నలుగురు మృతి
14 మందికి గాయాలు
స్టాక్‌టన్: అమెరికాలోని కాలిఫోర్నీయా రాష్ట్రం స్టాక్‌టన్‌లో శనివారం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో నలుగురు చనిపోయారు. పద్నాలుగు మంది గాయపడ్డారు. శాన్ జోక్విన్ కౌంటీ పరిధిలోని లూసిల్ అవెన్యూలో ఉన్న బాంక్వెట్ హాల్‌లో సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఓ చిన్నారి బర్త్‌డే వేడుక జరుగుతుండగా అందులో పాల్గొన్న వారిపై విచక్షణారహితంగా ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి పరారైనట్లు స్టాక్‌టన్ వైస్ మేయర్ జాసన్ లీ చెప్పారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నట్లు వివరించారు. దుండగుడి కోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారన్నారు. క్షతగాత్రుల పరిస్థితిని ఆయన వివరించలేదు. కాల్పులకు దారి తీసిన కారణాలు, బాధితుల వివరాలను అధికారులు వెల్లడించలేదు. ఉద్దేశపూర్వకంగానే దుండగుడు కాల్పులు జరిపినట్లుగా భావిస్తున్నామన్నారు. పరారీలో ఉన్న దుండగుడి ఆచూకీ తెలిసిన వారు తమకు వెంటనే సమాచారమివ్వాలని కోరారు.


