breaking news
Telangana Local Body Elections 2025
-
సర్పంచ్ ఎన్నికలు.. బంపరాఫర్ ప్రకటించిన బండి సంజయ్!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ బంపరాఫర్ ప్రకటించారు. తమ పార్టీ బలపరిచే అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే.. రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులిస్తానంటూ ప్రకటించారాయన. మాట ఇస్తే... తప్పే ప్రసక్తే లేదు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ఇన్సెంటివ్ ఇస్తానని బీఆర్ఎస్ మాట తప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయాపైసా నిధుల్లేవు. నిధులు తెచ్చేది, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ఎన్నికలు జరిగేది కూడా కేంద్ర నిధుల కోసమే. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పొరపాటు చేస్తే 5 ఏళ్ల నరక యాతన తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలే చేశారాయన.తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం షెడ్యూల్ రిలీజ్ చేసింది. షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలో రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఐఏఎస్ రాణి కుముదిని దేవి మీడియా ముఖంగా వెల్లడించారు.మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలుఫేజ్ 1లో కోసం.. నవంబర్ 27 నుండి నామినేషన్ స్వీకరణ డిసెంబర్ 11న పోలింగ్ఫేజ్2 కోసం.. 30 నవంబర్ నుండి నామినేషన్ స్వీకరణ డిసెంబర్ 14న పోలింగ్ఫేజ్3 కోసం.. డిసెంబరు 3 నుండి నామినేషన్ స్వీకరణ డిసెంబర్ 17న పోలింగ్ -
స్థానికంపై నేడు నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం గురువారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలు 9, 41, 42ల అమలును రాష్ట్ర హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విష యం విదితమే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్య క్షతన సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 4 గంటలకు కేబినెట్ సమావేశమై న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది.అయితే పాత విధానంలో రిజర్వేషన్లను అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వుల్లో రాష్ట్ర హైకోర్టు చేసిన సూచనను అమలు చేయడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం కనిపించడం లేదు. ఇలావుండగా.. ఇద్దరుకు మించి సంతానం కలిగినవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్న నిబంధనను ఎత్తివేసే అంశంపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ఆ మేరకు చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేసేలా గవర్నర్‌కు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించనుంది. ఎస్ఎల్బీసీ కాంట్రాక్టు రద్దు ..?శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగాల నిర్మా ణ సంస్థ జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్‌తో 2005 ఆగస్టు 25న చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖలోని స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫారసులపై కూడా రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఒప్పందం రద్దు చేస్తే మళ్లీ టెండర్లు నిర్వహించి పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాల్సి ఉంటుంది. అలా చేస్తే పెరిగిన ధరల ఆధారంగా అంచనాలు కొన్ని రెట్లు పెరిగిపోయే అవకాశం ఉంది. ఆయా అంశాలపై మంత్రివర్గం కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది. దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ–6 అంచనాల పెంపుతో పాటు అదనంగా మూడో దశ పనులకు అనుమతులు ఇచ్చే అంశాన్ని కూడా తేల్చవచ్చని అంటున్నారు. కాళేశ్వరం టెండర్లకు ఓకే?కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులకు డిజైన్ల రూపకల్పన కోసం ఇటీవల నీటిపారుదల శాఖ ఆహ్వానించిన ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లకు సైతం ఆమోదం తెలిపే (రాటిఫై) అవకాశం ఉన్నట్టు తెలిసింది. అలాగే ఎస్ఆర్ఎస్పీ రెండో దశకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరు పెట్టే అంశాన్ని మంత్రివర్గం రాటిఫై చేయనుంది.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7తో రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన విజయోత్సవాలపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులకు ఆమోదం తెలపనున్నట్టు తెలిసింది. విజయోత్సవాల్లో భాగంగా సనత్‌నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించడంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టనుంది. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్–2047పై మంత్రివర్గం చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. -
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ చర్చించి చెప్పాలని హైకోర్టు పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు కాగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నెల 9 న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేయగా.. నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేయడానికి సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. నిన్న సుప్రీం కోర్టు కూడా ఎన్నికలకు వెళ్లమని చెప్పింది కదా అంటూ వ్యాఖ్యానించింది. ఎన్నికలు పెట్టుకోవచ్చని ఓరల్‌గా మాత్రమే చెప్పిందని.. ఆర్డర్లో ఎక్కడా చెప్పలేదని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది అన్నారు.నిన్ననే(అక్టోబర్ 16, గురువారం) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని కోర్టుకు తెలిపారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టే దాన్ని సస్పెండ్ చేశాం. ఫ్రెష్ గా రిజర్వేషన్ లను గూర్చి ప్రభుత్వంతో చర్చించాకే రీ నోటిఫికేషన్ ఉంటుంది. రెండు వారాల సమయం కావాలంటూ కోర్టును స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో తదుపరి విచారణ రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. -
తెలంగాణ: నామినేషన్లు షురూ.. ఎస్ఈసీ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ రిలీజ్ అయ్యింది. మొదటి విడతలో 292 జడ్పీటీసీ, 2,964 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని అందులో పేర్కొంది. ఆ వెంటనే.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లు స్వీకరణ ప్రారంభం అయ్యింది. ఈ తరుణంలో.. నామినేషన్లు వేయాలనుకునేవాళ్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) కీలక సూచనలు చేసింది.జడ్పీటీసీ నామినేషన్లను జిల్లా పరిషత్ కార్యాలయంలో, ఎంపీటీసీ నామినేషన్లను స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని సమర్పించాలి. జడ్పీటీసీ నామినేషన్ వేయాలనుకున్న జనరల్ కేటగిరీ అభర్థి.. రూ.5 వేలు, అదే రిజర్వేషన్ అభ్యర్థి అయితే రూ.2,500 డిపాజిట్ చేయాలి. ఎంపీటీసీ నామినేషన్ వేసే జనరల్ అభ్యర్థి రూ.2,500, రిజర్వేషన్ అభ్యర్థి రూ.1,250 డిపాజిట్ చేయాలి.ఎన్నికల నియమావలికి అనుగుణంగా నామినేషన్ సందర్బంగా దాఖలు చేసే వ్యక్తితో కలిపి ఐదుగురికి మించి కార్యాలయంలోకి రాకూడదు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5గం. వరకే నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత అనుమతించరు.అభ్యర్థులు పూర్తి డాక్యుమెంటేషన్, ఫోటోలు, డిపాజిట్ రసీదుతో నామినేషన్ వేయాలి. 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎన్నికల నియమావళిని పాటించని అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడే అవకాశం ఉంది. 15వ తేదీ మధ్యాహ్నాం 3గం.లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అలాగే.. ప్రచార నిబంధనలు, ఆచరణ నియమావళి త్వరలో విడుదల అవుతుంది.ఇదీ చదవండి: తెలంగాణ ఈ ఎమ్మెల్యేలకు వింత పరిస్థితి! -
తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. సెప్టెంబర్ 29న విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేసింది.


