నిర్లక్ష్యం, కుట్రకోణంలోనూ దర్యాప్తు  | CID to probe foul play, negligence angles, accepts Rohit Pawar statement | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం, కుట్రకోణంలోనూ దర్యాప్తు 

Feb 27 2026 3:59 AM | Updated on Feb 27 2026 3:59 AM

CID to probe foul play, negligence angles, accepts Rohit Pawar statement

బారామతి విమాన ప్రమాద ఘటనపై 
మహారాష్ట్ర సీఐడీ వెల్లడి 
    మంత్రి రామ్మోహన్‌ నాయుడు 
    రాజీనామాకు ఎన్‌సీపీ (ఎస్‌పీ) డిమాండ్‌

పుణె/ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ప్రాణాలను బలి తీసుకున్న బారామతి విమాన ప్రమాదం ఘటనలో ప్రధానంగా నిర్లక్ష్యం, కుట్ర కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ) గురువారం తెలిపింది. జనవరి 28న జరిగిన విమాన ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులకు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎస్‌పీ) ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ తన వాంగ్మూలమిచ్చారు. 

ఆ ప్రమాదం జరిగిన పరిస్థితులను ఆయన మొదటి నుంచీ ప్రశి్నస్తున్నారు. వీఎస్‌ఆర్‌ సంస్థ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే అంశం గురువారం రాష్ట్ర శాసన మండలిలోనూ ప్రస్తావనకు వచ్చింది. ప్రమాద ఘటనకు దారి తీసిన అన్ని అంశాలను సభ ముందుంచాలని ప్రభుత్వానికి కౌన్సిల్‌ చైర్మన్‌ సూచించారు. ఈ నేపథ్యంలో సీఐడీ అదనపు డీజీపీ సునీల్‌ రామానంద్‌ మీడియాతో మాట్లాడారు. 

బారామతి విషాద ఘటనపై శాస్త్రీయ పద్ధతిలో సవివరమైన దర్యాప్తు జరుగుతోందని వివరించారు. ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా లేక నేరపూరిత నిర్లక్ష్యం దాగుందా అనేది తేలుస్తామని చెప్పారు. ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాసిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో(ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక అందాక ఆ వివరాలను కూడా చేరుస్తామని వివరించారు. నేర పూరిత కోణం దాగుంటే కేసు నమోదు చేస్తామని కూడా ఆయన అన్నారు. 

ఇలా ఉండగా, అజిత్‌ పవార్‌ అన్న కుమారుడు రోహిత్‌ పవార్‌ గురువారం పుణెలో సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అధికారులకు తన వాంగ్మూలం ఇచ్చారు. వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌పై కేసు నమోదు చేయాలని సీబీఐ అధికారులను కోరినట్లు అనంతరం ఆయన మీడియాకు వెల్లడించారు. వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌కు చెందిన విమానాలను నిలిపివేయాలంటూ మంగళవారం డీజీసీఏ ఆదేశాలిచ్చిన అంశంపై సీఐడీ మౌనంగా ఉండటంపై అనుమానం వ్యక్తం చేశారు. 

అజిత్‌ పవార్‌ తదితరుల మృతికి కారణమైన లేజర్‌జెట్‌ 45 విమానం వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌ కంపెనీదేనని ఆయన చెప్పారు. ఈ కంపెనీకి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార టీడీపీతో సంబంధాలున్నాయని ఆరోపించారు. ప్రమాదానికి బాధ్యత వహిస్తూ టీడీపీకే చెందిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు రాజీనామా చేయాలని రోహిత్‌ పవార్‌ డిమాండ్‌ చేశారు. రోహిత్‌ పవార్, మరో నేత యోగేంద్ర పవార్‌తో కలిసి వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌పై బారామతి తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీఎస్‌ఆర్‌ వెంచర్స్, ఆ సంస్థ డైరెక్టర్లపై బుధవారం ఆయన ముంబైలోని మెరైన్‌ డ్రైవ్‌ పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement