4,332 సర్పంచ్ పదవులకు 28,278 మంది, 38,342 వార్డులకు 93,995 మంది దాఖలు
అత్యధిక నామినేషన్లతో తొలి స్థానంలో నల్లగొండ
ఏజెన్సీ ప్రాంతాల్లో తగ్గిన పోటీ
సాక్షి, హైదరాబాద్ : రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు పడ్డాయి. 4,332 సర్పంచ్ పదవులకు 28,278 నామినేషన్లు, 38,342 వార్డులకు 93,595 నామినేషన్ల సమర్పణతో అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన వ్యక్తమైంది. ఈ నెల 14న జరగనున్న రెండోవిడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది.
రాత్రి పొద్దుపోయేదాకా పలు పంచాయతీల్లో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పెద్దసంఖ్యలో బారులుదీరారు. వివిధ జిల్లాల్లో పడిన నామినేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు, సమాచారం బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) చేరాయి. దీంతో రెండోవిడత నామినేషన్ల వివరాలను ఎస్‌ఈసీ సాయంత్రం వెల్లడించింది.
నామినేషన్లలో నల్లగొండ జిల్లా టాప్: రెండో విడతలోనూ సర్పంచ్, వార్డులకు దాఖలైన నామినేషన్ల సంఖ్య విషయంలో నల్లగొండ జిల్లా టాప్‌ప్లేస్‌లో నిలిచింది. ఈ జిల్లాలోని 282 సర్పంచ్ స్థానాలకు అత్యధికంగా 2,116 నామినేషన్లు, 2,418 వార్డులకు 6,120 నామినేషన్లు పడ్డాయి. ఆ తర్వాతి స్థానంలో నిలిచిన సూర్యాపేట జిల్లాలో 181 పంచాయతీలకు 1,447 నామినేషన్లు దాఖలయ్యాయి. అంటే ఇక్కడ సగటున ఒక్కో సర్పంచ్ సీటుకు 8 మందికి పైగా పోటీ పడుతున్నారు.
అదే నల్లగొండ జిల్లాలో సగటున 7.5గా పోటీ ఉంది. సూర్యాపేట జిల్లాలో 1,628 వార్డులకు 4,378 మంది నామినేషన్లు వేశారు. ఖమ్మం జిల్లాలో 183 సర్పంచ్ స్థానాలకు 1,055 నామినే షన్లు పడగా, 1,686 వార్డులకు 4,160 నామినేషన్లు అనూహ్యంగా దాఖలయ్యాయి.
ఏజెన్సీలో తగ్గిన జోరు: మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో సర్పంచ్, వార్డులకు పోటీ కాస్త తక్కువగానే ఉంది. ములుగు జిల్లాలోని 52 పంచాయతీలకు అత్యల్పంగా 288 నామినేషన్లు వచ్చాయి. ఆదిలాబాద్, ములుగు వంటి జిల్లాల్లో సగటున ఒక్కో సీటుకు 5 నుంచి 6 నామినేషన్లు మాత్రమే నమోదయ్యాయి. జోగుళాంబ గద్వాల, హనుమకొండ జిల్లాల్లో కూడా నామినేషన్ల సంఖ్య తక్కువగానే ఉంది.
ఇంకా తేలని తొలివిడత అభ్యర్థుల లెక్క
సాక్షి, హైదరాబాద్ : తొలి విడత జరిగే పంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలు ఆయా జిల్లాల నుంచి ఇంకా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ)కు చేరలేదు. 31 జిల్లాల పరిధిలోని 189 మండలాల్లో 4,236 సర్పంచ్ స్థానాలు, 37,440 వార్డులకు 11న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో.. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన జాబితాలను పంచాయతీలలోని నోటీస్ బోర్డులపై ప్రచురించారు.
పలు గ్రామ పంచాయతీల్లో అభ్యర్థుల ఉపసంహరణ తర్వాత పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని ప్రకటించారు. అయితే ఏ జిల్లాలో ఎంత మంది సర్పంచ్ లు ఏకగ్రీవమయ్యారనే దానిపై సమాచారం రాత్రి వరకూ ఎస్‌ఈసీకి అందలేదు. దీంతో అధికారికంగా ఏకగ్రీవమైన సర్పంచ్‌ల వివరాలు ప్రకటించలేదు. వివరాలను నేడు ఎస్‌ఈసీ ప్రకటించే అవకాశాలున్నాయి. మొదటిదశ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియ మొదలైంది.


