రహదారులపై అడ్డగోలుగా వాహనాల పార్కింగ్
రిట్రో రిఫ్లెక్టివ్ టేపులు లేక రోడ్డు ప్రమాదాలు
ఇష్టానుసారంగా ఆర్టీఏ ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలు
నిశిరాత్రి.. రోడ్డు పక్కన నిలిపి ఉంచే వాహనాలు ప్రాణాలు తీస్తున్నాయి. ఒకవైపు చీకటి, మరోవైపు పొగమంచు కారణంగా ఇలాంటి వాహనాలను స్పష్టంగా గుర్తించలేకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల వరంగల్ హైవేపై నిలిపి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.
ఔటర్‌రింగ్‌రోడ్డుపై తరచూ ఎక్కడో ఒక చోట ఇలాంటి వాహనాలు హడలెత్తిస్తూనే ఉన్నాయి. ప్రధాన రహదారులు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి ప్రాంతాల్లో వాహనాలను పార్క్ చేసినప్పుడు వాటి ఉనికి స్పష్టంగా కనిపించే విధంగా రిట్రో రిఫ్లెక్టివ్ టేప్‌లను (retro reflective tape) అతికించాలి. సరుకు రవాణా వాహనాలు మొదలుకొని వ్యక్తిగత వాహనాల వరకు ఈ రిట్రో రిఫ్లెక్టివ్ టేప్‌లు, ప్లేట్‌ల నిబంధన కచ్చితంగా పాటించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి ఏటా 25 శాతానికిపైగా రోడ్డు ప్రమాదాలు రిఫ్లెక్టర్‌లు లేక, వాహనాలను గుర్తించలేకపోవడం వల్లే జరుగుతున్నట్లు పేర్కొంటున్నారు.
– సాక్షి, సిటీబ్యూరో
యథేచ్చగా ఉల్లంఘన..
రిట్రో రిఫ్లెక్టర్‌లను తప్పనిసరి చేస్తూ కేంద్ర మోటారు వాహన చట్టంలో స్పష్టమైన నిబంధనలు విధించారు. ఇటీవల సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా కమిటీ సైతం రిఫ్లెక్టర్‌ల ఉల్లంఘనలోని తీవ్రతను గుర్తించింది. కేవలం సరుకు రవాణా, వాణిజ్య వాహనాలే కాకుండా ద్విచక్ర వాహనం నుంచి భారీ వాహనాల వరకు తప్పనిసరిగా రిఫ్లెక్టర్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు మోటారు వాహన చట్టంలోని నిబంధనలను సైతం కమిటీ ప్రధానంగా ప్రస్తావించింది. కానీ వీటి అమలులోనే వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో కొంతమంది మోటారు వాహన తనిఖీ అధికారులు రిఫ్లెక్టర్‌లను పరిగణనలోకి తీసుకోకుండానే ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలను (Fitness Certificate) అందజేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కొన్ని చోట్ల నాసిరకం రిఫ్లెక్టర్‌ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. కేంద్రం నిర్ధారించిన ప్రమాణాలకు భిన్నమైన రిఫ్లెక్టర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో నిలిపి ఉన్న, నెమ్మదిగా వెళ్తున్న వాహనాలను స్పష్టంగా గుర్తించలేకపోతున్నారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు నాసిరకం రిఫ్లెక్టర్‌లు కూడా ఒక కారణమేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ దందా..
మరోవైపు కొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లోని ఫిట్‌నెస్ సెంటర్‌లలో రిట్రో రిఫ్లెక్టివ్ టేపుల అక్రమ దందా కొనసాగుతోంది. కేవలం రూ.150 నుంచి రూ.500 వరకు లభించే రిఫ్లెక్టర్‌లను దళారులు, ఏజెంట్‌లు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని చోట్ల ఎంవీఐల ప్రోత్సాహంతోనే ఈ అక్రమ దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు రావడం గమనార్హం.
ఇండియన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ ప్రమాణాల మేరకు ఏఐఎస్ 090, ఏఐఎస్ 089, ఏఐఎస్057 గుర్తింపు కలిగిన రిట్రో రిఫ్లెక్టర్‌లు,ప్లేట్‌లను మాత్రమే వినియోగించాలి. కానీ.. ఇందుకు విరుద్ధంగా నాసిరకం రిఫ్లెక్టర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యమైన రిఫ్లెక్టర్‌లు కనీసం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న వాహనాల ఉనికిని తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది. నాసిరకం వాటితో ఆ అవకాశం ఉండదు.
చదవండి: ఒక్క సిగరెట్.. 146 ప్రాణాలు బలి!
ఈ నిబంధనలు తప్పనిసరి..
⇒ అన్ని రకాల వాహనాలకు ముందు, వెనుక ఎరువు, తెలుపు రంగు రిఫ్లెక్టర్‌లను ఏర్పాటు చేయాలి.
⇒ భారీ వాహనాలకు ఎరువు,తెలుపు రిఫ్లెక్టర్‌లతో పాటు పసుపు రంగు రిఫ్లెక్టర్‌లను రెండు వైపులా అతికించాలి
⇒ రిఫ్లెక్టర్‌లను కనీసం ఒక కిలోమీటర్ దూరం నుంచి స్పష్టంగా గుర్తించేలా ఏర్పాటు చేయాలి.
⇒ మోటార్ వెహికల్ యాక్ట్‌లోని 104వ నిబంధన మేరకు ఏఐఎస్ గుర్తింపు కలిగిన వాటిని మాత్రమే వినియోగించాలి.


