వెనిజులా అమెరికా మధ్య ఉద్రిక్తతల్లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో ఫోన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్‌లో మాట్లాడాడని.. అది హాట్‌హాట్‌గా సాగిందని.. పరిస్థితి మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఈ తరుణంలో.. గగనతలం మూసివేత అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది..
వెనిజులా గగనతలం మూసివేయమని ట్రంప్ ప్రకటించారు. అయితే దీనిని వెనిజులా తీవ్రంగా ఖండించింది. ఇది చెల్లదని.. ట్రంప్ ప్రకటన తమ దేశ సార్వభౌమాధికారంపై దాడేనని అభివర్ణించింది. అసలు గగనతలంపై నిషేధం విధించే అధికారం ఎవరికి ఉంటుంది?.. ఎవరు ఎవరిపై విధిస్తారు? దానికంటూ ఏమైనా ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయా? .. ఈ నిర్ణయంతో కలిగే నష్టాలేంటి?.. పరిశీలిస్తే..
గగనతలం మూసివేత అంటే.. ఒక దేశం తన భూభాగం పై ఉన్న ఆకాశాన్ని (airspace) ఇతర దేశాల విమానాలకు పూర్తిగా లేదంటే కొంతవరకు నిషేధించడం. అది పరిస్థితులను బట్టి ఆ దేశం తీసుకుంటుంది. ఒక దేశం భద్రతా కారణాలు, యుద్ధ పరిస్థితులు, రాజకీయ నిరసనల కారణంగా గగనతలాన్ని మూసేసుకోవచ్చు. అప్పుడు ఆ దేశం మీదుగా ఇతర దేశాలకు సంబంధించిన విమానాలేవీ ప్రయాణించకూడదు. కానీ, ట్రంప్ అందుకు భిన్నంగా ఇతర దేశాన్ని(వెనిజులా) ఎయిర్‌స్పేస్‌ని మూసేయాలని ఆదేశించారు. ఒక దేశం మరొక దేశం గగనతలాన్ని మూసివేయమని చెప్పే హక్కు లేదు. దీంతో ఇది చెల్లదని.. కేవలం రాజకీయ ఉద్రిక్తతల్లో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ట్రంప్ ఎందుకు ప్రకటించారు
ట్రంప్ గగనతలం మూసివేతకు చూపిస్తున్న కారణాలు అనేకం ఉన్నాయి. వెనిజులా గగనతలం ద్వారా నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులు డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారాయన. డ్రగ్ ట్రాఫికింగ్‌తో పాటు మానవ అక్రమ రవాణా అరికట్టడం కోసమేనని చెబుతున్నారు. వెనిజులా గగనతలాన్ని పూర్తిగా మూసివేయాలని ఎయిరలైన్స్, పైలట్స్, డ్రగ్ డీలర్స్, హ్యూమన్ ట్రాఫికర్స్‌కు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా కరేబియన్ ప్రాంతంలో భారీ సైనిక దళాలను (ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ సహా) మోహరింపజేశారు.
రూల్స్ ఇవిగో..
ప్రతి దేశానికి తన ఆకాశంపై సార్వభౌమాధికార హక్కు ఉంటుంది. చికాగో కన్వెన్షన్ (1944) అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) ఆధారంగా రూపొందిన ఒప్పందం ఈ విషయంలో ప్రస్తుతానికి అమల్లో ఉంటోంది. ఇందులో భాగంగా..
ఆర్టికల్ 1: ప్రతి దేశానికి తన భూభాగం పై గగనతలంపై పూర్తి సార్వభౌమాధికార హక్కు ఉంటుంది.
ఆర్టికల్ 9: ఒక దేశం భద్రతా కారణాలు, యుద్ధ పరిస్థితులు, అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయవచ్చు.
ఆర్టికల్ 89: యుద్ధం లేదా జాతీయ అత్యవసర పరిస్థితుల్లో, దేశాలు ICAO నిబంధనలను పక్కన పెట్టి తమ గగనతలాన్ని నియంత్రించవచ్చు.
గతంలో..
తమ జాతీయ భద్రతా కారణాల వల్ల గగనతలాన్ని మూసివేయడం సమర్థిస్తాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల సమయంలో తరచూ ఇది చూసిందే. అలాగే.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సమయంలో యూరప్ దేశాలు రష్యా విమానాలకు గగనతలాన్ని మూసివేశాయి. మొన్నీమద్యే ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్-పాక్ నడుమ కూడా ఎయిరోస్పేస్ మూసివేత కనిపించింది. అయితే.. గగనతలం మూసివేతను తాత్కాలిక, అవసరమైన చర్యగా మాత్రమే ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు సమర్థిస్తాయి. విమర్శకులు మాత్రం దీన్ని రాజకీయ ఒత్తిడి సాధనంగా ఉపయోగించడం అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని అంటుంటారు.
ప్రభావం..
తమ గగన తలం నుంచి విమానాలు ప్రయాణించకూడదని ఒక దేశం ఆంక్షలు విధించడం లాంటిదే ఈ నిర్ణయం. దీంతో అంతర్జాతీయ విమానాలు ఆ దేశం మీదుగా ప్రయాణించడానికి వీలుండదు. అవి మార్గం మార్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణాలకు సమయం.. ఇంధన ఖర్చు పెరుగుతాయి. ఫ్లైట్ షెడ్యూల్స్ ఆలస్యం అవుతాయి. అంతర్జాతీయ కనెక్టివిటీలో అంతరాయంతో ప్రయాణికులు ఇబ్బంది పడొచ్చు. అలాగే.. ఆర్థిక నష్టాలకూ అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల వాణిజ్యం, పర్యాటకం దెబ్బతింటాయి.ఎయిర్‌లైన్స్ ఆదాయం తగ్గుతుంది. కొన్నిసార్లు ఇది యుద్ధ ముప్పుగా కూడా మారొచ్చు.
గగనతలం మూసివేత అనేది ఒక దేశం తన సార్వభౌమాధికారాన్ని వినియోగించే చర్య. ఇందుకు చికాగో కన్వెన్షన్ రూల్స్ ఉన్నాయి. కానీ అమెరికా–వెనిజులా ఉద్రిక్తతల్లో ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం. అధికారిక ICAO రూల్స్ ప్రకారం చెల్లుబాటు కాదు. దీని వల్ల విమానయాన రంగం, ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవితం అన్నీ ప్రభావితం అవుతాయనే అందోళన వ్యక్తమవుతోంది.


