వీఎస్‌ఆర్‌ వెనుక హెరిటేజ్‌! | Chandrababu family Heritage Finlease behind VSR aircraft | Sakshi
Sakshi News home page

వీఎస్‌ఆర్‌ వెనుక హెరిటేజ్‌!

Feb 23 2026 5:09 AM | Updated on Feb 23 2026 5:09 AM

Chandrababu family Heritage Finlease behind VSR aircraft

వీఎస్‌ఆర్‌ విమానం

టీడీపీ మౌనంతో అందరిలోనూ మరింతగా అనుమానం

అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదంలో మృతి వెనుక శక్తులపై రోహిత్‌ పవార్‌ ఆరోపణలు 

రూ.35 కోట్ల విలువయ్యే విమానానికి రూ.265 కోట్ల ఇన్సూరెన్స్‌ ఎందుకు చేశారు? 

విమానంలో టాయ్‌లెట్‌ వెనుక పెట్రోల్‌ క్యాన్లు ఎందుకు పెట్టారు? 

ట్యాంకులో సామర్థ్యానికి మించి ఎందుకు ఫ్యూయల్‌ నింపారు? 

ప్రమాదంలో బ్లాక్‌ బాక్స్‌ కాలిపోవడమేంటి?ఎంత వరకు నిజం? 

ఏ విచారణ జరక్క ముందే వీఎస్‌ఆర్‌కు టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి క్లీన్‌చిట్‌ ఎలా ఇచ్చారు? 

ఎందుకంటే వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌ విమానాల కొనుగోలుకు నిధులిచ్చింది హెరిటేజ్‌ ఫిన్‌లీజ్‌ కాబట్టే 

హెరిటేజ్‌ ఫిన్‌లీజ్‌ అనేది సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ 

వీఎస్‌ఆర్‌ ద్వారా దుబాయ్‌లో రూ.650 కోట్లతో టీడీపీ కీలక నేత లెగసీ విమానం కొనుగోలు 

ఇదే వీఎస్‌ఆర్‌ విమానాల్లో సీఎం చంద్రబాబు కుటుంబం చక్కర్లు 

అందుకే కేంద్ర మంత్రి రామ్మోహన్‌ దర్యాప్తు సాగనివ్వడం లేదన్న రోహిత్‌ 

రోహిత్‌ వ్యాఖ్యల్లో నిజం ఉండటం వల్లే టీడీపీ, హెరిటేజ్‌ నోరు విప్పడం లేదంటున్న విశ్లేషకులు

సాక్షి, అమరావతి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదంపై ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ తెలుగుదేశం పారీ్టపై అనేక అనుమానాలను లేవనెత్తి 36 గంటలు దాటినా ఆ పార్టీ నోరు మెదపడం లేదు. వీఎస్‌ఆర్‌ విమానయాన సంస్థ విమానాల కొనుగోళ్లకు హెరిటేజ్‌ సంస్థ వందల కోట్ల రూపాయలు నిధులు సమకూర్చిందంటూ సాక్ష్యాధారాలతో చూపించినా.. స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన కంపెనీ అయ్యి ఉండి కూడా ఇంత వరకు స్పందనే లేదు. అజిత్‌ పవార్‌ మరణం వెనుక పెద్ద కుట్ర ఉందంటూ రోహిత్‌ పవార్‌ చేసిన ఆరోపణలపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా టీడీపీ నేతలు కానీ, హెరిటేజ్‌ సంస్థ కానీ స్పందించక పోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

సీఎం చంద్రబాబు నామినేట్‌ చేసిన కె.రామ్మోహన్‌నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేస్తేనే విచారణ పారదర్శకంగా జరుగుతుందంటూ రోహిత్‌ పవార్‌ చేసిన డిమాండ్‌ సహేతుకమైనదేనని స్పష్టం చేస్తున్నారు. నైతికతకు కట్టుబడి రామ్మోహన్‌నాయుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయక పోవడాన్ని తప్పు పడుతున్నారు. నేరుగా తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మిణల ఫోటోలను ప్రదర్శిస్తూ రోహిత్‌ పవార్‌ తీవ్ర ఆరోపణలు చేసినా, పార్టీ స్పందించక పోవడంపై ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌తో హెరిటేజ్‌ ఫిన్‌లీజ్‌ 2023లో కుదుర్చుకున్న ఒప్పందం గురించి రోహిత్‌ మీడియాకు పూసగుచ్చినట్లు వివరించిన విషయం తెలిసిందే. 

ఈ ప్రశ్నలకు బదులేదీ? 
– రూ.35 కోట్ల విలువయ్యే విమానానికి రూ.265 కోట్ల ఇన్సూయరెన్స్‌ ఎందుకు చేశారు? వాస్తవానికి ప్రమాదానికి గురైన అజిత్‌ పవార్‌ ప్రయాణిస్తున్న విమానం పాతది కావడంతో మార్కెట్‌లో రూ.15–20 కోట్లు కూడా చేయదని నిపుణులు చెబుతున్నారు. మరి ఏ ఉద్దేశంతో అన్ని రెట్లు ఎక్కువ విలువతో ఇన్సూయరెన్స్‌ చేశారు? 

– విమానంలో టాయ్‌లెట్‌ వెనుక పెట్రోల్‌ క్యాన్లు ఎందుకు పెట్టారు? ఒక వీవీఐపీ ప్రయాణిస్తున్న విమానంలో పెట్రోల్‌ క్యాన్‌లు ఎలా వచ్చాయి? మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రయాణించే ఆ విమానం బయలుదేరే ముందు ఆ విమాన సిబ్బంది ఎవరూ వాటిని గమనించలేదా? అసలవి అక్కడికి ఎలా వచ్చాయి? విమానంలో పెట్రోల్‌ క్యాన్‌లను ఉంచడమనేది విస్తుగొలుపుతోంది.  

– ట్యాంకులో సామర్థ్యానికి మించి ఎందుకు ఫ్యూయల్‌ నింపారు? ఏ విమానానికి ఎంత మేర ఇంధనం నింపాలనేది డీజీసీఏ నిబంధనల్లో కీలకం. వాటిని పాటించకుండా ఆ విమానంలో సామర్థ్యానికి మించి ఇంధనం నింపడంలో ఉద్దేశం ఏమిటి? సామర్థ్యానికి మించి విమానాల్లో ఇంధనం నింపితే ఎంతటి ప్రమాదమో వారికి తెలియదా? 

– ఎంత వేడినైనా తట్టుకునే బ్లాక్‌ బాక్స్‌ ప్రమాదంలో కాలిపోవడమేంటి? ఏదైనా విమాన ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు.. ఆ ప్రమాదం తాలూకు గుట్టు విప్పేదే బ్లాక్‌ బాక్స్‌. ప్రమాదానికి ముందు విమాన పైలట్ల మాటలన్నీ ఇందులో రికార్డు అయి ఉంటాయి. వాటి ద్వారా ప్రమాదానికి గల కారణాలపై ఒక అంచనాకు రావచ్చు. అందుకే ఇంత కీలకమైన బ్లాక్‌ బాక్స్‌ను అత్యున్నత ప్రమాణాలతో తయారు చేస్తారు. ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగినా ఈ బ్లాక్‌ బాక్స్‌ దెబ్బ తినకుండా ఉండటమే దీని ప్రత్యేకత. ఎంత వేడినైనా, మంచునైనా తట్టుకునే సామర్థ్యం దీనికి ఉంటుంది. అలాంటి బ్లాక్‌ బాక్స్‌ ఈ ప్రమాదంలో కాలిపోయిందని చెప్పడం ఎంత వరకు నిజం? తద్వారా ఏదో దాస్తున్నారని, నిజాన్ని సమాధి చేస్తున్నారని ఇట్టే తెలియడం లేదా? 

– ఏ విచారణ జరక్క ముందే వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఎలా క్లీన్‌ చిట్‌ ఇచ్చారు? ఒక విమాన ప్రమాదం జరిగిన తర్వాత వివిధ కోణాల్లో దర్యాప్తు జరుగుతుంది. వివిధ శాఖలు దర్యాప్తులో భాగమవుతాయి. అందునా ఆ విమాన ప్రమాదంలో మృతి చెందింది మామూలు వ్యక్తి కాదు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం. ఈ క్రమంలో ఒక కేంద్ర మంత్రిగా అత్యంత బాధ్యతాయుత స్థానంలో ఉన్న టీడీపీ నేత రామ్మోహన్‌ నాయుడు.. ఆ విమానయాన కంపెనీ వీఎస్‌ఆర్‌ తప్పు లేదని ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారు? ఏ ఆధారంతో ఆయన ఈ ప్రకటన చేశారు? అంటే దర్యాప్తు సంస్థ ఆయన ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని చెప్పడం కాదా? ఎందుకోసం ఇలా తొందరపాటుతో ప్రకటన చేశారు? ఎవరి కోసం చేశారు? వీఎస్‌ఆర్‌ను ఎందుకు వెనకేసుకొస్తున్నారు? 

రోహిత్‌ డిమాండ్లన్నీ సహేతుకమే అంటున్న విశ్లేషకులు 
– విమాన ప్రమాదంలో ఒక రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి చనిపోతే ఇంత వరకు వీఎస్‌ఆర్‌ సంస్థ యజమాని వీకే సింగ్‌ను అరెస్ట్‌ చేయలేదని, డైరెక్టర్లు విదేశాలకు పారిపోవడానికి సహకరించారని, దీని వెనుక రామ్మోహన్‌ నాయుడు ఉన్నారంటూ రోహిత్‌ పవార్‌ తీవ్ర ఆరోపణలే చేశారు. రూ.35 కోట్ల విలువైన విమానానికి రూ.265 కోట్ల బీమా చేయించడం, టాయిలెట్‌ వెనుక లగేజ్‌ పెట్టే ప్రాంతంలో పెట్రోల్‌ క్యాన్‌లను ఉంచడం, విమానంలో సామర్థ్యానికి మించి ఫ్యూయల్‌ నింపడం, ప్రమాదం తర్వాత తీవ్ర పేళ్లుళ్లు జరగడం, 1,100 డిగ్రీల వేడిలో ఉన్నా కాలిపోవడానికి అవకాశం లేని బ్లాక్‌ బాక్స్‌ కాలిపోయిందని చెప్పడం.. ఇవన్నీ చూస్తుంటే ఇందులో కుట్ర ఉన్నదని రోహిత్‌ పవార్‌ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని విమానయాన రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  

– సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌ ఫిన్‌లీజ్‌ వీఎస్‌ఆర్‌ సంస్థకు రూ.వందల కోట్లలో ఫండింగ్‌ చేయడం, కంపెనీ వెనుక టీడీపీ కీలక నేతలు ఉండటం వల్లే 2016లో కేవలం రూ.10 కోట్ల టర్నోవర్‌తో ఉన్న వీఎస్‌ఆర్‌ కంపెనీ ఇప్పుడు రూ.500 కోట్లకు చేరుకుందని రోహిత్‌ ఆధారాలతో చెబుతుంటే టీడీపీ నేతలు, హెరిటేజ్‌ సంబంధికులు ఎందుకు బదులివ్వడం లేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. 
 
– వీఆర్‌ఎస్‌ను వెనకేసుకు రావడానికి టీడీపీ ముఖ్యులు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలే కారణమని, అందువల్లే తక్షణం ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి, ఈ ప్రమాదంపై కుట్ర కోణంలో దర్యాప్తు జరిపించాలని రోహిత్‌ పవార్‌ డిమాండ్‌ చేయడం సహేతుకమేనని.. ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.  

విమానాల కొనుగోళ్లకు టీడీపీ నిధులు 
వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌ విమానాల కోనుగోళ్లకు హెరిటేజ్‌ సంస్థతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కూడా నేరుగా నిధులు సమకూర్చినట్లు రోహిత్‌ పవార్‌ ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ అనుబంధ సంస్థ హెరిటేజ్‌ ఫిన్‌లీజ్‌ ద్వారా వీఆర్‌ఎస్‌కు రూ.200 నుంచి రూ.300 కోట్ల వరకు ఫండింగ్‌ జరిగినట్లు తమకు సమాచారం ఉందంటూ రోహిత్‌ ఆరోపించారు. టీడీపీకి చెందిన కీలక వ్యక్తి రూ.650 కోట్లతో దుబాయ్‌లో వీఆర్‌ఎస్‌ ద్వారా లెగసీ విమానం కొనుగోలు చేశారని.. దాన్ని దుబాయ్‌లో పార్క్‌ చేశారని,   ఏడాది క్రితం రాజస్తాన్‌లో జరిగిన వీఎస్‌ఆర్‌ కంపెనీ డైరెక్టర్‌ రోహిత్‌ సింగ్‌ ఫంక్షన్‌కు టీడీపీలోని ప్రముఖ నేతలు హాజరయ్యారని, ఇలా ఒకటి, రెండు కాదు..అనేక ఆర్థిక పరమైన వ్యవహారాలు వీఎస్‌ఆర్‌–టీడీపీ నేతల మధ్య ఉన్న విషయాన్ని రోహిత్‌ పవార్‌ బహిరంగ పరిచారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో విమానాలు కొనుగోలు చేసిందెవరని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడుకు కూడా వీఎస్‌ఆర్‌ కంపెనీతో సన్నిహిత సంబంధాలున్నాయని, అందువల్లే దర్యాప్తు పూర్తి కాకుండానే ఆ కంపెనీకి క్లీన్‌ చిట్‌ ఇస్తూ మాట్లాడటమే కాకుండా ఉద్దేశ పూర్వకంగా దర్యాప్తును ఆలస్యం చేస్తున్నారని రోహిత్‌ ఎత్తి చూపారు. తక్షణమే రామ్మోహన్‌ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.  

ఆ విమానాల్లోనే తిరుగుతున్న బాబు కుటుంబం 
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక నారా కుటుంబమంతా ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొడుతుండటం తెలిసిందే. ఈ విమానాలన్నీ వీఎస్‌ఆర్‌ ఏవియేషన్‌ సమకూరుస్తున్నవే. ఇదే విషయాన్ని ఏఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ డేటాను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఆయన కుటుంబంహైదరాబాద్, ఢిల్లీ, పూణే, బెంగళూరు ఇలా ఎక్కడకు వెళ్లాలన్నా వీఎస్‌ఆర్‌ విమాన సర్వీసులనే వినియోగిస్తున్నారు.  

వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌..  
వీఎస్సార్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చార్టర్‌ ఫ్లైట్‌ కంపెనీ. 2011లో ఢిల్లీ కేంద్రంగా ఈ సంస్థను విజయ్‌ కుమార్‌ సింగ్‌ (వీకే సింగ్‌) స్థాపించారు. ఆయన కుమారుడు రోహిత్‌ సింగ్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. 2014లో నాన్‌ షెడ్యూల్డ్‌ విమాన సర్వీసులను నడపడానికి అనుమతి లభించింది. ఈ లైసెన్స్‌ను 2028 వరకు పొడిగించారు. ప్రస్తుతం ఈ సంస్థ లీయర్‌ జెట్‌ 45/45 ఎక్స్‌ ఆర్‌ వంటి విమానాలతో పాటు ఎయిర్‌ అంబులెన్స్, ఏవియేషన్‌ కన్సల్టెన్సీ సేవలను అందిస్తోంది. ఇటీవల మహారాష్ట్రలో వీఎస్సార్‌ లియర్‌ జెట్‌ కూలిపోవడం వల్లే ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మృతి చెందిన విషయం తెలిసిందే.  

హెరిటేజ్‌ ఫిన్‌లీజ్‌..  
హెరిటేజ్‌ అనుబంధ సంస్థగా పాడి రైతులకు రుణాలను ఇచ్చే లక్ష్యంతో 1996 డిసెంబర్‌ 23న హైదరాబాద్‌ కేంద్రంగా హెరిటేజ్‌ ఫిన్‌ లీజ్‌ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సంస్థలో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, అక్కిరాజు చంద్రమౌళి, ఎం.సాంబశివరావు, కొల్లి దుర్గాప్రసాదరావు, భూదర్‌ కుమార్‌ కరుటూరి, కొంపెల్ల వెంకటేశ్వర్లు, నర్రావుల నాగేశ్వరరావులు డైరెక్టర్లుగా ఉన్నారు. రైతుల కోసం ఉద్దేశించిన ఈ సంస్థ వందల కోట్ల రూపాయలు విమానయాన సంస్థకు దారి మళ్లించడం చర్చనీయాంశంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement