గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ...చిత్ర విచిత్రాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. రిజర్వేషన్ మార్చలేదని ఒక గ్రామంలో ఎవరూ నామినేషన్ వేయలేదు. మరో చోట కుటుంబ సభ్యులు సహకరించడం లేదని ఓ సర్పంచ్ అభ్యర్థి పురుగుల మందు తాగాడు. డబ్బులు, మద్యం ఎన్నికల్లో పంచవద్దని గ్రామస్తులు సర్పంచ్ అభ్యర్థులతో ఇంకో చోట ప్రమాణం చేయించారు.
అమెరికా నుంచి సర్పంచ్ పదవికి నామినేషన్
స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిన రిటైర్డ్ ఎస్‌ఐ లక్ష్మారెడ్డి
దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బంధంపల్లి గ్రామ సర్పంచ్ పదవి జనరల్‌కు రిజర్వు అయ్యింది. ములుగు ఎస్‌ఐగా పనిచేసిన పోరెడ్డి లక్ష్మారెడ్డి కొన్ని నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. తన పిల్లలు అమెరికాలో ఉండడంతో కొద్ది రోజుల క్రితం అమెరికా వెళ్లారు. ఇంతలోనే సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. పోటీ చేయాలని అనుకున్న లక్ష్మారెడ్డి సర్పంచ్ నామినేషన్ ఫామ్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని సంతకం చేసి స్పీడ్ పోస్టు ద్వారా పంపించారు.
ఆ నామినేషన్‌ను బలపరిచిన పోరెడ్డి శరత్ లక్ష్మీపురం క్లస్టర్‌లో రిటరి్నంగ్ అధికారి భద్రమ్మకు అందించారు. అమెరికాలో ఉండి సర్పంచ్ పదవికి లక్ష్మారెడ్డి నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది. 2013 నుంచి 2018 వరకు లక్ష్మారెడ్డి భార్య సుభద్ర బంధంపల్లి సర్పంచ్‌గా పనిచేశారు.
కుటుంబ సభ్యుల మద్దతు లేదని..
పురుగుల మందు తాగిన సర్పంచ్ అభ్యర్థి
నంగునూరు(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘణపూర్ సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వు అయ్యింది. మాజీ ఉపసర్పంచ్ ఘనపురం ఎల్లయ్య (ఎల్లం) తోపాటు అతని అన్న బాల్‌నర్సయ్య, చిన్నాన్న కుమారుడు సాయిలు పోటీలో ఉండాలని అనుకున్నారు. అయితే ఒకే కుటుంబానికి చెందినవారు పోటీలో ఉండడం మంచిది కాదని బాల్ నర్సయ్య పోటీ నుంచి తప్పుకున్నారు.
ఒక్కరే పోటీలో ఉండాలని చెప్పినా వినకుండా ఎల్లంతోపాటు సాయిలు కూడా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు సహకరించడంలేదని మనస్తాపం చెందిన ఎల్లయ్య మంగళవారం పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
పాండురంగాపురం..నామినేషన్లు నిల్
ఎస్టీలు లేకున్నా రిజర్వ్ చేయడంపై గ్రామస్తుల నిరసన
పాల్వంచరూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పాండురంగాపురం సర్పంచ్ పదవి ఎస్టీలకు రిజర్వు అయ్యింది. 1,202 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేరు. ఈ పంచాయతీ పరిధిలో 8 వార్డులు ఉండగా, రెండు వార్డు స్థానాలు ఎస్టీ జనరల్‌కు, ఇంకో రెండు వార్డు స్థానాలు ఎస్టీ మహిళలకు, మిగతా నాలుగు జనరల్, జనరల్ మహిళలకు రిజర్వ్ చేశారు.
దీంతో మొదటి నుంచి రిజర్వేషన్లు మార్చాలని కోరుతున్న గ్రామస్తులంతా ఏకమై ఎవరూ నామినేషన్లు దాఖలు చేయొద్దని నిర్ణయించుకున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసే మంగళవారం సాయంత్రం వరకు ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. ఈ విషయమై ఎంపీడీఓ కె.విజయభాస్కర్‌రెడ్డిని వివరణ కోరగా పాండురంగాపురంలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని చెప్పారు.
సర్పంచ్‌గా గెలిపిస్తే ఇంటిపన్ను మాఫీ
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న గోమాస శ్యామలత శ్రీకాంత్ ఓటర్లకు 20 వాగ్దానాలతో కరపత్రం విడుదల చేశారు. సర్పంచ్‌గా గెలిపిస్తే ఇంటిపన్ను మాఫీ చేస్తానని, అర్హులైన వారికి నెల రోజుల్లో పింఛన్ మంజూరు చేయిస్తానని, గ్రామస్తులందరికీ మినరల్ వాటర్, ఎవరైనా చనిపోతే మృతుని కుటుంబానికి రూ.10వేలు ఆర్థికసాయం, ఇంటి ఆడబిడ్డ పెళ్లికి రూ.5 వేలు కట్నం, కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ సెంటర్ ఏర్పాటు, కేవీకే సోలార్ పవర్‌ప్లాంటులో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు, ఉపాధి కూలీలకు ఉచిత రవాణా సౌకర్యం తదితర హామీలు ఇచ్చారు.
రంగపేట శివారులోని 200 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో జాయింట్ సర్వే చేయించి నిరుపేదలకు పంపిణీ చేయిస్తానని హామీ కూడా ఇచ్చారు.ఈ కరపత్రం వాట్సాప్ గ్రూప్‌ల్లో వైరల్ అయ్యింది.
ఒకటోసారి..రెండోసారి..మూడోసారి
సర్పంచ్ పదవులకు కొనసాగుతున్న వేలం పాటలు
పాల్వంచరూరల్/నేలకొండపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెంలో రామాలయ నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చే వారినే సర్పంచ్, ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామస్తులు నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో సర్పంచ్ పదవి ఆశిస్తున్న కేలోతు సునీత రూ.6 లక్షలు, ఉప సర్పంచ్ పదవి కోసం నాగేశ్వరరావు రూ.2.90 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలిసింది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెం జీపీలోనూ ఆలయ అభివృద్ధి కోసం సర్పంచ్ అభ్యర్థి రూ.8 లక్షలు, ఉప సర్పంచ్ అభ్యర్థి రూ.4లక్షలు, వార్డు సభ్యులు రూ.10 వేల నుంచి రూ.50 వేలు ఇచ్చేలా అంగీకరించినట్టుతెలిసింది. దీంతో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అన్ని పార్టీల నేతలు ఓ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది.
తండా ఒక్కటే.. పంచాయతీలు రెండు
మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకలగడ్డ తండాలో రెండు గ్రామ పంచాయతీల పరిధిలో ఉంది. ఇటుకల గడ్డతండాలో ప్రధాన రహదారికి ఓ వైపు ఎలమంచిలితండా పరిధిలో, మరో వైపు గిరిపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. అన్ని రోజులు కలిసి ఉండే తండావాసులు పంచాయతీ ఎన్నికల వేళ రెండు గుంపులుగా విడిపోయి రాజకీయాలు చేస్తారు.
ఎమ్మెల్యే గండ్ర స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం
గణపురం: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్వగ్రామమైన గణపురం మండలం బుద్దారంలో సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ పార్టీ విడిదినేని శ్రీలతను బలపరచగా, బీఆర్‌ఎస్ తరఫున కొంరాజు అమృత నామినేషన్ వేశారు. మంగళవారం అమృత నామినేషన్ విత్‌డ్రా చేసుకోవడంతో శ్రీలత ఎన్నిక ఏకగ్రీవమైంది.
వరంగల్ జిల్లా సంగెం మండలం పెద్దతండా సర్పంచ్ అభ్యర్థిగా గుగులోత్ వినోదతోపాటు 8 వార్డులకు 8 మందే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పంచాయతీ ఎన్నిక ఏకగీవ్రం కానుంది.
ఇద్దరు భార్యలతో నామినేషన్లు
మిరుదొడ్డి(దుబ్బాక): సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట–భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఉన్నత విద్యావంతులైన ఇద్దరు భార్యలు ఉన్నారు. నవంబర్ నెల 30న తన మొదటి భార్యతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేయించారు.
నామినేషన్ పత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే స్రూ్కటినీలో ఎక్కడ తొలగిస్తారోనన్న భయంతో మంగళవారం రెండో భార్యతో మరో నామినేషన్ వేయించారు. నామినేషన్ల దాఖలు ముగిసే సమయానికి ఈ ఇద్దరే పోటీలో ఉన్నారు. వీరిలో ఒకరు నామినేషన్ ఉపసంహరించుకుంటే సర్పంచ్ పదవి ఏకగ్రీవమవుతుంది. గ్రామాభివృద్ధికి ఆర్థిక సహకారం అందిస్తామని ఈ కుటుంబం చెప్పడంతో ఇతరులు పోటీలో లేరు.
జెండాలన్నీ ఒక్కటయ్యాయి
కోదాడ: పంచాయతీ ఎన్నికల్లో పలు పార్టీల నేతలు తమ ఎజెండాలను పక్కన పెట్టి జెండాలను కలిపేశారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో ఈ విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. బేతవోలులో కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం అభ్యర్థికి బీఆర్‌ఎస్, టీడీపీ, సీపీఐ నాయకులు మద్దతునిస్తూ ఆయా పార్టీల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఇదే గ్రామంలో కాంగ్రెస్‌లోని మరో వర్గం అభ్యర్థి సీపీఎంతో కలిసి పోటీకి నిలబడింది. చిలుకూరు మండల కేంద్రంలో సీపీఐ అభ్యర్థికి బీఆర్‌ఎస్‌లోని ఒక వర్గం మద్దతుగా ఇస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్‌ఎస్‌లో మరో వర్గంతోపాటు టీడీపీ మద్దతుగా నిలుస్తున్నాయి.
సర్పంచ్ బరిలో అత్తాకోడలు
పాలకుర్తి(రామగుండం): పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని జీడీనగర్(ఘనశ్యాందాస్‌నగర్) పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా అత్తాకోడలు నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వు కాగా, మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య తన తల్లి సూర నర్సమ్మతో ఆదివారం నామినేషన్ వేయించారు. మంగళవారం నర్సమ్మ పెద్దకోడలు సూర రమాదేవి సైతం నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఒకేఇంటి నుంచి అత్తాకోడలు సర్పంచ్ స్థానంలో బరిలో నిలిచినట్టయ్యింది.
గతంలో జీడీనగర్ కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. అప్పుడు ఎస్సీలకు రిజర్వు కాగా, సమ్మయ్య తన భార్య సునీత (ఎస్సీ)ను సర్పంచ్‌గా గెలుపొందించుకున్నారు. జీడీనగర్ ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటైన అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో సూర సమ్మయ్య సర్పంచ్‌గా గెలుపొందారు. ప్రస్తుతం బీసీ మహిళకు రిజర్వు కావడంతో సమ్మయ్య తన తల్లి నర్సమ్మను బరిలో నిలిపారు. ఆయన వదిన కూడా పోటీ చేయడం గమనార్హం.
సాఫ్ట్‌వేర్ టు సర్పంచ్ వార్
మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన వీరబత్తిని మాలతి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. ఆమె హైదరాబాద్‌లోని విప్రో సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేశారు.
ఆర్మీ జవాన్ కూడా...: ఇదే మండల పరిధిలోని నూకపల్లి సర్పంచ్‌గా రిటైర్ట్ ఆర్మీ జవాన్ చెవులమద్ది శ్రీనివాస్ పోటీలో ఉన్నారు.17 ఏళ్లు ఆర్మీలో జవాన్‌గా దేశానికి సేవలందించానని, ఇప్పుడు స్వగ్రామానికి సేవలందించాలనే లక్ష్యంతో తాను బరిలో ఉన్నట్టు తెలిపారు.
అక్రమంగా సంపాదిస్తే జప్తు చేసుకోండి
బాండ్ పేపర్ రాసిచ్చిన సర్పంచ్ అభ్యర్ధి
తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గుడితండాకు చెందిన జైపాల్‌నాయక్ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాడు. ప్రచారంలో భాగంగా గ్రామంలో ఇప్పుడు తనకు ఉన్న ఆస్తి కన్నా ఒక్క రూపాయి అక్రమంగా ఎక్కువ సంపాదించినా.. ఆ ఆస్తిని గ్రామపంచాయతీ జస్తు చేసుకొని ప్రజలకు పంచొచ్చని బాండ్ పేపర్ రాసి ప్రజలకు పంచుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నాడు.
అవినీతికి పాల్పడితే పదవి నుంచి దించేస్తాం
చేర్యాల(సిద్దిపేట): ‘గ్రామ సర్పంచ్‌గా గెలిచిన వ్యక్తి అవినీతికి పాల్పడినా, స్వార్థ ప్రయోజనాలకు పదవిని దురి్వనియోగం చేసినా ఏసీబీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. పదవి నుంచి దింపేందుకు వెనుకాడం’అని జయశంకర్ ఫౌండేషన్ సభ్యులు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంచం
భీంపల్లిలో సర్పంచ్ అభ్యర్థులతో గ్రామస్తుల ముఖాముఖి
కమలాపూర్: ఈ నెల 11న మొదటి విడతలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో తాము డబ్బులు, మద్యం పంచబోమని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు ప్రమాణం చేశారు. జవ్వాజి కనుకయ్య, తోట శంకరయ్య, వాసాల శ్రీనివాస్, సముద్రాల మొగిలిలతో గ్రామస్తులు మంగళవారం ఉమ్మడి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రస్తుత ఎన్నికల్లో తాము సర్పంచ్‌గా గెలిస్తే చేసే అభివృద్ధి పనుల ఎజెండాను సర్పంచ్ అభ్యర్థులు గ్రామస్తులకు వివరించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచబోమని అభ్యర్థులు హామీ ఇవ్వాలని గ్రామస్తులు కోరగా, సర్పంచ్ అభ్యర్థులు హామీ ఇచ్చారు.


