‘రెవెన్యూ’ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాం: మంత్రి పొంగులేటి
తొందరపడి ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం లేదు..
చెప్పినదాని కంటే ఎక్కువే చేస్తాం
ధరణిని బంగాళాఖాతంలో వేశాం...
ప్రజలు మెచ్చిన భూభారతి తెచ్చాం
త్వరలో మరో 2,500 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కి వచ్చే నాటికి రెవెన్యూ వ్యవస్థ కుప్ప కూలి పోయి ఉందని, దాన్ని పునాదుల నుంచి మళ్లీ నిర్మించుకుంటూ వస్తున్నామని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. కొంచెం ఆలస్యమైనా రెవెన్యూ వ్యవస్థకు గట్టి పునాదులు వేస్తామన్నారు. రైతులు తమ భూమి గురించి భయపడే దశ నుంచి పూర్తి భద్రత కల్పిస్తూ వారిలో ధైర్యం నింపగలిగామని వెల్లడించారు. బుధవారం ఆయన సచివాలయంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక కమిషనర్ రాజీవ్‌గాంధీ హన్మంతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా భయంకరమైన ధరణిని బంగాళాఖాతంలో వేసి ప్రజలు మెచ్చిన భూభారతి చట్టాన్ని తెచ్చామన్నారు.
భూదార్ కార్డులిస్తాం: రెండో దశలో భాగంగా నక్షాలు లేని 373 గ్రామాల్లో సర్వే చేసి భూముల హద్దులు నిర్ధారించి భూదార్ కార్డులిస్తామని పొంగులేటి చెప్పారు. మూడో దశలో ప్రతి జిల్లాలోని 70 గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. మొత్తం 3,490 మంది లైసెన్సుడు సర్వేయర్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామని, మరో 2,500 మందిని డిసెంబర్ చివరి కల్లా అందుబాటులోకి తెస్తామన్నారు. అతుకుల బొంత ధరణి వెబ్‌సైట్‌ను రూపుమాపి, భూముల వివరాలు, సర్వే సమాచారం, రిజిస్ట్రేషన్ గణాంకాలు ఒకే వేదికపై ఉండేలా ఏకీకృత వెబ్‌సైట్‌ను వచ్చే జనవరిలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
అన్ని భద్రతా ప్రమాణాలుండే భూదార్‌కార్డులను రైతులకు ఇస్తామని, భవిష్యత్తులో ఏ రిజిస్ట్రేషన్ లావాదేవీ అయినా సర్వే మ్యాప్ ఉంటేనే జరిగేలా పారదర్శక వ్యవస్థను రూపొందిస్తామని చెప్పారు. అయితే కంగారు పడి ప్రజలను మభ్యపెట్టాలని తమకు లేదని, కొంత ఆలస్యమైనా చెప్పిన దాని కంటే ఒకటి ఎక్కువే చేస్తామని పొంగులేటి వెల్లడించారు. తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల విషయంలో స్పందిస్తూ.. ‘నిజం నిలకడ మీద తెలుస్తుంది. నిజం మారదు. మార్చబడదు’ అని చెప్పారు.
పొంగులేటి ఇంకా ఏం చెప్పారంటే...!
⇒ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా నోటీసుల జారీ అయిపోయింది. త్వరలోనే పరిష్కార ప్రక్రి య ప్రారంభమవుతుంది. ఇందులో అఫిడవిట్ ఇవ్వాలన్న నిబంధనపై కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అవసరమైతే జీవోను మార్చేందుకూ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
⇒ గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల అవకతవకలపై తాము చేసిన ఫోరెన్సిక్ ఆడిటింగ్ ప్రక్రియ పైలట్ జిల్లాలైన సిద్ధిపేట, సిరిసిల్లలో ముగిసింది. ఈ నివేదికను త్వరలోనే వెల్లడిస్తాం.
⇒ నిషేధిత భూముల జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టాం. ఎవరికైనా అభ్యంతరాలుంటే దరఖాస్తు చేసుకోవాలి. పరిశీలించి అవసరమైతే ఆయా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తాం.
⇒ ఒకసారి ఒక భూమిని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం రాష్ట్రానికి లేదు. కేంద్ర చట్టాన్ని మార్చి ఆ అధికారాన్ని ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని అడిగాం. కేంద్రం కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
⇒ హిల్ట్‌పిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదు. బీఆర్‌ఎస్ హయాంలో ఏ పరిశ్రమలకు ఎలా భూములను ధారాదత్తం చేశారనే విషయాలను త్వరలోనే తెలియజేస్తాం.
⇒ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 45–46 వేల మందికి అక్రిడిటేషన్లు జారీ చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం.
⇒ తెలంగాణ పేరుతో రెండుసార్లు బీఆర్‌ఎస్ మసిపూసి మారేడు కాయ చేసింది. పడికట్టు పదాలతో ప్రజలను మోసం చేసింది. ఇకముందు కూడా అలాంటిది నడుస్తుందనుకోవడం వారి పొరపాటు.


