బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా చుట్టు ఉచ్చు మరింత బిగుస్తోంది. వరుస కేసులతో.. కఠిన శిక్షలతో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఆమెకు ఊపిరి సలపనివ్వడం లేదు. తాజాగా భారత్‌పైనా సంచలన ఆరోపణలు చేస్తూ ఆమెపై మరో అభియోగం మోపే దిశగా అడుగులు వేస్తోంది.
2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు షేక్ హసీనానే కారణమని.. ఇందులో భారత్ ప్రమేయం కూడా ఉందని ఆరోపిస్తోంది. హసీనా హయాంలో జరిగిన హింసాకాండపై సమగ్ర దర్యాప్తునకు యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త కమిటీ ఈ మేరకు నివేదికను సమర్పించింది. ఈ కమిషన్ ప్యానెల్‌కు రిటైర్డ్ మేజర్ ఏఎల్‌ఎం ఫజ్లుర్ రెహ్మాన్ నేతృత్వం వహిస్తున్నారు.
2009లో షేక్ హసీనా అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే.. బంగ్లాదేశ్ రైఫిల్స్ (BDR) తిరుగుబాటు జరిగింది. ఈ ఘటనలో సీనియర్ ఆర్మీ అధికారులతో సహా 74 మంది మరణించారు. ఫజ్లుర్ కమిషన్ ఆదివారం సమర్పించిన నివేదికలో ఇలా ఉంది.. మాజీ ప్రధాని షేక్ హసీనా తిరుగుబాటుకు "గ్రీన్ సిగ్నల్" ఇచ్చారు. ఆనాడు అవామీ లీగ్ ఎంపీగా ఉన్న ఫజ్లే నూర్ టాపోష్ నేతృత్వంలోనే ఈ దమనకాండ జరిగింది. పైగా ఈ తిరుగుబాటులో "విదేశీ శక్తి" ప్రమేయం స్పష్టంగా కనిపించింది. అది భారతదేశమే. ఆ సమయంలో 921 మంది భారతీయులు బంగ్లాదేశ్‌లోకి చొరబడ్డారు. వాళ్లలో 67 మంది ఎక్కడ ఉన్నారో ఇప్పటికీ తెలియదు అని పేర్కొంది.
హసీనా ప్రభుత్వ హయాంలో బీడీఆర్ తిరుగుబాటుకు సైనిక వేతనాలు, గత ప్రభుత్వంలో వాళ్ల దీనావస్థలే కారణమని ప్రకటించుకుంది. అయితే ఫజ్లుర్ కమిషన్ మాత్రం దానిని అంతర్గత కుట్రగా అభివర్ణించింది. హసీనా ప్రభుత్వం సైన్యాన్ని బలహీనపరచి తన అధికారాన్ని మరింత కాలం కొనసాగించాలనే ఉద్దేశంతో తిరుగుబాటును ప్రోత్సహించిందని పేర్కొంది. ఆమెకు మద్దతుగా భారతదేశం బంగ్లాదేశ్‌లో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించిందని ఆరోపించింది.
ఉద్యోగాల్లో బంగ్లా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్‌ల పెంపు నిర్ణయంతో బంగ్లాదేశ్‌లో కిందటి ఏడాది ఢాకా వర్సిటీ విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి. అయితే ఈ నిరసనలు భద్రతా బలగాల మోహరింపుతో అల్లర్లకు దారి తీశారు. దేశవ్యాప్తంగా జరిగిన ఘర్షణల్లో పలువురు మరణించారు. ప్రభుత్వం కుప్పకూలి తిరుగుబాటు పరిస్థితుల నడుమ ఆమె భారత్‌కు శరణుకోరి వచ్చారు. అటుపై హింసాత్మకంగా ఆందోళనలకు అణచివేశారంటూ ఆమెపై అభియోగాలు నమోదు అయ్యాయి.
ఈ క్రమంలో తాజాగా.. ఆమెకు తీవ్ర నేరాల దృష్ట్యా మరణశిక్ష, అటుపై మరో కేసులో 21 ఏళ్ల జైలు శిక్షా పడింది కూడా. మరోవైపు హసీనాను(ఫ్యూజిటివ్) తమకు వీలైనంత త్వరగా అప్పగించాలంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కోరుతుండగా.. భారత్ మాత్రం తొందరపడబోమని, ఆ అంశాన్ని పరిశీలిస్తామని అంటోంది. తాజా నివేదిక నేపథ్యంలో భారత్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరి భారత్ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.


