చేలు.. ఏఐ మేలు | India AI Impact Summit 2026 Revolutionizes Agriculture | Sakshi
Sakshi News home page

చేలు.. ఏఐ మేలు

Feb 27 2026 5:27 AM | Updated on Feb 27 2026 5:27 AM

India AI Impact Summit 2026 Revolutionizes Agriculture

ఇండియా–ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో 26 ఉత్తమ ఏఐ ఆవిష్కరణలు

ఢిల్లీలో ఇటీవల జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో భాగంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఉపకరించే ఏఐ ఆధారిత సాంకేతికతలపై వెలువడిన సంకలనం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏఐ–అగ్రిటెక్‌ ఇన్నోవేషన్‌ సెంటర్, వాధ్వానీ ఏఐ, ప్రపంచ బ్యాంకు, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) సహకారంతో రూపొందిన ఈ సంకలనంలో 13 దేశాల్లో వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న 260 ఆవిష్కరణల్లోంచి 26 ఉత్తమ ఏఐ వ్యవసాయ ఆవిష్కరణలను పొందుపరిచారు. రైతులకు వ్యవసాయ సూచనలు ఇచ్చేందుకు 13 ఏఐ సాంకేతికతలు, కోత అనంతరం, ట్రేసబిలిటీ, మార్కెట్‌ అవకాశాలపై 4, రుణ పరపతికి సంబంధించినవి 2, కార్బన్‌ మార్కెట్లపై 2, మరో 5 అభివృద్ధి దశలో ఉన్న ఏఐ సాంకేతికతల గురించి ఇందులో వివరించారు.

కొన్ని ఏఐ వ్యవసాయ సాంకేతికతలు.. వాటి పనితీరు ఇలా..
మహారాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ‘మహా విస్తార్‌’ మొబైల్‌ అప్లికేషన్లు, వెబ్‌ ప్లాట్‌ఫామ్స్, వాయిస్‌ బేస్డ్‌ సరీ్వసులను రైతులకు అందిస్తోంది. పంటల సాగు, పశువులు/ కోళ్లు/ చేపల రైతులకు అవసరమయ్యే అన్ని సేవలను స్థానిక భాషలో అందిస్తూ బహుళ ప్రాచుర్యం పొందింది. ఈ యాప్‌ను ఇప్పటికే 22 లక్షల రైతులు డౌన్‌లోడ్‌ చేసుకొని వాడుతున్నారు. రైతులు అడిగిన 15 లక్షల ప్రశ్నలకు ఏఐ సహకారంతో జవాబులు ఇచ్చారు.

 డిజిటల్‌ జ్ఞానం తక్కువగా ఉండే చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే త్రీ–ఇన్‌–వన్‌ ఏఐ డిజిటల్‌ వ్యవస్థ ‘ఫామ్‌బెటర్‌’. కెన్యా రూపొందించగా ఆఫ్రికా దేశాల రైతులు వాడుతున్నారు. 30% వరకు దిగుబడి పెరిగింది. 15% వరకు కోత అనంతర నష్టాలు తగ్గాయి.  
 తెలంగాణలో విత్తనోత్పత్తి రైతులకు ఉపయోగపడుతున్న ఏఐ ఆధారిత సీడ్‌ ఇంటెలిజెన్స్‌ డాష్‌బోర్డ్‌ వ్యవస్థ ‘సీడ్‌వర్క్స్‌ కోపైలట్‌’. దీని ద్వారా 8 వేల హైబ్రిడ్‌ వరి విత్తన రైతులు లబ్ధి పొందారు.


 17 ఏళ్ల అనుభవంగల డిజిటల్‌ గ్రీన్‌ సంస్థ రూపొందించిన ఏఐ అడ్వైజరీ ప్లాట్‌ఫామ్‌ ‘ఫార్మర్‌చాట్‌’. 4 లక్షల మంది భారతీయ రైతులతోపాటు కెన్యా, నైజీరియా, ఇథియోపియా, బ్రెజిల్‌ రైతులు వాడుతున్నారు. దీని సాయంతో రైతులకు వ్యవసాయ విస్తరణ వ్యయం 35 డాలర్ల నుంచి ఒక డాలర్‌కు తగ్గింది. 
 కాలిఫోర్నియా (అమెరికా)కు చెందిన ‘స్పోర్‌కామ్‌’గాలిలోని క్రిములను కనిపెట్టి రానున్న చీడపీడల గురించి రైతులకు ముందస్తు సూచనలిస్తుంది. 4 కోట్ల ఎకరాల్లో వాడుతున్నారు.

 తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో 1.2 కోట్ల మంది రైతులకు డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ‘ఫీల్డ్‌వైజ్‌’ఏఐ సేవలందిస్తోంది. ప్రభుత్వ పథకాల అమలుకు కూడా దోహదపడుతోంది. 
 పశువుల మెడలో సెన్సార్‌ను అమర్చడం ద్వారా జబ్బులను ముందే పసిగట్టేందుకు ‘కౌ నెక్లెస్‌ సెన్సార్స్‌’సంస్థ ఏఐ సేవలందిస్తోంది.  

 గుజరాత్‌కు చెందిన పరేఖ్‌ అగ్రిటెక్‌ ప్లాట్‌ఫామ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ సేవలందిస్తోంది. రైతులు తమ ధాన్యానికి 5% నుంచి 7% అధిక ధర పొందుతున్నారు.  
 పండ్ల నాణ్యతను గుర్తించి గ్రేడింగ్‌ చెయ్యడంలో 95% కచ్చితత్వంతో ఏఐ ఆధారిత పరికరం పంజాబ్‌ రైతులకు సేవలందిస్తోంది.  
 సింగపూర్‌కు చెందిన ‘టీఆర్‌ఎస్‌టీ01’సంస్థ దక్షిణాసియా దేశాల్లోని లక్షన్నర మంది రైతులకు ట్రేసబిలిటీ సేవలందిస్తోంది.  

 ‘ఖేత్‌స్కోర్‌’సంస్థ రైతు పరపతి సామర్థ్యాన్ని తెలియజెప్పే స్కోర్‌ను అందిస్తోంది. ఈ స్కోర్‌ ఆధారంగా రైతులు సులువుగా రుణాలు పొందవచ్చు.  
 గులాబి పురుగు నుంచి పత్తిని కాపాడే ఏఐ స్మార్ట్‌ ఫెరమోన్‌ ట్రాప్‌ టెక్నాలజీని జాతీయ పత్తి పరిశోధనా సంస్థ రూపొందించింది. దీని సాయంతో 39% పురుగుమందుల వాడకం తగ్గింది. 18% దిగుబడి పెరిగింది.  

 ఐసీఏఆర్‌ రూపొందించిన ఏఐ ఆధారిత సాయిల్‌ టెస్టింగ్‌ వ్యవస్థ ‘వసుధ’. 
 ద్రాక్ష తదితర పండ్ల తోటల్లో పురుగుమందుల పిచికారీ చేసుకోవడానికి ఉపయోగపడే ఏఐ ఆధారిత ‘ఫామ్‌ గార్డియన్‌ రోవర్‌’వ్యవస్థ మహారాష్ట్రలో వినియోగిస్తున్నారు.

దేశంలో 86% మంది చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడేలా రూపొందించిన మొబైల్‌ యాప్‌ ఆల్ట్‌ కార్బన్‌. నేలలోని 25 స్థూల, సూక్ష్మ పోషకాల స్థాయిని, వాతావరణ పరిస్థితులను మిళితం చేసి రైతులకు స్పష్టమైన సూచనలు చేసే విలక్షణ యాప్‌ ఇది. పశ్చిమ బెంగాల్‌లో 2,847 మంది వరి, తేయాకు రైతులు దీన్ని వాడటం ద్వారా 18% ఎరువుల వాడకం తగ్గించుకొని 20% నుంచి 32% మేరు దిగుబడి పెంచుకున్నారు.  

ఏఐతో సాగుకు సాయం...
వ్యవసాయ సంబంధ నిర్ణయాలు తీసుకోవడంలో, ఒడిదుడుకులను తట్టుకుంటూ దిగుబడులను పెంచుకోవడంలో కృత్రిమ మేధ దోహదపడుతోంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, రైతులతో కలసి ఆచరణాత్మక శాస్త్రీయ దృష్టితో రూపొందించే ఏఐ వ్యవస్థలు ప్రయోజనకరమైన డిజిటల్‌ సూచనలను అందించగలుగుతున్నాయి. కానీ సంప్రదాయ వ్యవసాయ విజ్ఞానానికి ఏఐ ప్రత్యామ్నాయం కాదు. ఈ సాంకేతికతలను సక్రమంగా అమలు చేస్తే వాతావరణ మార్పులను, ఒడిదుడుకులను తట్టుకునేందుకు దోహదపడతాయి. – డాక్టర్‌ ఎం.ఎల్‌. జాట్, ఐసీఏఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement