వానాకాలం పంట కింద రైతుల నుంచి మార్క్‌ఫెడ్ మొక్కజొన్న కొనుగోళ్లు
43,416 మంది రైతులకు ఇవ్వాల్సిన సొమ్ము రూ.437 కోట్లు
మార్క్‌ఫెడ్‌కు ష్యూరిటీ ఇవ్వని ప్రభుత్వం.. బ్యాంకుల నుంచి అందని రుణం
సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్‌కు మక్కలను విక్రయించిన రైతులకు ఇంకా డబ్బులు అందలేదు. పంటను విక్రయించి రెండు నెలలు గడుస్తున్నా రైతులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. గత సంవత్సరం వానాకాలం, యాసంగిలో మొక్కజొన్న పంటకు డిమాండ్ ఉండడంతో ఈ వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో 6.74 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. సెపె్టంబర్ చివరి నుంచే మక్కలను రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చినా, డిమాండ్ రాలేదు.
ప్రస్తుతం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400 ఉండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.1,900 నుంచి రూ. 2,100 వరకు మాత్రమే చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. గత సంవత్సరం మక్కల మద్దతు ధర 2,225 ఉండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.2,300 వరకు చెల్లించి కొనుగోలు చేశారు. ఈసారి మద్దతు ధరను కేంద్రం పెంచగా, వ్యాపారులు మాత్రం రూ.2,100 మించి ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో రైతులు ఆందోళన చెందారు.
అక్టోబర్ 17నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ అధికారులతో సమావేశమై మక్క రైతులకు నష్టం వాటిల్లకుండా మార్క్‌ఫెడ్ ద్వారా అక్టోబర్ 17వ తేదీ నుంచి మక్కల కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ నెల 15వ తేదీ వరకు కొనుగోళ్లు జరుగుతాయని భావించగా, 5 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు మార్క్‌ఫెడ్ సెంటర్లకు తీసుకొస్తారని అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు 2లక్షల మెట్రిక్ టన్నుల మేర కూడా కొనుగోలు చేయలేదు.
మంగళవారం నాటికి 43,416 మంది రైతులు 183 కేంద్రాల్లో 1.82 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను మాత్రమే విక్రయించారు. 15వ తేదీ వరకు మరో లక్ష టన్నులు వచ్చే అవకాశం ఉందని అధికార యంత్రాంగం భావిస్తోంది. అయితే మక్కలు విక్రయించినా, మార్క్‌ఫెడ్ డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు మిగిలిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోయినా, వ్యాపారుల వద్దకే వెళుతున్నారు. ఇప్పటివరకు రైతుల నుంచి మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన మక్కల విలువ రూ.437 కోట్లు.
అయితే మార్క్‌ఫెడ్ వద్ద రైతులకు చెల్లించేందుకు డబ్బులు లేవు. ప్రభుత్వం ష్యూరిటీ ఇస్తే బ్యాంకుల నుంచి రుణంగా తెచి్చ, రైతులకు చెల్లిస్తుంది. కొనుగోలు చేసిన మక్కలను తిరిగి విక్రయించిన తర్వాత బ్యాంకులకు మార్క్‌ఫెడ్ ఆ రుణాన్ని చెల్లిస్తుంది. అయితే ఈసారి ప్రభుత్వం ష్యూరిటీ ఇవ్వకపోవడంతో బ్యాంకుల నుంచి రుణం తీసుకోలేదు.
దీంతో రైతులకు చెల్లించాల్సిన రూ. 437 కోట్లలో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాల్లో చేరలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై అధికారులను ప్రశ్నించగా, బ్యాంకు ష్యూరిటీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ఒకటి రెండు రోజుల్లో డబ్బులు విడుదలవుతాయని చెబుతున్నారు.


