యూనివర్సిటీ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి, పక్కన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు బలరాంనాయక్, రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు రాందాస్‌నాయక్, కూనంనేని, పాయం వెంకటేశ్వర్లు, సభకు హాజరైన జనం
మంత్రులతో కలిసి పని చేసే సర్పంచ్‌లనే ఎన్నుకోండి
కొత్తగూడెం బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
మంచి ప్రభుత్వం ఉంటే సరిపోదు.. మంచి సర్పంచ్‌లు కూడా ఉండాలి
తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చిన మన్మోహన్‌సింగ్
అందుకే ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ఆయన పేరు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘రాష్ట్రంలో మంచి ప్రభు త్వం ఉంటే సరిపోదు.. మంచి సర్పంచ్‌లు కూడా ఉండాలి. మంత్రులతో కలిసి పని చేసే సర్పంచ్ మీ ఊర్లో లేకపోతే పనులు జరగవు. అందుకే హాఫ్‌కో, ఫుల్లుకో ఓటు వేయొ ద్దు.. గ్రామాలు దెబ్బతింటాయి. రెండేళ్ల క్రితం మీరు మంచి ప్రభుత్వం కావాలని ఓటేస్తే ప్రజా పాలన వచి్చంది. మంచి ప్రభుత్వం ఉంది కాబట్టే ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఉచిత కరెంట్ వంటి పథకాలు వస్తున్నాయి. రాజకీయ కక్షలు మానుకుని పదేళ్లు అండగా ఉంటే, దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెడతాం.’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.
సింగరేణి లాంటి సంస్థలు నెలకొల్పేందుకే..
‘ఈ ప్రాంతంలో ఉన్న సహజ సంపదలను గుర్తించి, సింగరేణి లాంటి మరిన్ని సంస్థలను నెలకొల్పాలనే లక్ష్యంతోనే డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నాం. ఆనాడు ఇక్కడ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కోసం వందలాది ఎకరాల భూములను ఈ ప్రాంత రైతులు ఇస్తే.. ఉద్యోగాలు ఇతర ప్రాంతాల వారికి దక్కాయి. దీన్ని వ్యతిరేకిస్తూ తొలి తెలంగాణ ఉద్యమానికి పునాదులు పాల్వంచలోనే పడ్డాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడం ద్వారా నెరవేర్చిన ఘనత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు దక్కుతుంది. అందుకే ఈ ప్రాంతంలో నెలకొలి్పన యూనివర్సిటీకి ఆ మహనీయుడి పేరు పెట్టాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు.
నెహ్రూ స్ఫూర్తితో ఇరిగేషన్, విద్యా రంగాలపై దృష్టి
‘స్వతంత్ర భారతదేశంలో అప్పట్లో ఉన్న ఆకలి కేకలను పోగొట్టి స్వయం సమృద్ధి సాధించాలంటే నీటి పారుదల, విద్యారంగాలే ప్రధానమని దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ భావించారు. అందువల్లే నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్ వంటి అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు, అనేక ప్రముఖ విద్యాసంస్థలు ఆయన హయాంలో ఏర్పాటయ్యాయి. నెహ్రూ చూపిన స్ఫూర్తితోనే ఆరంగాలపై మా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ రంగాల్లో మేము తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్‌లో రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఉన్నత స్థానంలో నిలబెడతాయి.
కృష్ణా, గోదావరి జలాలు ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని బీడు భూముల్లో పారాల్సి ఉందని, తెలంగాణ వచ్చిన తర్వాత తొలి పదేళ్లలో ఉన్న ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, అవినీతి వల్ల ఆ పని జరగలేదు. ఎంత ఖర్చు అయినా సీతారామతో సహా జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం’అని సీఎం హామీ ఇచ్చారు. ఢిల్లీ వెళ్లి గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని, రాహుల్, ఖర్గేలను ఆహ్వానించాల్సి ఉంది కాబట్టి త్వరగా ముగిస్తున్నానని, మళ్లీ ఒకసారి మీ దగ్గరకు వస్తానంటూ సీఎం తన ప్రసంగాన్ని 12 నిమిషాల్లోనే ముగించారు.
ఈ వర్సిటీ దేశానికే దిక్సూచి
డాక్టర్ మన్మోహన్‌సింగ్ వర్సిటీ దేశానికే దిక్సూచి వంటిదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ యూనివర్సిటికీ సంబంధించిన అన్ని రకాల మౌలిక వసతులను సకాలంలో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రపంచంలో అక్కడక్కడ ఉన్న మంచి కోర్సులన్నింటినీ ఒక చోటకు తెచ్చి ఎర్త్ సైన్సెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మన్మోహన్ సింగ్ పేరును ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి పెట్టడం ఈ ప్రాంత ప్రజలకు లభించిన ప్రత్యేక గౌరవమని మంత్రి పొంగులేటి శ్రీనివా స్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, బలరామ్ నాయక్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రావాల్సి ఉంది. కానీ సాయంత్రం 5:06 గంటలకు వచ్చారు.


