కాలేజీ లెక్చరర్ల వేధింపులు.. ఇంటర్ విద్యార్థిని బలి | Inter College Student Varshini Death In Malkajgiri | Sakshi
Sakshi News home page

కాలేజీ లెక్చరర్ల వేధింపులు.. ఇంటర్ విద్యార్థిని బలి

Jan 9 2026 4:38 PM | Updated on Jan 9 2026 4:43 PM

Inter College Student Varshini Death In Malkajgiri

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో దారుణ ఘటన వెలుగుచూసింది. క్రమశిక్షణ పేరుతో ఓ విద్యార్థిని పట్ల లెక్చరర్‌ అనుచితంగా ప్రవర్తించింది. తోటి విద్యార్థుల ముందే తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. దీంతో, తీవ్ర మనస్థాపానికి, మానసిక వేదనకు గురైన విద్యార్థిని అనూహ్యంగా అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాజ్‌గిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వెస్ట్‌ మారేడుపల్లికి చెందిన విద్యార్థిని వర్షిణి (17) ఇంటర్‌ చదువుతోంది. అయితే, వర్షిణి (Varshini) ఒక రోజు కాలేజీకి కొంచెం ఆలస్యంగా వచ్చింది. అదే సాకుగా తీసుకున్న లెక్చరర్లు శ్రీలక్ష్మి (Sri Lakshmi), మధురిమ (Madhurima)లు ఆమెను తోటి విద్యార్థుల ముందు నిలబెట్టి దూషించారు. కాగా, వర్షిణి తనకు నెలసరి రావడం వల్ల ఆలస్యం అయిందని చెప్పింది. పీరియడ్స్ వచ్చాయా? నాటకాలు ఆడుతున్నావా.. ఏది చూపించు? అంటూ అత్యంత అసభ్యకరంగా, జుగుప్సాకరంగా మాట్లాడారు. దీంతో, తోటి విద్యార్థులు ముందు ఇలా చేయడం పట్ల వర్షిణి తట్టులేకపోయింది. దీంతో, వర్షిణి  మానసికంగా కుంగిపోయింది. ఇంటికి వెళ్లి తల్లితో విషయం చెప్పి ఏడ్చింది. అయితే తల్లి ఓదార్చి తర్వాత వెళ్లి మాట్లాడదామని తల్లి కుమార్తెను సముదాయించింది.

ఇంతలోనే విద్యార్థినికి తలనొప్పి రావడంతో స్పృహ తప్పి కింద పడిపోయింది. దీంతో, వర్షిణిని వెంటనే మల్కాజ్‌గిరి ఆసుపత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అక్కడ  సిటీ స్కాన్ చేయించారు. విద్యార్థిని ఎడమ చేయి, కాలు కూడా పనిచేయడం మానేశాయి. స్కానింగ్ చేసిన వైద్యులు.. తీవ్ర మనస్తాపానికి గురికావడంతో బ్రెయిన్‌లో రక్తం గడ్డ కట్టిందని చెప్పారు. అనంతరం అదే రాత్రి బాలిక మృతి చెందింది. వర్షిణి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. లెక్కరర్లు చేసిన ఓవరాక్షన్‌ వల్లే తమ కూతురు ఇలా చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం ఉదయం కళాశాల ముందు ఆమె తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. వెంటనే సదరు లెక్చరర్స్, ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement