‘మస్క్’ను తలదన్నేలా.. కుర్రాళ్ల సరికొత్త ఏఐ మోడల్‌ | Reject Elon Musks Offer Their AI Model Outperforms OpenAI | Sakshi
Sakshi News home page

‘మస్క్’ను తలదన్నేలా.. కుర్రాళ్ల సరికొత్త ఏఐ మోడల్‌

Nov 30 2025 1:34 PM | Updated on Nov 30 2025 1:50 PM

Reject Elon Musks Offer Their AI Model Outperforms OpenAI

మిచిగాన్‌: టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ అందించే మిలియన్ డాలర్ల ఆఫర్‌ను తిరస్కరిస్తూ, అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన ఇద్దరు 22 ఏళ్ల కుర్రాళ్లు తమ విప్లవాత్మక ఏఐ ప్రాజెక్ట్‌ రూపకల్పనకు నడుంబిగించారు. సేపియంట్ ఇంటెలిజెన్స్ సహ వ్యవస్థాపకులైన గువాన్ వాంగ్, విలియం చెన్‌లు ఎలాన్‌ మస్క్‌ను ఢీకొడుతూ మానవ మేధస్సు కంటే తెలివైన ఏఐని సృష్టించే ఉమ్మడి ‘మెటాగోల్స్’తో అనుబంధం ఏర్పరచుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించే మొదటి వ్యక్తులం తామే కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు.  

ఈ కుర్రాళ్లు తొలుత ఓపెన్‌చాట్‌తో విజయం సాధించారు. ఇది అధిక నాణ్యత సంభాషణల క్యూరేటెడ్ సెట్‌పై శిక్షణ పొందిన ఒక భాషా మోడల్ (ఎల్‌ఎల్‌ఏం). సంప్రదాయ ఎల్‌ఎల్‌ఎంల పరిమితులను అధిగమించేలా దీనిని తీర్చిదిద్దారు. వీరు రూపొందించిన ఓపెన్‌చాట్ త్వరగా విద్యా వర్గాలలో దూసుకుపోతోంది.  ఈ మోడల్ ఎలాన్ మస్క్ దృష్టిని సైతం ఆకర్షించింది. దీంతో మస్క్ తన కంపెనీ ఎక్స్‌ ఏఐ ద్వారా ఆ కుర్రాళ్లను సంప్రదించి, మిలియన్ డాలర్ల ఆఫర్‌ను ఇచ్చారు. అయితే దీనిని చెన్, వాంగ్ తిరస్కరించారు.

మస్క్ ఆఫర్‌ను తిరస్కరించిన తర్వాత వారు హైరార్కికల్ రీజనింగ్ మోడల్ (హెచ్‌ఆర్‌ఎం)ను సృష్టించేందుకు సేపియంట్ ఇంటెలిజెన్స్‌ను స్థాపించారు. ఈ హచ్‌ఆర్‌ఎం  మోడల్ కేవలం 27 మిలియన్ పారామితులతో కూడిన ప్రోటోటైప్ అయినప్పటికీ, అబ్‌స్ట్రాక్ట్ రీజనింగ్‌ను కొలిచే సంక్లిష్టమైన పనులైన సుడోకు పజిల్స్, ఏఆర్‌సీ-ఏజీఐ  బెంచ్‌మార్క్‌తో సహా ఓపెన్‌ ఏఐ, ఆంత్రోపిక్, డీప్‌సీక్ లాంటి ప్రధాన ఏఐ వ్యవస్థలను అధిగమించింది.

ఈ కుర్రాళ్లు రూపొందిస్తున్న హెచ్‌ఆర్‌ఎం.. గణాంకపరంగా తదుపరి పదాన్ని అంచనా వేసే సాంప్రదాయ ట్రాన్స్‌ఫార్మర్‌ల మాదిరిగా కాకుండా, మానవ ఆలోచనను అనుకరించే రెండు-భాగాల పునరావృత నిర్మాణాన్ని ఉపయోగిస్తుంది. ఇది ఉద్దేశపూర్వక తార్కికతను వేగవంతమైన రిఫ్లెక్సివ్ ప్రతిస్పందనలతో కలుపుతుంది. ఇది ఊహించడం కాదని, ఆలోచించడం అని, ఫలితంగా తమ మోడళ్లు సాంప్రదాయ ఎల్‌ఎల్‌ఎంల కంటే చాలా తక్కువగా భ్రాంతులు కలిగి ఉంటాయని ఆ కుర్రాళ్లు చెబుతున్నారు.  వాతావరణ అంచనా, వ్యాపారం తదితర రంగాలలో ఇప్పటికే వీరి ప్రయోగాలు విజయవంతయ్యాయి.

ఇది కూడా చదవండి: చాట్‌ జీపీటీకి మూడేళ్లు.. ఏం సాధించిందంటే..

Advertisement
 
Advertisement
Advertisement