భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) వివాహం ఊహించని పరిణామంతో వాయిదా పడింది. ప్రియుడు, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన వేళ.. ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యం పాలయ్యారు. గుండెపోటు లక్షణాలతో సాంగ్లీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.
స్మృతి- పలాష్ పెళ్లి నిరవధికంగా వాయిదా
ఈ నేపథ్యంలో తండ్రి చూడని వేడుక తనకు వద్దంటూ స్మృతి.. పలాష్‌తో పెళ్లిని వాయిదా వేసుకుందని ఆమె మేనేజర్ మీడియాకు చెప్పారు. ఓవైపు తండ్రి విషయంలో స్మృతి ఆందోళన చెందుతుండగా.. మరోవైపు.. ఆమెకు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా ఆస్పత్రిపాలయ్యాడు. వైరల్ ఇన్‌ఫెక్షన్, ఎసిడిటీతో అతడు ముంబైలోని గోరేగావ్ ఆస్పత్రిలో చేరాడు.
వరుస మ్యూజిక్ కన్సర్టులు, పెళ్లి పనుల కారణంగానే పలాష్ ముచ్చల్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని.. అందుకే అతడి ఆరోగ్యం చెడిపోయిందని ఎన్‌డీటీవీకి అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, స్మృతి- పలాష్ పెళ్లి నిరవధికంగా వాయిదా పడటంపై సోషల్ మీడియాలో ఊహించని విధంగా వదంతులు పుట్టుకువచ్చాయి. ఇరు కుటుంబాల మధ్య సఖ్యత చెడిందా అనేలా గాసిప్‌రాయుళ్లు పుకార్లు పుట్టిస్తున్నారు.

స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు
ఈ నేపథ్యంలో పలాష్ ముచ్చల్ తల్లి అమిత.. ట్రోల్స్‌కు దిమ్మతిగిరేలా కౌంటర్ ఇచ్చారు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘స్మృతి తండ్రి అంటే పలాష్‌కు ఎంతో ఇష్టం. స్మృతి కంటే ఆమె తండ్రి దగ్గరే పలాష్‌కు సాన్నిహిత్యం ఎక్కువ.
ఆయన అనారోగ్యం బారిన పడ్డారని తెలియగానే.. స్మృతి కంటే ముందు పలాష్ స్పందించాడు. తనే పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు. స్మృతి తండ్రి కోలుకునేంత వరకు వివాహ వేడుకను వాయిదా వేయాలని చెప్పాడు.
తీవ్రమైన ఒత్తిడి
హల్దీ తర్వాత పలాష్‌ను బయటకు ఎక్కడికీ పంపలేదు. స్మృతి తండ్రికి ఛాతీ నొప్పి వచ్చిందని తెలియగానే పలాష్ చాలా సేపు ఏడుస్తూనే ఉన్నాడు. దీంతో అతడి ఆరోగ్యం కూడా పాడైంది. ఆస్పత్రిలోనే నాలుగు గంటల సేపు ఉంచారు. ఐవీ డ్రిప్ పెట్టారు. ఈసీజీ తీశారు. ఇతరత్రా పరీక్షలు కూడా చేశారు. అన్ని రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయి.
అయితే, ఇప్పటికీ ఒత్తిడి నుంచి బయటపడలేకపోతున్నాడు’’ అని పలాష్ ముచ్చల్ తల్లి అమితా ముచ్చల్ తెలిపారు. కాగా పలాష్ అక్క, బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ కూడా తన సోదరుడి వివాహం గురించి స్పందించారు. స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగానే పెళ్లి వాయిదా పడిందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో తమ గోప్యతకు భంగం కలిగించవద్దని కోరారు.
చదవండి: పీవీ సింధు ఫిట్‌నెస్‌పై సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్యలు


