ఒక్క సిగ‌రెట్‌.. 146 ప్రాణాలు బ‌లి! | Hong Kong Fire Accident Police investigate cause of the fire | Sakshi
Sakshi News home page

ఒక్క సిగ‌రెట్‌.. 146 మంది బ‌లి!

Dec 1 2025 5:43 PM | Updated on Dec 1 2025 5:58 PM

Hong Kong Fire Accident Police investigate cause of the fire

నిప్పుతో చెల‌గాటం ఆడొద్ద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఏమరుపాటుగా ఉంటే క్షణంలో నిప్పు జీవితాల‌ను త‌ల‌క్రిందులు చేస్తుంది. అగ్గిరాజుకుంటే క‌లిగే న‌ష్టాన్ని ఊహించం చాలా క‌ష్టం. ఆస్తి న‌ష్ట‌మే కాదు ప్రాణాలు గాల్లో క‌లిసిపోతాయి. చివ‌ర‌కు బూడిద మాత్ర‌మే మిగులుతుంది. అందుకే పెద్దోళ్లు హెచ్చ‌రిస్తూ ఉంటారు.. అగ్నితో ఆట‌లు వ‌ద్ద‌ని. తాజా విష‌యానికి వ‌స్తే హాంగ్‌కాంగ్‌లో నిప్పు సృష్టించిన విల‌యం పెను విషాదాన్ని మిగిల్చింది. టై పొ టౌన్‌లోని వాంగ్ ఫుక్ కోర్టు అపార్టుమెంట్ స‌ముదాయంలో న‌వంబ‌ర్ 26న‌ చెల‌రేగిన అగ్ని కీలలు ఇప్ప‌టివ‌ర‌కు 146 మందిని బ‌లితీసుకున్నాయి. 40 మంది ఆచూకీ ఇంకా తెలియ‌లేదు. మ‌రో 18 మంది ఆస్ప‌త్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.

1948 త‌ర్వాత హాంగ్‌కాంగ్‌లో చోటుచేసుకున్న అతిపెద్ద అగ్నిప్ర‌మాద‌మ‌ని అధికార యంత్రాంగం వెల్ల‌డించింది. ఈ ప్ర‌మాదానికి గ‌ల‌ కారణాలు తెలుసుకునేందుకు హాంగ్‌కాంగ్ పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. మంట‌లు ఎలా అంటుకున్నాయ‌నే దాని గురించి అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తు సాగిస్తున్నారు. ఇందుకోసం ఇంటర్ డిపార్ట్‌మెంటల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. నగర అవినీతి నిరోధక నిఘా సంస్థ అగ్నిప్రమాదానికి సంబంధించి 11 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో ముగ్గురిని పోలీసులు హ‌త్యా నేరం పోలీసులు అరెస్ట్ చేశారు.

వెలుగులోకి వీడియో
హాంగ్‌కాంగ్ అగ్నిప్ర‌మాదానికి సంబంధించి సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వెలుగులోకి వ‌చ్చింది. కాల్చి పారేసిన సిగ‌రెట్ వ‌ల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. 'ఆర్టీ ఇండియా' షేర్ చేసిన ఈ వీడియోలో.. వాంగ్ ఫుక్ కోర్టు అపార్టుమెంట్ స‌ముదాయంలో మంటలు చెలరేగడానికి కొన్ని క్షణాల ముందు భవనం బయటి గోడ దగ్గర ఒక కార్మికుడు పొగ తాగుతున్నట్లు కనిపిస్తోంది. అయితే అధికారికంగా హాంగ్‌కాంగ్ పోలీసులు ఇంకా ఎటువంటి నిర్ధార‌ణ‌కు రాలేదు. కాగా, అపార్ట్‌మెంట్‌ కిటికీలకు రక్షణగా బిగించిన స్టీరోఫోమ్‌ ఫ్రేమ్‌లు కూడా మంట‌ల తీవ్ర‌త పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌య్యాయ‌న్న వాద‌న‌లు కూడా విన్పిస్తున్నాయి.

కొన‌సాగుతున్న గాలింపు
వాంగ్‌ ఫుక్‌ కోర్ట్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో ఉన్న ఎనిమిది ట‌వ‌ర్ల‌లో ఏడు పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి. మూడు రోజుల త‌ర్వాత మంట‌లు అదుపులోకి వ‌చ్చాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, పారామెడికల్ స్టాప్‌, వలంటీర్లు అన్వేషణ, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ద‌గ్ధ‌మైన ప్ర‌తి అపార్ట్‌మెంట్‌లోకి అగ్నిమాపక సిబ్బంది టార్చ్‌లైట్లు పట్టుకుని వెళ్లి మృతదేహాల కోసం వెతుకుతున్నారు. మంట‌ల ధాటికి అపార్ట్‌మెంట్ భ‌వ‌నాలు పూర్తిగా దెబ్బ‌తిన‌డంతో వెతుకులాట‌కు ఎక్కువ స‌మ‌యంలో ప‌డుతోంద‌ని పోలీసులు తెలిపారు.

కాలిపోయిన అపార్ట్‌మెంట్‌ల‌లో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు సంబంధించిన ఫొటోలను పోలీసులు మీడియాకు విడుద‌ల చేశారు. మంట‌ల ధాటికి బూడిదగా మారిన వ‌స్తువులు, ధ్వంస‌మైన గోడ‌లు ఈ ఫొటోల్లో క‌నిపించాయి. విపత్తు బాధితుల గుర్తింపు యూనిట్ (DVIU)కు చెందిన వంద‌లాది మంది సిబ్బంది ఈ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నారు. మ‌రోవైపు అగ్నిప్రమాదంతో చనిపోయిన వారికి నివాళులు అర్పించడానికి ఆదివారం హాంకాంగ్ అంతటా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. పుష్పగుచ్ఛాలు ఉంచి క‌న్నీటి నివాళి అర్పించారు.

వాటికి ప్ర‌మాదం లేదు
వాంగ్‌ ఫుక్‌ కోర్ట్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌ను 1,984 ఫ్లాట్‌లతో 1983 సంవత్సరంలో నిర్మించారు. 2021 జనాభా లెక్కల ప్రకారం వీటిల్లో దాదాపు 4,600 మంది నివసిస్తున్నారు. వీరిలో దాదాపు 40 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వృద్ధులేనని తెలుస్తోంది. అగ్నిప్ర‌మాదానికి గురైన 8 అపార్ట్‌మెంట్ బ్లాక్‌లలో ఆరింటిని సర్వే చేశామని, వాటి మొత్తం నిర్మాణానికి "తక్షణ ప్రమాదం లేదు" అని హౌసింగ్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement