ఆర్డినెన్స్ వచ్చాక.. మూడు రోజుల్లో నోటిఫికేషన్
జీహెచ్‌ఎంసీలో వార్డుల డీలిమిటేషన్‌కు అధికారుల పేపర్ వర్క్
ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ
27 మునిసిపాలిటీల విలీనం నేపథ్యంలో..
సాక్షి, సిటీబ్యూరో: శివారు మునిసిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)లో విలీనమయ్యాయి.. అధికారులు డ్రాఫ్ట్ తయారీలో లీనమయ్యారు.. ఈ మేరకు వార్డుల పునర్విభజనకు రంగం సిద్ధమవుతోంది. జీహెచ్‌ఎంసీలో 20 మునిసిపాలిటీలు, 7 మునిసిపల్ కార్పొరేషన్ల విలీనానికి సంబంధించిన ఆర్డినెన్స్ వెలువడిన అనంతరం మూడు రోజుల్లోగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు సాగుతోంది.. వార్డుల పునర్విభజనపై ప్రజల అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం అధికారులు తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
విలీనమవుతున్న మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్న ప్రాంతాన్ని ఇప్పటికే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీ క్యూర్)గా (Telangana core urban region) పిలుస్తున్నారు. అయితే దానికి చట్టబద్ధత కల్పించేందుకూ కసరత్తు చేస్తున్నారు. ఔటర్ రింగ్‌రోడ్ వరకు ఉన్న ప్రాంతాన్ని ఇకపై టీక్యూర్‌గానే వ్యవహరించనున్నారు. ఈ పరిధిలో జనాభా దాదాపు 1.30 కోట్ల మంది ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
విలీనమైన మునిసిపాలిటీలు సహా జీహెచ్‌ఎంసీలోని అన్ని వార్డుల్ని డీలిమిటేషన్ చేసే పేపర్ వర్క్ దాదాపుగా పూర్తయింది. విలీనం, వార్డుల పునర్విభజనకు సంబంధించి చట్టపరంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. విలీనమయ్యాక సైతం పరిపాలన వ్యవస్థ వార్డులు, సర్కిళ్లు, జోన్లుగానే ఉంటుంది.
ప్రస్తుతానికి జీహెచ్‌ఎంసీ వరకే బడ్జెట్
ప్రతియేటా రాబోయే ఆర్థిక సంవత్సరానికి దాదాపు నాలుగైదు నెలల ముందుగానే జీహెచ్‌ఎంసీ (GHMC) బడ్జెట్‌ను రూపొందించడం ఆనవాయితీ. ప్రస్తుతం కొత్తగా 27 స్థానిక సంస్థలు జీహెచ్‌ఎంసీలో విలీనమవుతున్నందున వాటిల్లోనూ పనులు చేయాల్సింది జీహెచ్‌ఎంసీయే. కొత్త బడ్జెట్‌ను పాలకమండలి ఆమోదించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిస్తారు.
జీహెచ్‌ఎంసీ పాలకమండలిని ఎన్నుకున్నది జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 వార్డుల వరకే. ఇప్పుడు కొత్తగా కలిసే స్థానిక సంస్థలకు నిధులు కేటాయించే అధికారం పాలకమండలికి సాంకేతికంగా లేదు. ఈనేపథ్యంలో ఇప్పటికైతే ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ వరకే కొత్త బడ్జెట్‌కు అధికారులు రూపకల్పన చేశారు.
విలీనమైనవాటికి మరో రకంగా..
కొత్తగా విలీనమయ్యే వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి పొందడమో, మరో రకంగానో చట్టబద్ధమైన ఇబ్బందుల్లేకుండా కేటాయింపులు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చే ఫిబ్రవరి 10వ తేదీతో ముగిసిపోతుంది. ఆ తర్వాత తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
చదవండి: అసలే నిశిరాత్రులు.. ఆపై పొగమంచు
కొత్త బడ్జెట్‌కు సంబంధించిన కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ప్రారంభం కావడం తెలిసిందే. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కానందున, ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం 27 స్థానిక సంస్థలు కలిసినా జీహెచ్‌ఎంసీ ఒకటిగానే ఉంటుంది. జీహెచ్‌ఎంసీని విభజించాలనుకుంటే కొంతకాలం తర్వాతే ఆ పని జరగనుందని సంబంధిత అధికారులు తెలిపారు.


