈ కారణంగానే జూబ్లీహిల్స్‌ ఠాణాలో నమోదైన పోక్సో, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులో ఇరువురు మహిళలు నిందితులుగా మారారు. గత ఏడాది చోటు చేసుకున్న ఈ ఘటనపై దర్యాప్తు అధికారులు ఇటీవల కోర్టులో చార్జ్‌షిట్‌ దాఖలు చేశారు. ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్‌ఐఆర్‌) లైంగికదాడి చేసిన వ్యక్తి మాత్రమే నిందితుడిగా ఉండగా... అభియోగపత్రాల్లో మాత్రం ఆ విషయం తెలిసీ మిన్నకుండిపోయిన మహిళలూ నిందితులుగా మారారు.

ఐదు రోజులు నిర్భంధించి ఘాతుకం..
జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మహిళ వద్ద ఆర్‌. రాజిరెడ్డి అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేసేవాడు. అదే అపార్ట్‌మెంట్‌లో మరో మహిళ సెక్యూరిటీ గార్డుగా పని చేసేది. అదే ప్రాంతానికి చెందిన బాలికతో రాజిరెడ్డికి పరిచయం ఉండేది. అతను గత ఏడాది అక్టోబర్‌ 31న ఓ శుభకార్యానికి తీసుకువెళ్తానంటూ బాలికను కారులో ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో అతడి యజమాని సైతం వారితో ఉంది. వీరు సదరు బాలికను షాపింగ్‌కు తీసుకెళ్లి వ్రస్తాలు కొనిపెట్టారు. ఆపై అపార్ట్‌మెంట్‌కు తీసుకువచి్చన రాజిరెడ్డి రెండో అంతస్తులోని తన గదిలో నిర్భంధించి నవంబర్‌ 5 వరకు సదరు బాలికపై పలు మార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.  

విచారణలో చెప్పని ఆ ఇరువురూ..
ఇదిలా ఉండగా... బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి గత ఏడాది అక్టోబర్‌ 31న జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆ అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లి పలువురిని  విచారించగా ఎవరి నుంచి సరైన సమాచారం లభించలేదు. సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్న మహిళతో పాటు రాజిరెడ్డి యజమాని సైతం తనకు ఏమీ తెలియనట్లు వ్యవహరించారు. ఐదు రోజుల నిర్భంధం తర్వాత ఇంటికి వెళ్లిన బాలిక తన తల్లితో జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు.

అక్కడ అన్నీ చెప్పిన బాలిక..
భరోసా కేంద్రంలో ఉన్న కౌన్సిలర్లు, అధికారులు బాలికకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ ఐదు రోజుల్లో ఏం జరిగిందో చెప్పాల్సిందిగా కోరారు. దీంతో రాజిరెడ్డి తనను నిర్భంధించడంతో పాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. తాను నిర్భంధంలో ఉండగా రాజిరెడ్డి యజమాని ఆహారం అందించిందని, ఆ అపార్ట్‌మెంట్‌కు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న మహిళకూ తన విషయం తెలుసని వెల్లడించింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి నేరం జరిగినట్లు నిర్థారించారు. బాలిక మిస్సింగ్‌ కేసు విచారణలో భాగంగా వీరు ఇరువురినీ ప్రశి్నంచినా నోరు విప్పకపోకపోవడాన్నీ సీరియస్‌గా తీసుకున్నారు. 

ఆ ఇద్దరినీ నిందితులుగా చేరుస్తూ..
దీంతో బాలిక అదృశ్యం కావడంపై నమోదైన మిస్సింగ్‌ కేసులో పోక్సో యాక్ట్‌తో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని సెక్షన్లనూ చేర్చారు. ఈ కేసులో రాజిరెడ్డి ఒక్కడే కాకుండా ఇద్దరు మహిళల్నీ నిందితులుగా చేర్చారు. బాలికపై దారుణం జరుగుతున్నా అడ్డుకోకపోవడం, జరిగిందని తెలిసీ బయటకు చెప్పకపోవడం నేరాలేనని దర్యాప్తు అధికారులు తేల్చారు. భారతీయ న్యాయ సంహితలోని (బీఎన్‌ఎస్‌) సెక్షన్‌ 211 (ఓ నేరానికి సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచి పెట్టడం), భారతీయ నాగరిక్‌ సురక్ష సంహితలోని (బీఎన్‌ఎస్‌ఎస్‌) సెక్షన్‌ 33 (నేరం జరిగినట్లు తెలిసినా వెంటనే పోలీసు లేదా మేజిస్ట్రేట్‌కు చెప్పకపోవడం) కింద అభియోగాలు మోపారు.

దర్యాప్తునకు సహకరించకున్నా దండనే
ఏదైనా నేరం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులు లేదా మేజి్రస్టేట్‌కు సమాచారం ఇవ్వడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. నేరాల నిరోధంతో పాటు చట్టాల అమలుకు పాటుపడాలి. ఏదైనా నేరం జరిగిందని తెలిసీ మిన్నకుండిపోవడం నేరమే అవుతుంది. తమ కళ్ల ముందు నేరం జరిగితే నిందితుడిని అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించే అధికారమూ పౌరులకు ఉంటుంది. వివిధ నేరాలకు సంబంధించి కేసులు నమోదైనప్పుడు పోలీసులు కోరితే దర్యాప్తునకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. బీఎన్‌ఎస్‌ఎస్‌లోని 31, 33, 40 సెక్షన్లు ఇవే అంశాలను స్పష్టం చేస్తున్నాయి. అలా చేయకపోవడం కూడా నేరమే అవుతుంది. బీఎన్‌ఎస్‌లోని 211, 239లతో పాటు పోక్సో యాక్ట్‌లోని 19 సెక్షన్‌ ప్రకారం అభియోగాలు ఎదుర్కోవాల్సిందే.
– పి.వెంకటగిరి, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement